<font face="mangal" size="3">కోవిడ్–19 రెగ్యులేటరీ ప్యాకేజ్</font> - ఆర్బిఐ - Reserve Bank of India
కోవిడ్–19 రెగ్యులేటరీ ప్యాకేజ్
RBI/2019-20/244 మే 23, 2020 అన్ని వాణిజ్య బ్యాంకులు (చిన్న ఫైనాన్స్ బ్యాంకులు, స్థానిక బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులతో సహ); ప్రాథమిక (నగర) సహకార బ్యాంకులు/ రాష్ట్ర సహకార బ్యాంకులు/జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు; జాతీయ ఆర్థిక సంస్థలు; బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలతో సహా) అమ్మా / అయ్యా, కోవిడ్–19 రెగ్యులేటరీ ప్యాకేజ్ కోవిడ్-19 మహమ్మారివల్ల తలెత్తిన అంతరాయాల కారణంగా, ఆస్తుల వర్గీకరణ, కేటాయింపులకు సంబంధించి కొన్ని నియంత్రణా చర్యలు ప్రకటిస్తూ జారీచేసిన సర్క్యులర్లు, DOR.No.BP.BC.47/21.04.048/2019-20 తేదీ మార్చి 27, 2020; DOR.No.BP.BC.63/21.04.048/2019-20 తేదీ ఏప్రిల్ 17, 2020 దయచేసి చూడండి. మే 22, 2020 తేదీన ప్రకటనలో గవర్నర్ తెలిపిన విధంగా, తీవ్రతరంగా మారిన కోవిడ్-19 ప్రభావం కారణంగా, తిరిగి చెల్లింపుల ఒత్తిడి సడలించుట; నిర్వహణ మూలధనం (వర్కింగ్ క్యాపిటల్) సమీకరించుట సులభంచేయుట; రుణాలపై వడ్డీ భారం తగ్గించుట; వ్యవస్థలో ఆర్థిక ఒత్తిడులు తగ్గించుట; వ్యాపార, కుటుంబ వ్యవస్థలు నిరంతరాయంగా కొనసాగుట ప్రధాన అంశాలుగా మారాయి. ఇందుకు సంబంధించి, విస్తారమైన ఆదేశాలు ఈ క్రింద పేర్కొనబడ్డాయి: (i) చెల్లింపుల పునర్వ్యవస్థీకరణ - నియమితకాల రుణాలు మరియు నిర్వహణ మూలధనంకొరకు సౌకర్యాలు 2. లాక్ డౌన్ పొడిగింపు, కోవిడ్-19 వల్ల కలిగిన అంతరాయాలు కొనసాగుతున్న కారణంగా, అన్ని వాణిజ్య బ్యాంకులు (చిన్న ఫైనాన్స్ బ్యాంకులు, స్థానిక బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులతో సహ); ప్రాథమిక (నగర) సహకార బ్యాంకులు/ రాష్ట్ర సహకార బ్యాంకులు/జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు; జాతీయ ఆర్థిక సంస్థలు; బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలతో సహా), (“ఋణ సంస్థలు”), నియమితకాల రుణాలపై (నియమితకాల వ్యవసాయ రుణాలు, చిల్లర మరియు పంట ఋణాలతోసహా) అన్ని వాయిదాలు చెల్లింపులపై మారటోరియం, మరొక మూడు నెలలు అనగా జూన్ 1, 2020 నుండి ఆగస్ట్ 31, 2020 వరకు పొడిగించుటకు అనుమతించబడినది. తదనుసారంగా అట్టి రుణాలు తిరిగి చెల్లించవలసిన తేదీలు మరియు మిగిలిన గడువులు మార్చబడతాయి. అయితే, అనుమతించిన మారటోరియం సమయానికికూడా, వడ్డీ లెక్కకట్టబడుతుంది. 3. క్యాష్ క్రెడిట్ / ఓవర్ డ్రాఫ్ట్ రూపంగా వర్కింగ్ క్యాపిటల్ రుణాలు జారీచేసిన ఋణ సంస్థలు, వడ్డీ వసూలుకు మరొక మూడునెలలు – జూన్ 1, 2020 నుండి ఆగస్ట్ 31, 2020 వరకు, గడువు పెంచవచ్చు. ఋణ సంస్థలు వారి వివేచన ప్రకారం, ఆగస్ట్ 31, 2020 వరకు జమ అయిన వడ్డీ, మార్చి 31, 2020 తేదీకి ముందుగా చెల్లించవలసిన, ‘ఫండెడ్ ఇంటరెస్ట్ టర్మ్ లోన్, (ఎఫ్ ఐ టి ఎల్)’ గా మార్చుటకు అనుమతించబడినది. (ii) నిర్వహణ ములధన (వర్కింగ్ కేపిటల్) రుణాల సరళీకృతం 4. క్యాష్ క్రెడిట్ (సి సి) / ఓవర్ డ్రాఫ్ట్(ఓ డి) రూపంలో వర్కింగ్ కేపిటల్ సదుపాయాలు అందుకొన్న ఋణగ్రహీతలు, కోవిడ్–19 కారణంగా ఆర్థిక ఒత్తిడులకు లోనయితే, ఒక్కసారి చర్యగా: (i) సి సి / ఓ డి రూపంలో జారీచేసిన వర్కింగ్ కేపిటల్ పరిమితులు (డ్రాయింగ్ లిమిట్స్) ఆగస్ట్ 31, 2020 వరకు మార్జిన్ తగ్గించి, తిరిగి గణించవలెను. అయితే, తాత్కాలికంగా వర్కింగ్ కేపిటల్ పరిమితులు పెంచిన సందర్బాలలో, మార్జిన్లు మార్చి 31, 2020 నాటికి యథాస్థితికి తేవలెను. (ii) మార్చి 31, 2021 వరకు జారీచేసిన పరిమితులు, ‘వర్కింగ్ కేపిటల్ సైకిల్’ ఆధారంగా సమీక్షించవలెను. 5. కోవిడ్-19 వల్ల ఉత్పన్నమయిన పరిస్థితులలో పైసౌకర్యాలు కల్పించుట ఆవశ్యకమని ఋణ సంస్థలు తృప్తిచెందవలెను. ఇంతేగాక, తదుపరి జరిగే పర్యవేక్షక సమీక్షలో, ఈ ఖాతాలు, కోవిడ్-19 ప్రభావం కారణంగా, పైసౌకర్యాలు పొందుటకు అర్హమైనవేనని ఋజువుకావలెను. 6. పై చర్యలు అమలుచేయుటకు, ఋణ సంస్థలు వారి ‘బోర్డ్’ అనుమతితో తగిన విధానం అమలుచేయవలెను. ఆస్తుల వర్గీకరణ: 7. పైన పేరా 3 లో తెలిపినవిధంగా - జమ అయిన వడ్డీని ఎఫ్ ఐ టి ఎల్ గా మార్చుట; పేరా 4 లో సూచించిన విధంగా, కోవిడ్-19 వల్ల కలిగిన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనుటకు ఋణ నిబంధనల్లో మార్పులు చేయుట - ఋణ గ్రహీతకు ఆర్థిక సమస్యల కారణంగా కల్పించిన సౌకర్యాలుగా భావించరాదు. [రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా (ప్రూడెన్షియల్ ఫ్రేమ్ వర్క్ ఫర్ రిసొల్యూషన్ ఆఫ్ స్ట్రెస్స్డ్ అసెట్స్) డైరెక్షన్స్, 2019 తేదీ జూన్ 7, 2019 (‘ప్రూడెన్షియల్ ఫ్రేమ్ వర్క్’), అనుబంధం లోని పేరా 2 ప్రకారం]. అందువల్ల ఈ అసెట్ల వర్గీకరణ తక్కువ చేయబడదు. 8. ఐ ఆర్ ఏ సి నిబంధనల ప్రకారం అసెట్ల వర్గీకరణ కొరకు ‘పాస్ట్ డ్యూ’ సమయం లెక్కించుటకు, ఫిబ్రవరి 29, 2020 తేదీన ‘స్టాండర్డ్’ గా వర్గీకరించిన అన్ని రుణాలపై (గడువు మీరినఋణాలతోసహా), జారీచేసిన మారటోరియం గడువు మినహాయించవలెను. అటువంటి ఖాతాల వర్గీకరణ, సవరించిన గడువుతేదీలు, వాయిదా తేదీల ఆధారంగా చేయవలెను. 9. ఇదే విధంగా, వర్కింగ్ కేపిటల్ కొరకు జారీ చేసిన క్యాష్ క్రెడిట్ / ఓవర్ డ్రాఫ్టులకు సంబంధించి (CC /OD) (ఫిబ్రవరి 29, 2020 తేదీన స్టాండర్డ్’ గా వర్గీకరించిన అన్ని సదుపాయాలు, SMA తోసహా) ఖాతాలు దుస్థితిలో ఉన్నాయని నిర్ణయించేముందు, పైన పేరా 3 ప్రకారం అనుమతించిన ‘వాయిదా సమయాన్ని’, (‘deferment period’) మినహాయించవలెను. 10. మార్చి 27,2020 మరియు ఏప్రిల్ 17, 2020 సర్క్యులర్లలోని అన్ని నిబంధనలు, (తగిన మార్పులతో) అమలులో కొనసాగుతాయి. మీ విశ్వాసపాత్రులు, (సౌరవ్ సిన్హా) |