RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S1

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78527473

గవర్నర్ నివేదిక, జూన్ 4, 2021

తేదీ: జూన్ 04, 2021

గవర్నర్ నివేదిక, జూన్ 4, 2021

ద్రవ్య విధాన కమిటీ (మానిటరీ పాలిసీ కమిటీ, ఎమ్ పి సి), జూన్ 2, 3, మరియు 4, 2021 తారీకులలో సమావేశమయింది. స్థూల ఆర్థిక పరిస్థితులలో కలుగుతున్న పరిణామాలను, మహమ్మారి రెండవ దశ ప్రభావాన్ని సమీక్షించడం జరిగింది. వారి అంచనాల ఆధారంగా, 4 శాతం ఉన్న పాలిసీ రెపో రేట్, యథాతథంగా ఉంచాలని ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఇంతేగాక, రాబోయే కాలంలో ద్రవ్యోల్బణం లక్ష్యాన్ని మించకుండా జాగ్రత్త వహిస్తూ, ఆర్థిక వ్యవస్థపై కోవిడ్-19 ప్రభావాన్ని ఉపశమింపచేస్తూ, దీర్ఘకాల అభివృద్ధిని పునరుద్ధరించుటకొరకు, అవసరమయినంత కాలం సానుకూల ధోరణి అవలంబించాలనికూడా, ఎమ్ పి సి ఏకగ్రీవంగా నిర్ణయించింది. ‘మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్’ మరియు ‘బ్యాంక్ రేట్’, మార్పులేకుండా, 4.25 శాతంగానే ఉంటాయి. ‘రివర్స్ రెపో రేట్’ కూడా, మార్పు లేకుండా 3.35 శాతంగా కొనసాగుతుంది.

2. ఏప్రిల్ నెలలో జరిగిన ఎమ్ పి సి సమావేశం తరువాత, కోవిడ్-19, రెండవ దశ అనేక రాష్ట్రాలలో ఉధృతమై, చిన్న పట్నాలు గ్రామలకుకూడా వ్యాపించి, అపారమైన వ్యధను విషాదాన్నీ మిగిల్చింది. ఈ పరీక్షా కాలంలో, వైరస్ నిర్మూలించడమే అతి ముఖ్యం. కష్టాలను అధిగమించి విజయం సాధించాలంటే, కఠినమైన నిర్ణయాలు తీసికోక తప్పదు. తుఫానువస్తే చెట్ల వేళ్ళు ఇంకా ధృడమౌతాయంటారు. వైరస్ నిర్మూలించడానికి సంకల్పిస్తే, మనలోగల ఔన్నత్యం, చేవ వెలికివస్తాయని నా విశ్వాసం. ఈ సందర్భంగా నాకు గ్రీకు తత్త్వవేత్త ఎపిక్టీటస్ పలుకులు గుర్తు వస్తున్నాయి – “ఎంత పెద్ద కష్టాన్ని అధిగమిస్తే, అంతా ఎక్కువ కీర్తి దక్కుతుంది ...”1.

3. ఈనాటి తీర్మానానికి, హేతువైన కారణాలు వివరిస్తాను. మే 31, 2021 న జాతీయ గణాంక కార్యాలయం (నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్, ఎన్ ఎస్ ఓ) విడుదలచేసిన జాతీయ ఆదాయ తాత్కాలిక అంచనాలు, దేశ వాస్తవ జాతీయ ఉత్పత్తి (జి డి పి) 2020-2021 సంవత్సరంలో 7.3 శాతం సంకోచిస్తుందని, నాలుగవ త్రైమాసికంలో, క్రితం సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఇయర్ ఆన్ ఇయర్) 1.6 శాతం అధికమవుతుందని సూచించాయి. సాధారణ నైరుతి ఋతుపవనాలు, వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండటం, కోవిడ్ కు తగిన విధంగా వ్యాపార విధానాలలో మార్పు, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ మెరుగవటం, కోవిడ్ రెండవ దశ తరువాత, దేశీయ ఆర్థిక వ్యవస్థకు ఊపునిస్తాయి. కానీ, కోవిడ్-19 గ్రామీణ ప్రాంతాలకు వ్యాపించడం, పట్టణాలలో గిరాకీ తగ్గడంవల్ల కొంత దిగజారే భయం ఉంది. టీకా కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టటం, ఆరోగ్య సేవా వ్యవస్థకు అవసరమయిన మందుల కొరత తీర్చడం ద్వారా మహామారివల్ల జరిగిన వినాశనాన్ని తగ్గించవచ్చు.

4. ఏప్రిల్ నెలలో ద్రవ్యోల్బణం 4.3 శాతానికి రావడం, కొంత ఊరట కల్గించడమేగాక, విధాన మార్పులకు వెసులుబాటు కల్పించింది. సాధారణమైన నైరుతి ఋతుపవనాలు, నిల్వలు, తృణధాన్యాల ధరలను అదుపులో ఉండడానికి సహాయపడతాయి. కానీ, పెరుగుతున్న అంతర్జాతీయ చమురు ధరలు, వస్తువుల ధరలు, రవాణా ఖర్చులు ధరల పరిస్థితిని అధ్వానం చేస్తున్నాయి. ఈ పరిణామాల కారణంగా, కీలక ధరలు ప్రియంగానే ఉంటాయి. తగ్గిన గిరాకీ, వినియోగదార్ల ద్రవ్యోల్బణాన్ని కొంతమేరకు నిగ్రహించవచ్చు.

5. అన్ని అంశాలు పరిగణనలోకి తీసికొని, 2020-21 మొదటి అర్ధ సంవతరంలో కనిపించిన అభివృద్ధి కొనసాగడానికి, కుదురుపడుతున్న పరిస్థితిని బలోపేతంచేయడానికి, అన్ని రకాలుగా విధాన సహకారం అవసరమని, ఎమ్ పి సి భావిస్తోంది. తదనుసారంగా, ప్రస్తుతం ఉన్న 4 శాతం పాలిసీ రేటు యథావిధిగా కొనసాగిస్తూ, రాబోయే కాలంలో ద్రవ్యోల్బణం లక్ష్యాన్ని మించకుండా జాగ్రత్త వహిస్తూ, ఆర్థిక వ్యవస్థపై కోవిడ్-19 ప్రభావాన్ని ఉపశమింపచేస్తూ, దీర్ఘకాల అభివృద్ధిని పునరుద్ధరించుటకొరకు, అవసరమయినంత కాలం సానుకూల ధోరణి అవలంబించాలని, ఎమ్ పి సి నిర్ణయించింది.

అభివృద్ధి మరియు ద్రవ్యోల్బణ అంచనాలు

అభివృద్ధి

6. మొదటి సారికన్న, కోవిడ్-19 రెండవ దశ ఊహించనంత తీవ్రంగా చెలరేగి అనేక ప్రాణాలు బలితీసికొంది. మార్పుచెందిన వైరస్ విస్తారంగా వ్యాప్తి చెందుతున్నందువల్ల దేశంలో అనేక పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో, కొత్త నిర్బంధాలు విధించబడ్డాయి. మొదటి దశలో, దేశం మొత్తం లాక్ డౌన్ విధించిన కారణంగా, ఆర్థిక కార్యకలాపాలు ఆకస్మాత్తుగా నిలిచిపోయాయి. రెండవ దశలో, నిర్బంధాలు కొన్ని ప్రాంతాలలో మాత్రమే, అదీ విచక్షణాయుతంగా విధించడంవల్ల, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం కొంతమేరకు నిలవరించబడింది. అదేగాక, ప్రజలు, వ్యాపారస్తులు మహమ్మారి బారినపడకుండా మార్పుచేసిన పని విధానాలు అవలంబిస్తున్నారు.

7. హై ఫ్రీక్వెన్సీ సూచీలు (విద్యుత్ వినియోగం; రైలు రవాణా ఛార్జీలు; ఓడ రవాణా; ఉక్కు వినియోగం; సిమెంట్ ఉత్పత్తి; ఈ-వే బిల్లులు; సుంకం వసూళ్లు) – ఏప్రిల్-మే 2021 లో పట్టణ ప్రాంతాలలో గిరాకీ కొంత తగ్గినట్లు తెలుపుతున్నాయి. చాలా రాష్ట్రాలలో విధించిన నిర్బంధాలు / ఆంక్షలవల్ల, తయారీ మరియు సేవా రంగాలు నీరసపడడం దీనికి కారణం. ఏప్రిల్ - మే లో మొబిలిటీ సూచీలు క్షీణించాయి, కానీ అవి మొదటి దశలో సూచీలకన్న ఎక్కువే ఉన్నాయి. దేశీయ విత్త మరియు ఆర్థిక పరిస్థితులు, ఆర్థిక క్రియాకలాపాలకు సానునయంగా ఉన్నాయి. పైగా, రాబోయే కాలంలో టీకా కార్యక్రమం ఊపందుకొంటుందని అంచనా. దీనితో, ఆర్థిక కార్యకలాపాలు సామాన్యస్థితికి చేరుకొంటాయి.

8. ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు మెరగవుతున్నందువల్ల, విదేశీ గిరాకీ బలపడుతోంది. ఇది భారతీయ ఎగుమతి రంగానికి తోడ్పడుతుంది. ఆభివృద్ధి చెందిన దేశాలలో ఆర్థిక ఉద్దీపనలు అందిస్తున్న కారణంగా మరియు టీకా కార్యక్రమాలు వేగవంతంగా జరుగుతున్నందువల్ల, విదేశీ గిరాకీ మరింత పెరుగుతుంది. మార్చి, ఏప్రిల్, మే 2021 నెలల్లో భారతీయ ఎగుమతుల పెరుగుదల ప్రారంభమయింది. కోవిడ్ ముందు స్థాయికి చేరుకోవడానికి విదేశీ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ప్రస్తుతం, ప్రత్యేకించి ఎగుమతులను ప్రోత్సహించే విధానాలపై దృష్టి కేంద్రీకరించడం అవసరం.

9. ఏప్రిల్ నెలలో, గ్రామీణ గిరాకీ సూచీలు వరుసగా పడిపోతున్నా, వర్షాపాతం సామాన్యంగా ఉంటుందన్న అంచనామూలంగా ఇకపైన కోలువచ్చు. అయితే, కోవిడ్-19 గ్రామీణ ప్రాంతాలకు ప్రాకడంవల్ల పరిస్థితి దిగజారవచ్చు. పై అంశాలన్నీ పరిశీలించిన తరువాత 2021-22 సంవత్సరంలో, వాస్తవ స్థూల దేశీయోత్పత్తి (రియల్ జి డి పి) 9.5 శాతం ఉండవచ్చని అంచనా (2021-22 మొదటి త్రైమాసికం-18.5 శాతం; రెండవ త్రైమాసికం-7.9 శాతం; మూడవ త్రైమాసికం-7.2 శాతం నాలుగవ త్రైమాసికం 6.6 శాతం).

ద్రవ్యోల్బణం

10. ఇక ద్రవ్యోల్బణం విషయానికి వస్తే, సానుకూలమైన మూలాల ప్రభావంగా ఏప్రిల్ నెలలో 1.2 శాతం తగ్గిన ‘హెడ్ లైన్ ఇన్ఫ్లేషన్’, వర్షాలు విస్తరిస్తున్న కారణంగా మరియు సరఫరాలో ఆటంకాలు తొలగించుటకు ప్రభుత్వం చర్యలు తీసికొన్న కారణంగా, మొదటి అర్ధ సంవత్సరమంతా అలాగే కొనసాగవచ్చు. అయితే, కోవిడ్ రెండోదశ విజృంభించిన కారణంగా దాదాపు దేశమంతా విధించిన నిర్బంధాలవల్ల, ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంది. ఇది గనక జరిగితే, సరఫరా సమస్యల కారణంగా చిల్లర ధరలు పెరగకుండా, కేంద్ర / రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉండి, సకాలంలో, సమన్వయంతో చర్యలు తీసికోవాలి.

11. ఈ అంశాలన్నీ పరిగణనలోనికి తీసికొని సి పి ఐ ద్రవ్యోల్బణం 2021-22 లో 5.1 శాతంగా (2021-22 మొదటి త్రైమాసికం-5.2 శాతం; రెండవ త్రైమాసికం-5.4 శాతం; మూడవ త్రైమాసికం-4.7 శాతం మరియు నాలుగవ త్రైమాసికం 5.3 శాతం) ఉంటుందని అంచనా.

ద్రవ్యత మరియు ఆర్థిక విపణులపై నిర్దేశం

12. మహమ్మారి సమయంలో, ఆర్థిక విపణులు / సంస్థలు యథావిధిగా పనిచేయుటకు తగిన పరిస్థితులు కల్పించడమే ప్రథమ ధ్యేయంగా రిజర్వ్ బ్యాంక్ కృషి చేసింది. తదనుసారంగా, విధానస్థాయి మార్పులద్వారా, ఒత్తిడిలో ఉన్న సంస్థలకు / రంగాలకు చాలినంత ద్రవ్యత కల్పించింది. దీని ఫలితంగా, రుణాల ధర మరియు ‘స్ప్రెడ్’ ఎన్నడూలేనంతగా తగ్గిపోయాయి. ఈ ప్రేరణతో, 2020-21 ఆర్థిక సంవత్సరంలో, కార్పొరేట్ బాండ్లు, డిబెంచర్ల ద్వారా ప్రైవేట్ రుణాలు రికార్డ్ స్థాయికి చేరుకొన్నాయి. రిజర్వ్ మనీ, మే 28, 2021 తేదీన, 12.4 శాతం (వై-ఓ-వై)2 పెరిగింది; మే 21 తేదీన మనీ సప్లై (ఎమ్ 3) 9.9 శాతం (వై-ఓ-వై) పెరిగింది; మే 21 తేదీన బ్యాంక్ రుణాలు 6.0 శాతం (వై-ఓ-వై) పెరిగాయి. ప్రభుత్వ సెక్యూరిటీల కొనుగోలు కార్యక్రమం (గవర్నమెంట్ సెక్యూరిటీస్ అక్విజిషన్ ప్రోగ్రామ్, జి- ఎస్ ఏ పి); కొన్ని రద్దు చేసిన దృష్టాంతాలు; డివాల్వ్ మెంట్; ప్రకటించిన విలువను మించి ప్రభుత్వ సెక్యూరిటీలు వేలం వేసిన చర్యలద్వారా, రిజర్వ్ బ్యాంక్ ఉద్దేశం మార్కెట్లకు తెలిసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో, రెండవ దశ తీవ్రమయినందువల్ల, వ్యవస్థలో ద్రవ్యత కన్నా, దాని సమవితరణవైపు రిజర్వ్ బ్యాంక్ దృష్టి మరలిస్తోంది. నిజానికి, అందరు భాగస్వాములకు సమరీతిలో ద్రవ్యత కేటాయించే అసామాన్య ద్రవ్య విధాన చర్యలు రూపొందించడం, భారతదేశంలో మహమ్మారి అనుభవంతో నేర్చుకొన్న పాఠం. మహమ్మారి కోరలనుండి కోలుకొని, ఆర్థిక వ్యవస్థ తిరిగి స్థిరమైన ప్రగతిమార్గం పట్టేవరకు, వివిధ మార్కెట్ మార్గాలద్వారా అవసరమైన సక్రియాత్మక మరియు ముందుచర్యలు చేపట్టడానికి మేము శ్రమిస్తూనే ఉంటాము.

13. ఇంతవరకు జరిపిన రెండు వేలం కార్యక్రమాలలో, ‘బిడ్ కవర్ రేషియోలు’ వరుసగా 4.1 మరియు 3.5 ఉండడం, జి ఎస్ ఏ పి 1.0 వేలాలలో, మార్కెట్ భాగస్వాములు, ఉత్సాహంగా పాల్గొన్నారని సూచిస్తుంది. మే 22, 2021నుండి క్షీణించిన (నగదు నిల్వల నిష్పత్తి, మహమ్మారికి ముందు స్థాయికి అనగా నికర డిమాండ్ అండ్ టైమ్ లయబిలిటీస్ లో, 4.0 శాతానికి తెచ్చిన కారణంగా క్షీణించిన), ద్రవ్యతను తిరిగి భర్తీచేసే ఉద్దేశంతో, తగిన సమయంలో రెండవ వేలం నిర్వహించబడింది. అదనంగా, మే చివరివారంలో, రూ. 52,000 కోట్ల ప్రభుత్వ సెక్యూరిటీల తిరిగి చెల్లింపు, పునరుద్ధరించిన సి ఆర్ ఆర్ ప్రభావాన్ని పూర్తిగా తటస్థం చేసింది. జి ఎస్ ఏ పి కార్యకలాపాలు, ఆర్థిక విపణిలోని ఇతర భాగాలపై - ప్రత్యేకించి కార్పొరేట్ బాండ్లు, డిబెంచర్లు - సానుకూల ప్రభావం చూపాయి. కమర్షియల్ పేపర్ (సి పి), 91-రోజుల ట్రెజరీ బిల్స్, మరియు సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ల (సి డిలు) పై వడ్డీరేట్లు, తక్కువగానే, ఒక పరిమితిలో ఉన్నాయి.

14. ద్రవ్య విధానానికి అనుగుణ్యంగా ద్రవ్యత కల్పించేందుకు మరియు ఆర్థిక పరిస్థితులు, భాగస్వాములందరకూ సహాయపడేందుకు, జి - ఎస్ ఏ పి కి అదనంగా, ఎల్ ఏ ఎఫ్, దీర్ఘకాలిక రెపో / రివర్స్ రెపో వేలం, విదేశీ ముద్రా లావాదేవీలు మరియు ఓపెన్ మార్కెట్ అపరేషన్లు (ఓ ఎమ్ ఓ లు, ప్రత్యేక ఓ ఎమ్ లతో సహా) కొనసాగిస్తామని, ఏప్రిల్ 7, 2021 తేదీ, నా నివేదికలో తెలియచేశాను. రిజర్వ్ బ్యాంక్ ఈసంవత్సరం, ఇంతవరకు, రూ. 60,000 కోట్ల జి-ఎస్ ఏ పి నిర్వహించడమేగాక, అదనంగా రూ. 36,545 కోట్ల మేరకు సాధారణ ఓ ఎమ్ ఓల (మే 31 వరకు) ద్వారా, అదనపు ద్రవ్యత కల్పించింది. యీల్డ్ కర్వ్ సజావుగా పరిణతి చెందుటకు, మే 6, 2021 తేదీన, ‘ఆపరేషన్ ట్విస్ట్’ క్రింద, కొనుగోలు / అమ్మకం వేలం నిర్వహించడం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఇకపైకూడా, ద్రవ్యత నిర్వహణకు తగిన చర్యలు తీసికొంటుంది.

15. ఈ పరిణామాల్ని పరిగణించి, జి-ఎస్ ఏ పి 1.0 క్రింద జూన్ 17, 2021 న మరొక రూ. 40,000 కోట్ల ప్రభుత్వ సెక్యూరిటీలు కొనుగోలు నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. దీనిలో రూ. 10,000 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి రుణాల (ఎస్ డి ఎల్) కొనుగోలుకు వినియోగించబడుతుంది. మార్కెట్ కు ఊతమివ్వడానికి, 2021-22 రెండవ త్రైమాసికంలో, జి – ఎస్ ఏ పి 2.0 నిర్వహించి, రూ.1.20 లక్షలకోట్ల సెకండరీ మార్కెట్ కొనుగోళ్లు చేయాలనికూడా నిశ్చయించబడింది. జి-ఎస్ ఏ పి నిర్వహించే తేదీలు, వేరుగా తెలపబడతాయి. మార్కెట్ నుండి జి-ఎస్ ఏ పి కి తగిన స్పందన లభిస్తుందని భావిస్తున్నాము.

16. ఏప్రిల్-మే లో రిట్రెన్చ్ మెంట్, రిస్క్-ఆఫ్ సమయం ముగిసిన తరువాత, దేశంలోకి మూలధన ప్రవాహం మళ్ళీ మెరుగుపడుతోంది. ఈ నిధులు బాహ్య ఆర్థిక అవసరాలకు తోడ్పడినా, ఆర్థిక విపణులను, అసెట్ ధరలను, చపలం చేస్తాయి. పైగా, ద్రవ్యతలో అవాంఛితమైన, అనుకోని హెచ్చు తగ్గులు సృష్టించి, ద్రవ్య విధానాన్ని నీరుగారుస్తాయి. అందువల్ల, ఆర్థిక విపణులలో, ద్రవ్యతలో స్థిరత్వం నెలకొల్పి, ద్రవ్య విధానం జాతీయ లక్ష్యాలసాధనకు ఉపయోగపడుటకు రిజర్వ్ బ్యాంక్, స్పాట్, ఫార్వర్డ్ మరియు ఫ్యూచర్ మార్కెట్లలో ద్విముఖ వ్యూహాన్ని పాటించడం అవసరమయింది. ఈ కారణంగా, రిజర్వ్ బ్యాంక్, విదేశీ మారక విపణులలో, వాటి వివిధ భాగాలలో, చురుకుగా కొనుగోళ్లు అమ్మకాలు రెండూ చేస్తుంది. విశ్వవ్యాప్తంగా ఎంతో అనిశ్చితినెలకొన్నా, మనదేశంలో మార్కెట్లు మరియు విదేశీ మారక రేట్లలో స్థిరత్వం, ఈ ప్రయత్నాలు ఫలించాయనడానికి నిదర్శనం. ఈ విధానం పాటించిన కారణంగా, విదేశీ మారక నిల్వలు పెరిగి, దేశ బ్యాలన్స్ షీట్ బలోపేతమయింది.

17. ఆర్థిక శాస్త్రవేత్తలు, మార్కెట్ భాగస్వాములు మరియు విశ్లేషకులు చాలా ఆసక్తిగా చర్చించే అంశం – మేము ప్రకటించే భవిష్య నిర్దేశాల పాత్ర మరియు ఔచిత్యం. ఏప్రిల్ నెలలో, ఎమ్ పి సి, మహమ్మారి కారణంగా ఆర్థిక వ్యవస్థ ఏరకంగా మారుతుందో, ఎప్పుడు స్థిరంగా కోలుకొంటుందో ఊహించడం కష్టంగనుక, కాలం ఆధారంగా కాకుండా, రాష్ట్రం ఆధారంగా భవిష్య నిర్దేశాలు చేయాలని నిర్ణయించింది. ఈ అనిశ్చిత పరిస్థితులలో, రిజర్వ్ బ్యాంక్ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించి, స్థిరమైన అభివృద్ధి సాధించుటకు, శక్తివంచన లేకుండా కృషిచేస్తుంది. మేము చేపట్టిన చర్యలు మా సందేశాలకు క్రమబద్ధత, విశ్వసనీయత కల్పిస్తాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

18. మహమ్మారితో పోరాడడానికి, ఆర్థిక వ్యవస్థ ధృడంగా ఉండటం ఎంతో కీలకమని నేను ప్రత్యేకించి చెబుతున్నాను. ముఖ్యంగా, బ్యాంకులు, ఎన్ బి ఎఫ్ సిలు కోవిడ్-19 వల్ల జరిగిన ఆర్థిక వినాశనాన్ని ఉపశమింపచేయుటకొరకు ముందు వరసలో ఉన్న కారణంగా. తగినంత కేటాయింపులు, అదనపు మూలధనం (క్యాపిటల్ బఫర్), ఆర్థిక సంస్థలలో కార్పొరేట్ గవర్నెన్స్, ఇంతకు మునుపెన్నడూ లేనంత ప్రాముఖ్యత సంతరించుకొన్నాయి, ఆర్థిక సుస్థిరత కాపాడుతూ, ఆర్థిక రంగం పటిష్టంగా, సమర్థవంతంగా వృద్ధిచెందుటకు దోహదంచేసే వాతావరణం కల్పించడానికి రిజర్వ్ బ్యాంక్ కట్టుబడి ఉంది.

అదనపు చర్యలు

19. ఈ నేపథ్యంలో, స్థూల ఆర్థిక స్థితి మరియు ఆర్థిక విపణుల పరిస్థితులపై నిరంతర అంచనాల ఆధారంగా, కొన్ని అదనపు చర్యలు ప్రకటిస్తున్నాము. ఈ చర్యల వివరాలు, ‘ద్రవ్య విధాన నివేదిక’, ‘పురోగమనశీల మరియు నియంత్రణ విధానాల నివేదిక’ (పార్ట్ బి) లో పేర్కొనబడ్డాయి. అదనపు చర్యలు ఈ క్రింద వివరించబడ్డాయి.

వ్యక్తుల ప్రత్యక్ష కలయిక అనివార్యమయే సేవా రంగాలకు, నిరంతరం (ఆన్ ట్యాప్) లభించే ద్రవ్యత సౌకర్యం

20. కోవిడ్ రెండో దశ ప్రతికూల ప్రభావాన్ని ఉపశమింపచేసే దిశగా, ప్రత్యక్ష కలయిక అనివార్యమయే ప్రత్యేక సేవా రంగాలకొరకు, రూ. 15,000 కోట్లతో, రెపో రేటుకు నిరంతరం లభించే మరొక ప్రత్యేక ద్రవ్యత సదుపాయం (గరిష్ట కాలపరిమితిమూడు సంవత్సరాలు). కల్పించబడుతోంది. ఈ సదుపాయం, మార్చి 2022 వరకు లభిస్తుంది. ఈ పథకంక్రింద బ్యాంకులు - హోటళ్ళు మరియు రెస్టారెంట్లు; పర్యటన – పర్యాటన ఏజంట్లు; విహార యాత్రా నిర్వాహకులు; సాహస / సాంస్కృతిక యాత్రా సౌకర్యాలు; విమానయాన మరియు తత్సంబంధిత సేవలు - ప్రయాణీకుల మరియు సరఫరా నిర్వహణ; ప్రైవేటు బస్ నిర్వాహకులు, కారు మరమ్మత్తు / అద్దె కారు సేవలు; కార్యక్రమాల / సమావేశాల నిర్వాహకులు; ఆరోగ్య చికిత్సశాలలు; సౌందర్య పోషణ కేంద్రాలు / క్షవరశాలలు మొదలైనవాటికి క్రొత్త ఋణ సదుపాయాలు కల్పించవచ్చు. ఇందుకు ప్రోత్సాహకంగా, బ్యాంకులు ఈ పథకం క్రింద తెరిచిన ‘లోన్ బుక్’ విలువమేరకు, వారి వద్ద గల అధిక ద్రవ్యతను, రెపో రేటుకన్న 25 బేసిస్ పాయింట్ల తక్కువ రేటుకు లేదా మరో రకంగా చెప్పాలంటే, రెవర్స్ రెపో రేటుకన్న 40 బేసిస్ పాయింట్లు ఎక్కువరేటుకు, రిజర్వ్ బ్యాంకులో దాచి ఉంచుకోవచ్చు.

ఎస్ ఐ డి బి ఐ కి (సిడ్బి కి), ప్రత్యేక ద్రవ్యత సౌకర్యం

21. ఇప్పుడిప్పుడే మొదలయిన అభివృద్ధిని పెంపొందించి, ఆర్థిక వ్యవస్థకు అవసరమైన నిధులు కల్పించుటకు వీలుగా, జాతీయ ఆర్థిక సంస్థలకు ఏప్రిల్ 7, 2021 న రిజర్వ్ బ్యాంక్, 2021-22 లో క్రొత్త రుణాలు మంజూరు చేయడానికి, తాజాగా రూ. 50,000 కోట్ల నిధులు జారీచేసింది. దీనిలో, రూ 15,000 కోట్లు ఎస్ ఐ డి బి ఐ కి జారీ చేయబడింది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ప్రత్యేకించి ఋణ లభ్యతలేని మరియు ఏస్పిరేషనల్ జిల్లాలలో గల చిన్న ఎమ్ ఎస్ ఎమ్ ఇ లు, వ్యాపారాలతో సహా), అవసరమైన నిధులు ఆన్-లెండింగ్ / రిఫైనాన్స్ వంటి నూతన విధానాలలో సమకూర్చుటకు, ఎస్ ఐ డి బి ఐ కి మరొక రూ. 16,000 కోట్లు స్పెషల్ లిక్విడిటి సౌకర్యం కల్పించాలని నిర్ణయించబడింది. ఈ సదుపాయం, పాలిసీ రెపో రేటుతో, ఒక సంవత్సరం వరకు లభిస్తుంది. దీని వినియోగం ఆధారంగా, రిజర్వ్ బ్యాంక్ ఈ సదుపాయాన్ని పొడిగించవచ్చు.

రిసొల్యూషన్ ఫ్రేమ్ వర్క్ 2.0 క్రింద ఎక్స్పోజర్ త్రెషోల్డ్ పెంపు (పరిష్కార ప్రక్రియ 2.0 ప్రారంభించుటకు, కనీస బకాయివిలువ పరిమితి పెంపుదల)

22. మే 5, 2021 తేదీన రిజర్వ్ బ్యాంక్ ప్రకటించిన పరిష్కార ప్రక్రియ 2.0, కోవిడ్-19 కారణంగా ఎమ్ ఎస్ ఎమ్ ఇ, నాన్-ఎమ్ ఎస్ ఎమ్ చిన్న వ్యాపారాలు, వ్యాపారంకోసం వ్యక్తులకు జారీచేసిన రుణాల పరిష్కార ప్రక్రియ సూచిస్తుంది. రిసొల్యూషన్ ఫ్రేమ్ వర్క్ 2.0 క్రింద అధిక సంఖ్యలో ఋణగ్రహీతలు ప్రయోజనం పొందాలన్న ఉద్దేశంతో, ఒకొక్క రుణం పై బకాయి గరిష్ట పరిమితిని (ఎక్స్పోజర్ త్రెషోల్డ్) మొత్తం రూ. 25 కోట్ల నుండి, ఎమ్ ఎస్ ఎమ్ ఇ, నాన్-ఎమ్ ఎస్ ఎమ్ చిన్న వ్యాపారాలు, వ్యాపారంకోసం వ్యక్తులకొరకు, రూ. 50 కోట్లకు పెంచాలని నిర్ణయించడం జరిగింది.

విదేశీ సంస్థాగత మదుపర్ల (ఎఫ్ పి ఐ లు)తరఫున చేసిన ప్రభుత్వ సెక్యూరిటీల లావాదేవీలకు మార్జిన్

23. భారత ఋణ విపణులలో, విదేశీ మదుపర్ల పెట్టుబడులను ప్రోత్సహించుటకు రిజర్వ్ బ్యాంక్ అనేక చర్యలు తీసికొంటోంది. ఎఫ్ పి ఐ లు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగించడానికి, కార్యకలాపాలు సులభతరం చేయడానికి, ఆతరైజ్డ్ డీలర్ బ్యాంకులకు, ఎఫ్ పి ఐ ఖాతాదారుల తరఫున జరిపే ప్రభుత్వ సెక్యూరిటీల లావాదేవీలకు (రాష్ట్ర వికాస రుణాలు మరియు ట్రెజరీ బిల్సుతో సహా), క్రెడిట్ రిస్క్ నిర్వహణలో భాగంగా, మార్జిన్ నిర్ణయించుటకు అనుమతించబడినది.

డిపాజిట్ సర్టిఫికేట్లు (సి డిలు )జారీచేయువారికి, ద్రవ్యత నిర్వహణలో వెసులుబాటు

24. సరసమైన ధరలలో, సమర్థవంతంగా ద్రవ్యత నిర్వహించుటకు అనువుగా, రిజర్వ్ బ్యాంక్ ద్వారా లభించే ద్రవ్యత సదుపాయాన్ని మరియు కాల్ / నోటీస్ మనీ మార్కెట్లను వినియోగించుకొనుటకు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు, డిసెంబర్ 2020 లో అనుమతి ఇవ్వబడింది. స్వల్పకాలిక నిధులు సులభంగా సమకూర్చుకొనుటకు, ఆర్ ఆర్ బి లు, డిపాజిట్ సర్టిఫికెట్లు జారీచేయుటకు అనుమతించవలెనని ఇప్పుడు నిర్ణయించబడింది. ఇంతేగాక, సి డిలు జారీచేసినవారు, వాటి చెల్లుబాటు కాలానికి ముందే, కొన్ని నిబంధనలకు లోబడి, వాటిని తిరిగి కొనుగోలు చేయవచ్చు. దీనితో, ద్రవ్యత నిర్వహణ మరింత సులభమౌతుంది.

వారంలో అన్ని దినాలూ నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ (ఎన్ ఏ సి హెచ్) పనిచేస్తుంది

25. ఎన్ పి సి ఐ చే నిర్వహించబడుతున్న ఎన్ ఏ సి హెచ్ ఒకరి నుండి-అనేకమందికి చెల్లింపులు (అనగా-డివిడెండ్, వడ్డీ, జీతాలు, పెన్షన్ వంటి చెల్లింపులు మరియు విద్యుత్తు, గ్యాస్, టెలిఫోన్, నీటి బిల్లులు, ఋణ వాయిదాలు, మ్యూచువల్ ఫండ్ల పెట్టుబడులు, బీమా ప్రీమియంలు వంటి వసూళ్లు) చేయడానికి సహాయపడుతుంది. ఎన్ ఏ సి హెచ్, అనేకమంది లబ్ధిదారులకు, ప్రత్యక్ష ప్రయోజనాలు చేకూర్చే, ముఖ్యమైన డిజిటల్ వ్యవస్థగా ప్రజాదరణ పొందింది. దీనిద్వారా, కోవిడ్ 19 సమయంలో, ప్రభుత్వ రాయితీలు సకాలంలో, పారదర్శకంగా చెల్లించడానికి వీలయింది. ప్రస్తుతం, ఎన్ ఏ సి హెచ్, బ్యాంకులు పనిచేసే రోజుల్లోనే అందుబాటులో ఉంది. వినియోగదారుల సౌకర్యంకోసం మరియు సంవత్సరంలో ప్రతిరోజూ పనిచేసే ఆర్ టి జి ఎస్ వ్యవస్థ ప్రయోజనం పొందుటకు, ఆగస్ట్ 1. 2021 తేదీనుండి, ఎన్ ఏ సి హెచ్ కూడా సంవత్సరంలో అన్నిరోజులూ అందుబాటులో ఉండాలని నిర్ణయించడం జరిగింది.

26. పైన తెలిపిన చర్యలపై ఆదేశాలు / సర్క్యులర్లు విడిగా జారీచేయబడతాయి.

అంతిమ వ్యాఖ్యలు

27. గడిచిన సంవత్సరంలో, కోవిడ్ సృష్టించిన విధ్వంసంనుండి ఆర్థిక వ్యవస్థను, విధానాలనీ కాపాడడంలో రిజర్వ్ బ్యాంక్ నిమగ్నమయింది. కోవిడ్ మొదటిదశ, ఉపశమన కాలం, మరల రెడవ దశలలో నిరంతరం అప్రమత్తతో ఉన్నాము. ఆర్థిక వ్యవస్థ సుస్థిరంగా కొనసాగుటకు, భాగస్వాములందరికీ అనుకూలమైన ఆర్థిక వసతులు కల్పించుటకు తీవ్రమైన కృషి చేశాము. కోవిడ్-19 రెండవదశవల్ల కలిగిన ప్రాణనష్టం, ఇప్పుడే కోలుకొంటున్న వ్యవస్థను, పూర్తిగా కాకపోయినా, కొంతమేరకు వినాశంచేసింది. అభివృద్ధి అవకాశాలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. రెండవ దశలోకూడా, సరఫరా వ్యవస్థ కుంటుపడలేదు.

28. మా వినూత్నమైన ఆలోచనలు, చర్యల ద్వారా మేము ఎటువంటి విషమ పరిస్థితినైనా ఎదుర్కొనుటకు సంసిద్ధంగా ఉండి, శుభపరిణామలకై ఆశిస్తూ ఉంటాము. ఈరోజున ప్రకటించిన చర్యలు, ఇంతవరకూ తీసికొన్న ఇతర చర్యలతో కలిపి, వాడిపోయిన ఆర్థిక స్థితిని, వికసింపచేస్తాయని ఆశిస్తున్నాము. భవిష్యత్తులో, భారతదేశాన్ని, ప్రపంచంలో ‘వేక్సీన్’ రాజధానిగా, ఔషధ ఉత్పత్తులలో అగ్రగామిగా స్థాపించుటకు తగిన ప్రోత్సాహక చర్యలు, కోవిడ్ కథని తిరగ రాస్తాయి.

29. ప్రస్తుత పరిస్థితిని నిర్భీతిగా ఎదుర్కోవడమే తక్షణ కర్తవ్యం. చుట్టూ అనిశ్చితి చీకటి నెలకొన్నా, అసాధారణ ధైర్యం, అసామాన్య స్ఫూర్తీ కలిగించే అనేక సంఘటనలు మన దేశ ఉజ్వల భవిష్యత్తుపై ప్రగాఢ విశ్వాసాన్ని కలిగిస్తాయి. మన పట్టుదల, నమ్మకం మరియు ఆశలను, మహాత్మా గాంధీగారి వాక్యాలు స్పష్టంగా వర్ణిస్తాయి: “నేను ఆశావాదాన్ని ఎన్నడూ వీడలేదు. అత్యంత చీకటి ఘడియల్లో కూడా నా ఆశ, జ్యోతిలా వెలుగు నింపుతుంది...”3.

ధన్యవాదాలు. సురక్షితంగా ఉండండి. ఆరోగ్యంగా ఉండండి. నమస్కారాలు.

(యోగేశ్ దయాల్) 
చీఫ్ జనరల్ మానేజర్

పత్రికా ప్రకటన: 2021-2022/317

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?