ప్రాతినిధ్య బ్యాంకులచే ప్రభుత్వ వ్యవహారాల నిర్ - ఆర్బిఐ - Reserve Bank of India
ప్రాతినిధ్య బ్యాంకులచే ప్రభుత్వ వ్యవహారాల నిర్వహణ - ఏజన్సీ కమిషన్ చెల్లింపు – మాస్టర్ సర్క్యులర్
RBI/2017-18/2 జులై 1, 2017 అన్ని ప్రాతినిధ్య బ్యాంకులు అయ్య/అమ్మా ప్రాతినిధ్య బ్యాంకులచే ప్రభుత్వ వ్యవహారాల నిర్వహణ - ఏజన్సీ కమిషన్ చెల్లింపు – మాస్టర్ సర్క్యులర్ పైన పేర్కొన్న విషయంపై మాచే జులై 1, 2015 తేదీన జారీచేయబడిన మాస్టర్ సర్క్యులర్ RBI/2015-16/81, దయచేసి చూడండి. జూన్ 30, 2017 వరకు జారీ చేయబడ్డ ముఖ్యమైన ఆదేశాలు పొందుపరుస్తూ, మాస్టర్ సర్క్యులర్ సవరించబడి, ఆధునీకరించబడింది. 2. సవరించిన మాస్టర్ సర్క్యులర్ ప్రతి, మీ సమాచారం నిమిత్తం, జతచేయబడింది. ఈ సర్క్యులర్ మా వెబ్‌సైట్ /en/web/rbi/notifications/master-circulars నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చును. మీ విధేయులు, (ఎస్. రామస్వామి) జతపరచినవి: పైన పేర్కొన్నవి ప్రాతినిధ్య బ్యాంకులచే ప్రభుత్వ వ్యవహారాల నిర్వహణ – పరిచయం భారతీయ రిజర్వ్ బ్యాంక్, వారి శాఖలద్వారా, మరియు సెక్షన్ 45 RBI చట్టం 1934 క్రింద నియమించబడ్డ ప్రాతినిధ్య బ్యాంకులతో, పరస్పర ఒప్పందం ప్రకారం కేంద్ర / రాష్ట్ర ప్రభుత్వాల, సాధారణ బ్యాంకింగ్ లావాదేవీలు, నిర్వహిస్తుంది. ప్రాతినిధ్య బ్యాంకులు నిర్వహించిన ప్రభుత్వ లావాదేవీలపై, రిజర్వ్ బ్యాంక్, వారికి కమిషన్ చెల్లిస్తుంది. అనుబంధం 1 లో పేర్కొన్న సర్క్యులర్లలో గల ఆదేశాలన్నీ ఈ సర్క్యులర్‌లో పొందుపరచబడ్డాయి. ఏజన్సీ కమిషన్ చెల్లింపుకు అర్హమైన ప్రభుత్వ లావాదేవీలు 2. ప్రాతినిధ్య బ్యాంకులు నిర్వహించిన, ఈ క్రిందపేర్కొన్న ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించిన లావాదేవీలు, ఏజన్సీ కమిషన్ చెల్లింపుకు అర్హమైనవి: కేంద్ర / రాష్ట్ర ప్రభుత్వాల తరఫున, రెవెన్యూ వసూళ్ళు, చెల్లింపులు రిజర్వ్ బ్యాంక్, ఏజన్సీ కమిషన్ చెల్లింపుకు అర్హమైనవని ప్రత్యేకంగా ప్రకటించిన ఇతర కార్యకలాపాలు ( ఉదా: రిలీఫ్ బాండ్లు, పొదుపు బాండ్లు మొ. వి.) 3. రాష్ట్ర ప్రభుత్వాలు, ఆర్థిక సంస్థలు, బ్యాంకులనుండి సేకరించిన స్వల్పకాలిక/దీర్ఘకాలిక రుణాలు, సాధారణ బ్యాంకింగ్ కార్యకలాపాలు కానందువల్ల, ఏజన్సీ కమిషన్ చెల్లింపుకు అర్హమైనవి కావు. ప్రజా రుణ నిర్వహణకు, రిజర్వ్ బ్యాంక్, ప్రాతినిధ్య బ్యాంకులకు అంగీకరించిన విధంగా, ప్రత్యేకమైన పారితోషికం చెల్లిస్తుంది. మంత్రిత్వ శాఖలు / విభాగాల తరఫున బ్యాంకులు జారీచేసిన లెటర్స్ ఆఫ్ క్రెడిట్, బ్యాంకు గ్యారంటీలు, ఏజన్సీ కమిషన్‌కు అర్హము కావు. 4. ప్రాతినిధ్య బ్యాంకులు, ప్రత్యక్షంగా లేక ఇ-మోడ్ (చలాన్ ద్వారా) ద్వారా స్టాంప్ డ్యూటీ వసూలుచేసినప్పుడు, ఏజన్సీ కమిషన్‌కు అర్హులు. (అయితే, ప్రాతినిధ్య బ్యాంకులు, ఈ పనికై ప్రజలనుండి ఏ రుసుము / రాష్ట్ర ప్రభుత్వం నుండి, ఏ పారతోషికమూ తీసికొని ఉండరాదు) 5. ఒకవేళ ప్రాతినిధ్య బ్యాంక్, రాష్ట్ర ప్రభుత్వంచే ఫ్రాంకింగ్ వెండర్‌గా నియమించబడి, పత్రాలు ఫ్రాంకింగ్ చేసినందుకు ప్రజలనుండి స్టాంప్ డ్యూటీ వసూలు చేస్తున్నట్లయితే, రాష్ట్ర ప్రభుత్వమే బ్యాంకులకు ఫ్రాంకింగ్ వెండర్‌గా కమిషన్ చెల్లిస్తారుగనుక, తిరిగి ఏజన్సీ కమిషన్‌కు అర్హులు కారు. అయినప్పటికీ, ఫ్రాంకింగ్ వెండర్ ట్రెజరీకి జమచేయడంకోసం ప్రత్యక్ష/ ఇ - మోడ్ చలాన్ ద్వారా చెల్లించిన స్టాంప్ డ్యూటీ (ఫ్రాంకింగ్ బార్ కొనడానికి), సాధారణ స్టాంప్ డ్యూటీ చెల్లింపుగనుక, ఏజన్సీ కమిషన్‌కు అర్హమౌతుంది. 6. ఏజన్సీ కమిషన్ క్లైమ్ చేసే సమయంలో, ప్రాతినిధ్య బ్యాంకులు, అనర్హమైన లావాదేవీలపై ఏజన్సీ కమిషన్ క్లైమ్ చేయలేదని, తప్పనిసరిగా ధృవపరచవలసి ఉంటుంది. 7. ప్రత్యక్ష పన్నుల వసూళ్ళకై అధీకృత శాఖలేని, ప్రాతినిధ్య బ్యాంకులు, వారి శాఖల / అధీకృత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖల / రిజర్వ్ బ్యాంక్ కార్యాలయాల ద్వారా, వారి సొంత పన్నులు చెల్లిస్తున్నట్లయితే, ఈ విషయం 'స్క్రోల్' లో ప్రత్యేకంగా తెలపాలి. ఈ విధమైన లావాదేవీలు, ఏజన్సీ కమిషన్‌కు అర్హము కావు. ఇంతేగాక, ప్రాతినిధ్య బ్యాంకులు ఏజన్సీ కమిషన్ క్లైమ్ చేసే సమయంలో, వారు సొంతానికై కట్టిన పన్నులు (TDS, కార్పొరేషన్ పన్ను మొ.వి), ఏజన్సీ క్లైమ్‌లో మినహాయించబడ్డాయని, ధృవీకరించవలెను. ఈ సందర్భంగా, ఈ క్రింది లావాదేవీలు, ప్రాతినిధ్య బ్యాంక్ కార్యకలాపాల క్రింద రావని, అందువల్ల, ఏజన్సీ కమిషన్ చెల్లింపుకు అనర్హమైనవనీ, విశదపరచడమైనది. (a) ప్రభుత్వ కాంట్రాక్టర్లు / సరఫరాదార్లుకు జారీచేసే బ్యాంక్ గ్యారంటీలు / సెక్యూరిటీ డిపాజిట్లు (వారి వినియోగదారులకు సామాన్యంగా జరిపే లావాదేవీలు) (b) స్వఛ్ఛంద / చట్టబద్ధ సంస్థలు / మునిసిపాలిటీలు / కార్పొరేషన్‌లు / స్థానిక సంస్థలకు సంబంధించిన బ్యాంక్ కార్యకలాపాలు. (c) నష్టాలు పూరించుకోవడానికి స్వఛ్ఛంద / చట్టబద్ధ సంస్థలు / మునిసిపాలిటీలు / కార్పొరేషన్‌లు / స్థానిక సంస్థలకు, మూలధన సహాయంగా, రాయితీలుగా ప్రభుత్వం ఇచ్చిన నిధులు. (d) ముందే సమకూర్చబడిన నిధులనుండి, కేంద్ర మంత్రిత్వ శాఖ / విభాగం (CGA సంప్రదింపుతో) / రాష్ట్ర ప్రభుత్వ విభాగం, బ్యాంకుల ద్వారా అమలుపరిచే పథకాలు. ఏజన్సీ కమిషన్ రేట్లు 8. ప్రాతినిధ్య బ్యాంక్ ఒప్పందం, పేరా 5 ప్రకారం చెల్లించవలసిన ఏజన్సీ కమిషన్ రేట్లు, రిజర్వ్ బ్యాంక్ నిర్ణయిస్తుంది. జులై 1, 2012 నుండి అమలులో ఉన్న రేట్లు ఈక్రింది విధంగా ఉన్నాయి.
9. ఈ సందర్భంగా, పైన టేబుల్ a. ii లో పేర్కొన్న 'వసూళ్ళు – ఇ – విధానం' అనగా, ఇంటర్‌నెట్ బ్యాంకింగ్ ద్వారా ఖాతానుండి డబ్బు పంపడం మరియు భౌతికంగా, నగదు లేక ఇతర సాధనాలు (instruments) లేకుండా జరిపే లావాదేవీలు. ఎలక్ట్రానిక్ చలాన్‌తోబాటు నగదు/సాధనాలు జతపరిచి, ప్రాతినిధ్య బ్యాంకుకు సమర్పిస్తే, అది భౌతిక విధానంగానే పరిగణించాలి. 10. వస్తు-సేవా పన్ను (GST) అమలైన తరువాత, ఒకే కామన్ పోర్టల్ సంఖ్య (single Common Portal Number) ప్రక్రియతో, చలాన్ గుర్తింపు సంఖ్య (Challan Identification Number) పొందడంలో సఫలమయితే, అనేకమైన ప్రధాన ఖాతాలు / ఉప-ప్రధాన ఖాతాలు / ఉప ఖాతాలలో జమచేసిన GST చెల్లింపులు, ఒకే లావాదేవీగా పరిగణించాలి. అంటే, ఒక చలాన్‌ద్వారా చెల్లించిన CGST, SGST, IGST మరియు 'సెస్' మొ.వి., ఒకే లావాదేవీ క్రింద వస్తాయి. అందువల్ల, వీటన్నిటినీ ఒకే చలాన్ (CPIN) క్రింద కలిపి, ఏజన్సీ కమిషన్ క్లైమ్ చేసేందుకు, ఒకే లావాదేవీగా పరిగణించాలి. ఈ విధానం, జులై 1, 2017 నుండి అమలులోకి వస్తుంది. 11. GST క్రింద రాని లావాదేవీల విషయంలోకూడా, ఒక చలాన్ (ఎలక్ట్రానిక్‌గాని, భౌతికమైనది కాని) ఒకే లావాదేవీగా పరిగణించాలి (అనేక ప్రధాన / ఉపప్రధాన / ఉప ఖాతాలకు జమచేసినాగాని) అందువల్ల, వీటన్నింటినీ ఒకే చలాన్‌క్రింద కలిపి, ఒకేలావాదేవీగా, ఏజన్సీ కమిషన్ క్లైమ్ చేయవలెను. 12. పెన్షన్‌కు సంబంధించిన పూర్తి పని (పెన్షన్ గణన, చెల్లింపు) వారే చేసినప్పుడే, ప్రాతినిధ్య బ్యాంకులు, ప్రతి పెన్షన్ లావాదేవీకి రూ. 65/- ఏజన్సీ కమిషన్ పొందగలరు. పెన్షన్ గణన మొ. ఇతర పనులు ప్రభుత్వ శాఖ / ట్రెజరీ చేసి, బ్యాంకు శాఖలు కేవలం ప్రభుత్వ ఖాతా డెబిట్‌చేసి, వారివద్దనున్న పెన్షన్‌దారు ఖాతాకు జమచేస్తే, ఆ లావాదేవీ, 'పెన్షన్‌గాక ఇతర చెల్లింపుల' క్రిందకు వస్తుంది. అందువల్ల దీనిపై ఏజన్సీ కమిషన్ ప్రతి 100 రూపాయిలకు 5. 5 పైసలు మాత్రమే. 13. బ్యాంకు, లావాదేవీకి సంబంధించి అన్ని చర్యలూ నిర్వహిస్తేనే పూర్తి ఏజన్సీ కమిషన్ చెల్లింపుకు అర్హమౌతుంది. ఈ పని రెండు బ్యాంకులు పంచుకొంటే, ఏజన్సీ కమిషన్ 75: 25 నిష్పత్తిలో పంచబడుతుంది. స్థూలంగా చెప్పాలంటే, బ్యాంకులకు ఏజన్సీ కమిషన్ ఈ క్రింది విధంగా చెల్లించబడుతుంది: (a) లావాదేవీకి సంబంధించి అన్ని పనులూ (స్క్రోల్స్ మరియు చలాన్‌లు /చెక్కులు, పే అండ్ అకౌంట్స్ ఆఫీస్‌లకు / ట్రెజరీలు, సబ్ ట్రెజరీలకు పంపించడం) చేస్తే, పూర్తి రేట్. (b) లావాదేవీ నిర్వహించే శాఖ, స్క్రోల్స్, పత్రాలూ, స్థానిక / దగ్గరలోని రిజర్వ్ బ్యాంక్ / ప్రభుత్వ వ్యవహారాలు నిర్వహించే ప్రాతినిధ్య బ్యాంక్ శాఖలకు పంపి ఖాతా నిర్వహిస్తే, అమలులో ఉన్న రేట్‌లో 75%. (c) లావాదేవీలు నిర్వహించే శాఖనుండి స్క్రోల్స్, పత్రాలూ స్వీకరించి, ఖాతా నిర్వహణ మరియు స్క్రోల్స్, పత్రాలు పే అండ్ అకౌంట్స్ ఆఫీస్‌కు/ట్రెజరీలకు/సబ్ ట్రెజరీలకు పంపే బాధ్యత వహించిన, ప్రాతినిధ్య బ్యాంక్ శాఖలకు 25%. 14. ఒక పెన్షన్‌దారుకు సంబంధించి సంవత్సరానికి 14 లావాదేవీలపై మాత్రమే, ఏజన్సీ కమిషన్ చెల్లించబడుతుంది. (ప్రతి నెలకొకసారి పెన్షన్ మరియు రెండుమార్లు కరువు భృత్యం బకాయిల జమ, కలిపి) పెన్షన్ చెల్లింపులో జాప్యం, పెన్షన్ తిరిగి ప్రారంభించడం వల్ల చెల్లించిన బకాయిలు, ఏజన్సీ కమిషన్ క్లైమ్ చేయడానికి, ఒకే లావాదేవీగా పరిగణించవలెను. (వేరు వేరు నెలవారీ జమవలె కాకుండా) ఏజన్సీ కమిషన్ క్లైమ్ చేయడం 15. ప్రాతినిధ్య బ్యాంకులు, కేంద్ర ప్రభుత్వ లావాదేవీల క్లైములు, CAS నాగ్‌పూర్‌కు; ర్రాష్ట్ర ప్రభుత్వ లావాదేవీల క్లైములు, వారి స్థానిక రిజర్వ్ బ్యాంక్ కార్యాలయాలకు, సమర్పించవలెను. అన్ని ఏజన్సీ బ్యాంకులు, ఏజన్సీ కమిషన్ క్లైం చేయుటకు సమర్పించవలసిన, సవరించిన ఫార్మాట్లు; శాఖా అధికారులు, చార్టర్డ్ అకౌంటెంట్లు ప్రత్యేకంగా సమర్పించవల్సిన ధృవపత్రాల నమూనాలు, అనుబంధం –2 లో ఇవ్వబడ్డాయి. జమ చేయవలసిన పెన్షన్ బాకీలు / నెలవారీ పెన్షన్ / వాటిపై బాకీలు, జమచేయడంలో బకాయిలు లేవని, ED / CGM (ప్రభుత్వ లావాదేవీల ఇన్-చార్జ్), సాధారణంగా సమర్పించే ధృవపత్ర్రాలకు, అదనంగా, ఈ ధృవపత్రాలు సమర్పించాలి. 16. ఎక్స్టెర్నల్ ఆడిటరే, కంకరెంట్ ఆడిటర్/ స్టాట్యుటరీ ఆడిటర్ అయిన పక్షంలో, క్లైములు వారు ధృవీకరించ వచ్చును. ఆ ధృవపత్రం, ఇతర విషయాలతోబాటు ఈవిధంగా తెలుపవలెను: (a) RBI కు సమర్పించిన ఏజన్సీ కమిషన్ క్లైమ్ దరఖాస్తులో చూపిన 'వసూళ్ళు', 'పెన్షన్ చెల్లింపు లావాదేవీలు', 'పెన్‌షన్ కాకుండా ఇతర చెల్లింపులు', ప్రాతినిధ్య బ్యాంక్ ఆయా శాఖలలోగల పత్రాలతో సరిచూడబడినవి; మరియు (b) 'వసూళ్ళు', 'పెన్షన్ లావాదేవీలు' వంటి సంఖ్యాపరమైన క్లైములు ఒకసారి మాత్రమే చేయబడినవి మరియు పరిమాణం ఆధారంగా చేయబడిన (పెన్షన్ గాక ఇతర చెల్లింపులు) క్లైములలో ఇవి చేర్చబడలేదు. ఇంతేగాక, అంతర్గత పరిశీలకులు / ఆడిటర్లు తనిఖీకి వచ్చినప్పుడు, ప్రాతినిధ్య బ్యాంకులు, చేసిన క్లైములు, సరిచూసి, అవి ఖచ్చితమైనవేనని రూఢిపరచేలా చర్యలు తీసికోవలెను. 17. రిజర్వ్ బ్యాంక్ స్థానిక కార్యాలయాలకు, CAS నాగ్‌పూర్‌కి, నిర్దిష్ట ఫార్మాట్‌లో చేసిన క్లైములు ఖచ్చితమైనవేనని, ప్రాతినిధ్య బ్యాంకులు నిర్ధారించుకోవలెను. ప్రాతినిధ్య బ్యాంకులు, వారి శాఖలు మా స్థానిక కార్యాలయాలకు సమర్పించిన క్లైములు యథార్థమైనవిగా జాగ్రత్తవహించాలని, అప్రమత్తం చేయవలెను. తప్పుడు క్లైములు నిజమైనవేనని, అంతర్గత/ కంకరెంట్ ఆడిటర్లు నిర్ధారిస్తే, త్రైమాసిక క్లైములు చేసేసమయంలో, వారి ధృవీకరణ అత్యవసరమనే నిబంధన, నిష్ప్రయోజనమవుతుంది. 18. ప్రాతినిధ్య బ్యాంకులు, లావాదేవీ జరిగిన త్రైమాసికపు ఆఖరిరోజు నుండి, 90 రోజులు - రెండు త్రైమాసికాలలోపు వారి ఏజన్సీ కమిషన్ క్లైములు, రిజర్వ్ బ్యాంకుకు సమర్పించాలని సూచించడమైనది. సూచించిన కాలవ్యవధిలో క్లైములు సమర్పించడంలో విఫలమైతే, ఆలస్యానికి కారణం వివరించవలెను. జూన్ 30, 2017 త్రైమాసికం చివరకు పంపవలసిన క్లైముల నుండి, ఇది అమలులోకి వస్తుంది. 19. జులై 1, 2012 తేదీ నుండి, ప్రాతినిధ్య బ్యాంకులు ఏజన్సీ కమిషన్‌పై చెల్లించిన సేవా పన్ను, రిజర్వ్ బ్యాంక్ భర్తీచేయాలని నిర్ణయించింది. ఏజన్సీ కమిషన్‌పై TDS వసూలు 20. కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల సంఘం (Central Board of Direct Taxes), కేంద్ర / రాష్ట్ర ప్రభుత్వాల సామాన్య బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహించినందుకు, ప్రాతినిధ్య బ్యాంకులకు చెల్లించే / వారి ఖాతాలకు జమచేసే, ఏజన్సీ కమిషన్‌పై TDS మినహాయించరాదని, విశ దీకరించింది. అయితే, వారి బ్యాంక్ ఖాతాల్లో జమచేయబడ్డ ఏజన్సీ కమిషన్ వారి ఆదాయంలో భాగంగనుక, దానిపై పన్ను విధించబడుతుంది. తప్పుడు క్లైములపై జరిమానా వడ్డీ తప్పుడు క్లైములపై కమిషన్ చెల్లించడం జరిగితే, ప్రాతినిధ్య బ్యాంకులు, రిజర్వ్ బ్యాంక్ ప్రకటించిన బ్యాంక్ రేటుకు అదనంగా, 2% జరిమానాతో, వడ్డీ చెల్లించవలసి ఉంటుంది. |