RBI/2015-16/206 DCBR. RCBD.BPD.No.4/19.51.010/2015-16 అక్టోబర్ 15, 2015 చీఫ్ ఎక్జెక్యూటివ్ ఆఫీసర్స్ ప్రాథమిక (నగర) సహకార బ్యాంకులు/ రాష్ట్ర/ కేంద్ర సహకార బ్యాంకులు అమ్మా/అయ్యా ఆర్థిక సంఘటన నిధి (Financial Inclusion Fund, FIF)- సవరించిన మార్గదర్శకాలు ఆర్థిక సంఘటన నిధి (FIF), మరియు ఆర్థిక సంఘటన, సాంకేతిక నిధి (FITF) ఒకొక్కటి రూ. 500 కోట్ల మూలనిధితో (భారత ప్రభుత్వం, భారతీయ రిజర్వ్ బ్యాంక్, NABARD, 40: 40: 20 నిష్పత్తిలో చేసిన ధన సహాయంతో) 2007-08 సంవత్సరంలో, అయిదేళ్ళ కాలానికి స్థాపించబడ్డాయన్న విషయం మీకు విదితమే. ఈ నిధులపై మార్గదర్శకాలు, కేంద్ర ప్రభుత్వంచే సూత్రీకరించబడ్డాయి. ఏప్రిల్ 2012 లో, రిజర్వ్ బ్యాంక్, ప్రాధాన్య రంగ రుణాల లో లోటు ఉండడం వల్ల చేయవలసిన, RIDF, STCRC డిపాజిట్లపై 0.5% కంటే ఎక్కువ ఉన్న భేదాన్ని, (interest differential) బదిలీ చేయడం ద్వారా, FIF కు నిధులు సమకూర్చాలని నిశ్చయించింది. 2. ఇటీవలి సంవత్సరాల్లో పరిణామాల రీత్యా, ప్రభుత్వం FIF, FITF లను రెంటినీ విలీనంచేసి, ఒకే FIF ఏర్పాటు చేసింది. రిజర్వ్ బ్యాంక్, ప్రభుత్వంతో సంప్రదించి, నూతన FIF నిధుల వినియోగానికి, క్రొత్తగా కార్యక్రమాలను, మార్గదర్శకాలను, నిర్ణయించింది. క్రొత్త FIF, కేంద్ర ప్రభుత్వం పునర్నిర్మించిన సలహా సంఘం చే (Advisory Board) అమలు పరచబడి, NABARD చే నిర్వహించబడుతుంది. 3. నూతన FIF కు సంబంధించి, సవరించిన మార్గదర్శకాల ప్రతి, సమాచారం నిమిత్తమై జతచేయబడింది. విధేయులు, సుమా వర్మ ప్రిన్సిపల్ చీఫ్ జనరల్ మేనేజర్ జతపరచినవి: పైన తెలిపినది
ఆర్థిక సంఘటన నిధి (FIF) – మార్గదర్శకాలు 1. నిధి ఏర్పాటు 1.1 మొదటి అయిదు సంవత్సరాలు పూర్తి అయైన తరువాత, ఇప్పుడు FIF, FITF లను రెంటినీ విలీనం చేసి ఒకే FIF గా చేయాలని నిశ్చయించడం జరిగింది. 1.2 తన FIF యొక్క మొత్తం మూలధనం, రూ. 2000 కోట్లు. ప్రాధాన్య రంగ రుణాల జారీలో లోటు (రిజర్వ్ బ్యాంక్ కాలానుగుణంగా సూచించినదాని కంటే) ఉండడం వల్ల బ్యాంకులు NABARD వద్ద ఉంచిన, RIDF, STCRC డిపాజిట్లపై 0.5% కంటే ఎక్కువ ఉన్న భేదాన్నుంచి, (interest differential) నిధికి ఆర్థిక సహాయం అందించ బడుతుంది. 1.3 పూర్వపు FITF యొక్క అసెట్లు, లయబిలిటీలు క్రొత్త FIF కు బదిలీ చేయబడతాయి. FITF అపుడున్న పరిధిలో, ముందే ఆమోదించిన ప్రణాళికల వ్యయం, క్రొత్త FIF కు బదిలీ చేయబడుతుంది/నిధులనుండి పూరించబడుతుంది. 1.4 ఈ నిధి మరో మూడేళ్ళు, లేదా రిజర్వ్ బ్యాంక్, కేంద్ర ప్రభుత్వం మిగిలిన సభ్యులతో చర్చించి, నిర్ణయించిన కాలంమేరకు అమలులో ఉంటుంది. 2. FIF లక్ష్యాలు నిధి లక్ష్యం, ఈ క్రింది కార్యక్రమాలకు సహాయం అందించడం:- ఆర్థిక సంఘటితానికై ఉద్దేశించిన కార్యక్రమాల ప్రోత్సాహం/అభివృద్ధి. ఆర్థిక సంఘటి తానికై దేశవ్యాప్త వ్యవస్థను ప్రోత్సహించుట. స్టేక్ హోల్డర్ల సమర్థత పెంచుట ఆశించబడుతున్న సేవల గురించి అవగాహన పెంపొందించుట పర్యావరణ హితమైన ఇన్‌ఫర్మేషన్ మరియు కమ్యూనికేషన్ టెక్నాలజీ అభివృద్ధికై పెట్టుబడి పెంచుట పరిశోధన/ సాంకేతిక విజ్ఞాన వ్యాప్తి ఆర్థిక సేవలందించే సంస్థలు/వినియోగదారులు మరింతగా సాంకేతికతను అంగీకరించునట్లు చేయుట. నిధులు, సాధారణ బ్యాంకింగ్ వ్యాపారానికి, కార్యాకలాపాలకు, వినియోగించబడవు. 2.1 రిజర్వ్ బ్యాంక్, ముందునుంచీ కూడా, ఆర్థిక సంఘటితం ఒక వ్యాపార ప్రతిపాదనగానే చూస్తూ వచ్చింది. అందువల్లనే, ఆర్థిక సంఘటితం కోసం చేసిన వ్యయం, భవిష్యత్తులో బ్యాంకుల వ్యాపార విస్తృతికి, అభివృద్ధికి తోడ్పడే ఒక దీర్ఘకాలిక పేట్టుబడిగా భావించాలని సూచించింది. అదేసమయంలో, ఈ కార్యానికై, బ్యాంకులు, అధిక పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడానికి, నియంత్రణా పరంగా, ప్రభుత్వం పరంగా ప్రమేయం అవసరమని గ్రహించింది. ఈ ఉద్దేశరీత్యా FIF స్థాపన, కొనసాగింపు, సమర్థనీయమే. 2.2 రిజర్వ్ బ్యాంక్ విధాన ప్రకటనల అధారంగా, బ్యాంకులు ICT-BC పద్ధతిని విరివిగా అనుసరించి, బ్యాంకులు లేని ప్రాంతాల్లో, బ్యాంకింగ్ సౌకర్యాలని విస్తరించాయి. భవనాల్లోంచి బ్యాంక్ సేవలు అందిండానికి, అయే వ్యయంతో పోలిస్తే, ICT- BC విధానంలో అయే వ్యయం తక్కువ. అయినాగానీ, దీనికై బ్యాంకులు/ఇతర ఆర్థిక సంస్థలనుండి, పెద్ద మొత్తంలో పెట్టుబడుల అవసరం ఇంకా ఎంతో ఉంది. 2.3 గత ఐదేళ్ళలో, బ్యాంకులులేని ప్రాంతాల్లో, సేవలని సమకూర్చడానికి, పెద్ద సంఖ్యలో వ్యాపార ప్రతినిధులని నియమించడానికి కావలసిన మౌలిక వ్యవస్థ ఏర్పాటుకై బ్యాంకులు ఎంతోపెట్టుబడి పెట్టాయి. దీనివల్ల, ఎంతోమంది కొత్త ఖాతాదార్లు, మొదటిసారిగా, ప్రాథమిక బ్యాంక్ ఖాతాలు తెరిచారు. అయితే ఈ ఖాతాల్లో, ఇంకా చెప్పుకోదగ్గ సంఖ్యలో లావాదేవీలు లేవు. బ్యాంకులుకూడా చేసిన పెట్టుబడికి తగ్గ లాభాలు ఆర్జించడం మొదలు పెట్టలేదు. దీనితో బ్యాంకింగ్ ప్రతినిధులు, తగినంత పనిలేని కారణంగా, సంపాదన లేని కారణంగా, ఉద్యోగం నుండి విరమిస్తున్నారు. సరైన సమాచార మార్గాలు, బ్యాంకింగ్ ప్రతినిధులకు శిక్షణా సదుపాయాలు, తగిన వ్యాపార ప్రణాళిక లేకపోవడం మొదలైనవి, BC విధానాన్ని బలిష్ఠంచేయడానికి అడ్డువస్తున్న, కొన్ని ఇబ్బందులు. ఈ సమస్యలని పరిష్కరించి, ఆర్థిక సంఘటితం కోసం చేస్తున్న ప్రయత్నాలను మెరుగు పరచడమే క్రొత్త FIF యొక్క లక్ష్యం కావాలి. 2.4 పై అంశాలు, ఎటువంటి కార్యక్రమాలకు, FIF నుండి సహాయం అందించాలి అన్న విషయంపై, పునరాలోచనకు దారి తీశాయి. 3. అర్హమైన కార్యక్రమాలు, ప్రయోజనాలు 3.1 ఆర్థిక సంఘటన మరియు అక్షరాస్యత వృద్ధికై కేంద్రాలు స్థాపించడానికి, నిర్వహణకు అయ్యే వ్యయం. PMJDY క్రింద, ప్రాంతీయ స్థాయి వరకు, ఆర్థిక సంఘటన మరియు అక్షరాస్యత కేంద్రాలు స్థాపించాలి అన్న భారత ప్రభుత్వ లక్ష్యానికి ఇది అనుగుణంగా ఉంది. ఈ కేంద్రాలను, నిర్వహించడానికి బ్యాంకులు క్రొత్తగా నియమించిన (బ్యాంకులు సిబ్బంది కొరతని ఎదురుకొంటున్నాయి గనుక) సాంకేతిక సిబ్బంది ఖర్చుకై, నిధినుంచి సహాయం అందుతుంది. ఈ కేంద్రాల కార్యక్రమాలు ఈ క్రింది పరిధిలో ఉండాలి.
-
ఆ ప్రాంతంలోని వ్యక్తులకూ వారి పరివారానికీ అర్థిక అక్షరాస్యత పై శిక్షణనివ్వడం.
-
బ్యాంక్ ఖాతాలు తెరవడానికి, ఇతర బ్యాంకింగ్, ఆర్థిక కార్యకలాపాలు సాగించడానికి, తగిన సలహా ఇవ్వడం.
-
ఖాతాదారులకు సులభంగా సేవలందించడానికి, బ్యాంక్ ప్రతినిధులకు, బ్యాకింగ్/ఇతర ఆర్థిక సదుపాయాలు, సేవలపై మరియు సాంకేతిక సాధనాల వినియోగం పై శిక్షణనివ్వడం
- ఖాతాదారుల ఫిర్యాదులు పరిష్కరించడం. (అవసరమైతే బ్యాంకులను/ఇతర సంస్థలను, సంప్రదించి).
3.2 గ్రామ పంచాయితీల్లో, స్టాండర్డ్ ఇంటర్ ఏక్టివ్ ఫైనాన్షియల్ లిటరేసీ కియాస్క్ లు (Interactive Financial Literacy kiosks) ఏర్పాటు చేయడం. ఇంతకు ముందు చేయని ప్రాంతాల్లో, బ్యాంకులు చేపట్టిన ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమాలు నిర్వహించడం. 3.3 NABARD/బ్యాంకులకు 'వ్యాపార, నైపుణ్య అభివృద్ధి కేంద్రాలు' (Business and Skill Development Centres) నిర్వహించడానికి (రాష్ట్ర ప్రభుత్వాలు అందించిన సహాయం లో కొరత ఉన్నంతమేరకు, R-SETI తో సహా). ఈ కేంద్రాలు, ఆదాయ ఆర్జన కార్యక్రమాలు చేపట్టడానికీ,, వ్యాపారానికి అవసరమయిన నైపుణ్యాలను పెంపొందిస్తాయి. ప్రారంభ మూలధనానికి, మూడు ఏళ్ళ వరకు నిర్వహణ వ్యయానికి, సహాయం ఇవ్వబడుతుంది. NABARD/బ్యాంకులు, వారి విచక్షణను బట్టి, ఇతర కార్పొరేట్‌లను, ప్రభుత్వేతర సంస్థలను (Corporates and NGOs) భాగస్వాములుగా చేసుకోవచ్చు. అయితే, నిధుల సహాయానికై ప్రతిపాదనలు మాత్రం, బ్యాంకులు లేదా NABARD మాత్రమే ఆమోదిస్తాయి. 3.4 వినూత్నమైన ప్రక్రియలని, విధానాలని అభివృద్ధి చేయడానికి ఉద్దేశించిన, ప్రయోగాత్మక ప్రణాళికలను ప్రొత్సహించడానికి సహాయం చేయబడుతుంది. ఈ ప్రతిపాదనలు, బ్యాంకుల ద్వారా సమర్పించాలి. 3.5 అధికృత సంస్థలకు, ఆర్థిక సంఘటితానికి సంబంధించిన కార్యక్రమాల పురోగతిపై సర్వేలు నిర్వహించడానికి, ద్రవ్య సహాయం సమకూర్చబడుతుంది. 3.6 క్రొత్త ప్రదేశాల్లో, నెట్‌వర్క్ కనెక్టివిటీ ఏర్పాటుకై, ఫైబర్ ఆప్టిక్ నెట్‌వర్క్, ఇతర సాంకేతిక, మౌలిక సదుపాయాలు నెలకొల్పడానికి, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన వ్యయాన్ని పంచుకోవడానికి, సహాయం అందించబడుతుంది. 4. అర్హతగల సంస్థలు 4.1 ఆర్థిక సంస్థలు – అనగా, వాణిజ్య బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులు మరియు NABARD. 4.2 FIF నుండి ధనసహాయానికి, బ్యాంకులు కలిసి పనిజేయగల సంస్థలు:
-
ప్రభుత్వేతర సంస్థలు (NGOs)
-
స్వయం సహాయక సంఘాలు (SHGs)
-
ఫార్మర్స్ క్లబ్‌లు (Farmers Clubs)
-
ఫంక్షనల్ కో-ఆపరేటివ్స్ (Functional Co-operatives)
-
కార్పొరేట్ సంస్థల, IT సమర్థత గల గ్రామీణ ఔట్‌లెట్లు (IT Enabled Rural Outlets of Corporates)
-
సమర్థవంతంగా పనిచేస్తున్న పంచాయితీలు
-
గ్రామీణ బహుళప్రయోజన కియాస్క్‌లు/గ్రామ విజ్ఞాన కేంద్రాలు (Rural Multipurpose Kiosks/Village Knowledge Centres)
-
సేవా కేంద్ర సంస్థలచే, జాతీయ ఇ-గవర్నెన్స్ (NeGP) ప్రణాళిక క్రింద ఏర్పరచబడ్డ సామాన్య సేవా కేంద్రాలు (CSCs)
-
ప్రాథమిక వ్యవసాయ సంఘాలు (PACs)
|