ఇండియన్ స్కూల్ ఫైనాన్స్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, తెలంగాణ పై భారతీయ రిజర్వు బ్యాంకు వారిచే ఆర్ధిక జరిమానా విధింపు - ఆర్బిఐ - Reserve Bank of India
ఇండియన్ స్కూల్ ఫైనాన్స్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, తెలంగాణ పై భారతీయ రిజర్వు బ్యాంకు వారిచే ఆర్ధిక జరిమానా విధింపు
నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సింగ్ కంపెనీలలో రిస్క్ ల నిర్వహణ మరియు ఆర్ధిక వ్యవహారాలను బయటి వ్యక్తుల /సంస్థల సేవల ద్వారా పొందేటప్పుడు పాటించ వలసిన ప్రవర్తన నియమావళి పై భారతీయ రిజర్వు బ్యాంకు జారీ చేసిన ఆదేశాలలో కొన్ని ఉల్లంఘించినందుకు గాను,భారతీయ రిజర్వు బ్యాంకు తమ ఉత్తర్వు తేదీ 03, జనవరి 2025 ద్వారా ఇండియన్ స్కూల్ ఫైనాన్స్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, తెలంగాణ పై రు.50,000/(అక్షరాల ఏభై వేల రూపాయలు మాత్రమే) ఆర్ధిక జరిమానా విధించడమైనది. భారతీయ రిజర్వు బ్యాంకు చట్టము 1934 లోని సెక్షన్ 58G(1)(b) మరియు 58 B(5)(aa)లోని అధికరణముల ద్వారా సంక్రమించిన అధికారముల కింద ఈ ఆర్ధిక జరిమానా విధించడమైనది. ఈ కంపెనీ యొక్క మార్చ్ 31 , 2023 తేదీ నాటి ఆర్ధిక పరిస్థితి పై చట్ట బద్ధ తనిఖీ నిర్వహించడము జరిగినది. పైన తెలిపిన అంశాలలో భారతీయ రిజర్వు బ్యాంకు వారు జారీ చేసిన ఆదేశాలను పాటించలేదని ఆ తనిఖీ నివేదికలో కనుగొనిన దృష్ట్యా, తత్సంబంధిత ఉత్తర ప్రత్యుత్తరాలను పరిశీలించి సదరు సంస్థ పై ఎందుకు ఆర్ధిక జరిమానా విధించకూడదో కారణము తెలియ చేయవలసినదిగా నోటీసు ఇవ్వడమైనది. ఆ నోటీసుకు కంపెనీ వారిచ్చిన సమాధానము, మరియు వ్యక్తిగత సమావేశములో మౌఖికముగా చెప్పిన వివరణ విన్న తరవాత రిజర్వు బ్యాంకు వారు చేసిన అభియోగము వాస్తవమైనదిగా గుర్తించడము వలన ఈ ఆర్ధిక జరిమానా విధించడమైనది. ఈ కంపెనీ మేనేజిమెంట్ నిర్వహణ లో అతి ముఖ్యమైన ” అంతర్గత ఆడిట్ “ ని బయటి వ్యక్తుల/సంస్థలకు అప్పగించడము జరిగినది. చట్టబద్ధముగా పాటించవలసిన ఆదేశాలను పాటించకపోవడము అనే లోపము వలన ఈ చర్య తీసుకోవడము జరిగింది కాని, సదరుసంస్థ తమఖాతాదారులతో చేసుకున్న ఒప్పందాలు లేదా లావాదేవీల ప్రామాణికతలకు సంబంధించినది కాదు. ముందు ముందు ఈ బ్యాంకు పై, భారతీయ రిజర్వు బ్యాంకు తీసుకోదలచిన చర్యలకు ఈ ఆర్ధిక జరిమానా అడ్డంకి కాబోదు. (పునీత్ పంచోళీ) పత్రిక ప్రకటన: 2024-2025/1889 |