<font face="mangal" size="3">కోవిడ్ – 19 రెగ్యులేటరీ ప్యాకేజ్</font> - ఆర్బిఐ - Reserve Bank of India
కోవిడ్ – 19 రెగ్యులేటరీ ప్యాకేజ్
RBI/2019-20/186 మార్చి 27, 2020 అన్ని వాణిజ్య బ్యాంకులు (చిన్న ఫైనాన్స్ బ్యాంకులు, స్థానిక బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులతో సహ); ప్రాథమిక (నగర) సహకార బ్యాంకులు/ రాష్ట్ర సహకార బ్యాంకులు/జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు; జాతీయ ఆర్థిక సంస్థలు; బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలతో సహా) అమ్మా / అయ్యా, కోవిడ్ – 19 రెగ్యులేటరీ ప్యాకేజ్ మార్చి 27, 2020 తేదీన జారీచేసిన అభివృద్ధి మరియు నియంత్రణా విధానాలపై నివేదిక దయచేసి చూడండి. దీనియందు, ఇతర అంశాలతోబాటు, కోవిడ్-19 వల్ల కలిగిన ప్రతిబంధకాలవల్ల, ఋణ వ్యయం (డెట్ సర్వీసింగ్) తగ్గించుటకు, వ్యాపారం నిరంతరాయంగా కోన సాగించుటకు, కొన్ని చర్యలు ప్రకటించబడ్డాయి. ఈ సందర్భంగా, విస్తారమైన ఆదేశాలు ఈ క్రింద ఇవ్వబడ్డాయి: (i) చెల్లింపుల పునర్వ్యవస్థీకరణ - నియమిత కాల రుణాలు మరియు నిర్వహణ మూలధనం కొరకు (వర్కింగ్ క్యాపిటల్) సదుపాయాలు 2. అన్ని వాణిజ్య బ్యాంకులు (చిన్న ఫైనాన్స్ బ్యాంకులు, స్థానిక బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులతో సహ); ప్రాథమిక (నగర) సహకార బ్యాంకులు/ రాష్ట్ర సహకార బ్యాంకులు/జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు; జాతీయ ఆర్థిక సంస్థలు; బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలతో సహా), (“ఋణ సంస్థలు”), అన్ని నియమితకాల రుణాలపై (నియమితకాల వ్యవసాయ రుణాలు, చిల్లర మరియు పంట ఋణాలతోసహా) మార్చి 1, 2020 నుండి మే 31, 2020 వరకు చెల్లించవలసిన అన్ని వాయిదాలపై 1, మూడు నెలలకాలం మారటోరియం జారీచేయుటకు, అనుమతించబడినది. తదనుసారంగా అట్టి రుణాలు తిరిగి చెల్లించవలసిన తేదీలు మరియు మిగిలిన గడువులు మార్చబడతాయి. అయితే, అనుమతించిన మారటోరియం సమయానికికూడా, బకాయిలపై వడ్డీ లెక్కించబడుతుంది. 3. క్యాష్ క్రెడిట్ / ఓవర్ డ్రాఫ్ట్ (సి సి / ఓ డి) రూపంగా వర్కింగ్ క్యాపిటల్ రుణాలు జారీచేసిన ఋణ సంస్థలు, వడ్డీ వసూలు మూడునెలలు – మార్చి 1, 2020 నుండి మే 31, 2020 వరకు, వాయిదా (‘డెఫరమెంట్’) వేయవచ్చు. ఈ కాలానికి పోగుపడిన వడ్డీ, ఈ సమయం పూర్తి అయిన వెంటనే వాసులుచేయవలెను. (ii) నిర్వహణ మూలధన (వర్కింగ్ కేపిటల్) రుణాల సరళీకృతం 4. క్యాష్ క్రెడిట్ (సి సి) / ఓవర్ డ్రాఫ్ట్(ఓ డి) రూపంలో వర్కింగ్ కేపిటల్ సదుపాయాలు అందుకొన్న ఋణగ్రహీతలు, కోవిడ్ – 19 కారణంగా ఆర్థిక ఒత్తిడులకు లోనయితే, సి సి / ఓ డి రూపంలో జారీచేసిన వర్కింగ్ కేపిటల్ పరిమితులు (డ్రాయింగ్ లిమిట్స్) మార్జిన్ తగ్గించి మరియు/లేదా ‘వర్కింగ్ కేపిటల్ సైకిల్’ ఆధారంగా తిరిగి గణించవలెను. అయితే, ఈ సదుపాయం మే 31, 2020 వరకు చేసిన మార్పులకు వర్తిస్తుంది. కోవిడ్-19 వల్ల ఉత్పన్నమయిన పరిస్థితులలో పైసౌకర్యాలు కల్పించుట ఆవశ్యకమని ఋణ సంస్థలు తృప్తిచెందవలెను. ఇంతేగాక, తదుపరి జరిగే పర్యవేక్షక సమీక్షలో, ఈ ఖాతాలు, కోవిడ్-19 ప్రభావం కారణంగా, పైసౌకర్యాలు పొందుటకు అర్హమైనవేనని ఋజువుకావలెను. స్పెషల్ మెన్షన్ అకౌంట్ (ఎస్ ఎమ్ ఏ) మరియు నిరర్థక ఆస్తులక్రింద (ఎన్ పి ఏలు) వర్గీకరణ 5. మారటోరియం /డెఫర్మెంట్ / డ్రాయింగ్ పవర్ పునర్గణన (రీకాల్క్యులేషన్), ప్రత్యేకించి కోవిడ్-19 వల్ల కలిగిన కష్టాలు గట్టెక్కుటకు కల్పించిన సౌకర్యాలు. అందువల్ల అనుమతించిన రాయితీలు, ఋణ ఒప్పందాల నియమనిబంధనల్లో చేసిన మార్పులు, రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా (ప్రూడెన్షియల్ ఫ్రేమ్ వర్క్ ఫర్ రిసొల్యూషన్ ఆఫ్ స్ట్రెస్స్డ్ అసెట్స్) డైరెక్షన్స్, 2019 తేదీ జూన్ 7, 2019 (‘ప్రూడెన్షియల్ ఫ్రేమ్ వర్క్’), అనుబంధం లోని పేరా 2 ప్రకారం, ఋణ గ్రహీతకు ఆర్థిక సమస్యల కారణంగా కల్పించిన సౌకర్యాలుగా భావించరాదు. కాబట్టి, ఈ అసెట్ల వర్గీకరణ తక్కువ చేయబడదు. 6. పైన పేరా 2క్రింద సహాయం పొందిన నియమిత కాల రుణాల వర్గీకరణ, సవరించిన గడువుతేదీలు, చెల్లింపు తేదీల ఆధారంగా నిర్ణయించబడతాయి. అదేవిధంగా, పేరా 3 ప్రకారం సహాయం అందుకొన్న, నిర్వహణ మూలధన రుణాలకు సంబంధించి, ‘ఎస్ ఎమ్ ఏ’ మరియు ‘ఔట్ ఆఫ్ ఆర్డర్ స్టేట్’, వాయిదా సమయం ముగిసిన తరువాత, వడ్డీ అన్వయించి, పేరా 4 ప్రకారం సవరించిన నిబంధనల ఆధారంగా నిశ్చయించవలెను. 7. ఋణ సంస్థలు, నియంత్రణా అధికారులకు / పరపతి సమాచార సంస్థలకు సమర్పించే నివేదికలలో, పునర్వ్యవస్థీకరించిన చెల్లింపులను (వడ్డీతో కలిపి), బకాయిలుగా పరిగణించరాదు. పై ప్రకటనలకు అనుసారంగా ఋణ సంస్థలు తీసుకొన్న చర్యలు, లబ్ధిదారుల ఋణ చరిత్రకు (క్రెడిట్ హిస్టరీ) చెరుపుచేయకుండా, పరపతి సమాచార సంస్థలు జాగ్రత్త వహించవలెను ఇతర షరతులు 8. పరపతి సంస్థలు, రుణగ్రహీతలకు పైన తెలిపిన ఉపశమనాలు కల్పించుటకు (పైన పేరా 4 అనుసరించి / బహిరంగంగా ప్రకటించినట్లు), వారి అర్హత నిర్ణయించుటకు, బోర్డ్ అనుమతితో విధానాలు రూపొందించవలెను. 9. మార్చి 1, 2020 తేదీన, రూ. 5 కోట్లు లేక అంతకుమించి రుణం జారీచేసిన ఖాతాదారులకు కల్పించిన ఉపశమనాలు, (ప్రతి ఒక్క ఋణగ్రహీత / ఋణ మొత్తం వివరాలతో సహా) యాజమాన్యానికి తెలుపుటకు, విధానం (ఎమ్ ఐ ఎస్) కల్పించవలెను. 10. ఈ సర్క్యులర్లోని ఆదేశాలు, వెంటనే అమలులోకి వస్తాయి. పరపతి సంస్థల బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు / కీలక అధికారులు, ఈ ఆదేశాలు క్రిందిస్థాయి ఉద్యోగులకు సముచితంగా తెలియపరచి, సిబ్బంది వాటిని అమలుపరచుటకు స్పష్టమైన ఆదేశాలు జారీచేయవలేను. మీ విశ్వాసపాత్రులు, (సౌరవ్ సిన్హా) [1వాయిదాలు: మార్చి 1, 2020 నుండి మే 31, 2020 మధ్య చెల్లించవలసిన (i) అసలు మరియు వడ్డీలు (ii) బుల్లెట్ చెల్లింపులు (iii) నెలవారీ సమాన వాయిదాలు (ఈ ఎమ్ ఐలు) (iv) పరపతి కార్డు బకాయిలు] |