<font face="mangal" size="3">భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా డా. ఉర్జిత - ఆర్బిఐ - Reserve Bank of India
భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా డా. ఉర్జిత్ ఆర్. పటేల్ పదవీస్వీకారం
సెప్టెంబర్ 05, 2016 భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా డా. ఉర్జిత్ ఆర్. పటేల్ పదవీస్వీకారం డా. ఉర్జిత్ ఆర్. పటేల్ జనవరి 2013 నుండి డెప్యూటీ గవర్నర్ పదవి నిర్వహించిన అనంతరం సెప్టెంబర్ 4, 2016 నుండి భారతీయ రిజర్వ్ బ్యాంక్, 24వ గవర్నర్గా బాధ్యత తీసుకొన్నారు. మొదటి మూడు సంవత్సరాలు డెప్యూటీ గవర్నర్గా పదవి పూర్తి అయిన తరువాత జనవరి 11, 2016 న, అదేపదవిలో తిరిగి నియుక్తులయ్యారు. డెప్యూటీ గవర్నర్గా ఆయన నిర్వహించిన అనేక బాధ్యతలలో ద్రవ్య విధానం సవరించి బలోపేతంచేయడానికి ఏర్పరచిన నిపుణుల కమిటీకి (Committee to Revise and Strengthen the Monetary Policy Framework) అధ్యక్షత వహించడం ఒకటి. BRICS దేశాల కేంద్రీయ బ్యాంకుల మధ్య ఒప్పందాలు, ప్రభుత్వాల మధ్య ఒడంబడికలు సంతకం చేయడంలో, భారతీయ ప్రతినిధిగా చురుకైన పాత్ర పోషించారు. ఈ ఒప్పందాలు, ఈ దేశాల కేంద్రీయ బ్యాంకుల మధ్య కాంటిన్జెంట్ రిజర్వ్ అరేంజ్మెంట్ [Contingent Reserve Arrangement (CRA)] ఏర్పాటుకు దారితీసింది. డా. పటేల్ అంతర్జాతీయ ద్రవ్య నిధికి (IMF) కూడా సేవలందించారు. 1996-97 లో, IMF నుండి భారతీయ రిజర్వ్ బ్యాంకుకు ప్రతినిధిగా పంపబడ్డారు. ఈ హోదాలో, ఆయన డెట్ మార్కెట్ అభివృద్ధికి, బ్యాంకింగ్ రంగ సంస్కరణలకు, పెన్షన్ ఫండ్ల అభివృద్ధికి, విదేశీ మారక విపణి వికాసానికి సంబంధించి, ఎన్నో సలహాలందించారు. 1998 నుండి 2001 వరకు ఆర్థిక మంత్రిత్వ శాఖలో (ఆర్థిక వ్యవహారాల విభాగం) సలహాదారుగా ఉన్నారు. ఇవేగాక, ప్రభుత్వ/ప్రైవేట్ రంగాల్లో పలు బాధ్యతలు నిర్వహించారు. ప్రత్యక్ష పన్నులపై ప్రత్యేక సంఘం [Task Force on Direct Taxes (Kelkar Committee)]; సివిల్ & డిఫెన్స్ సేవలలో పెన్షన్ విధానంపై ఉన్నత స్థాయి నిపుణుల సంఘం (High-level Expert Group for Reviewing the Civil & Defence Services Pension System); మౌలిక రంగంపై ప్రధాన మంత్రి ప్రత్యేక సంఘం (Prime Minister’s Task Force on Infrastructure): టెలికామ్ కు సంబంధించిన విషయాలపై మంత్రుల సంఘం (Group of Ministers on Telecom Matters); పౌర విమానయాన సంస్కరణలపై సంఘం (Committee on Civil Aviation Reforms); రాష్ట్ర విద్యుత్ బోర్డులపై మినిస్ట్రీ ఆఫ్ పవర్ యొక్క నిపుణుల బృందం (Ministry of Power’s Expert Group on State Electricity Boards) మొదలైన ఎన్నో కేంద్ర, రాష్ట్ర స్థాయి ఉన్నత సంఘాలతో సన్నిహితంగా పనిచేశారు. డా. పటేల్ భారత స్థూల ఆర్థిక వ్యవస్థ (Indian Macroeconomics), ద్రవ్య విధానం (Monetary Policy). పబ్లిక్ ఫైనాన్స్ (Public Finance), భారతీయ ఆర్థిక రంగం (Indian Financial Sector), అంతర్జాతీయ వాణిజ్యం (International Trade) మరియు రెగ్యులేటరీ ఎకనామిక్స్ (Regulatory Economics) అంశాలపై ఎన్నో ప్రచురణలు చేశారు. డా. పటేల్, యేల్ విశ్వ విద్యాలయంనుండి ఆర్థిక శాస్త్రంలో Ph.D; ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంనుండి M.Phil; లండన్ విశ్వ విద్యాలయంనుండి B.Sc పట్టాలు కలిగి ఉన్నారు. అల్పనా కిల్లావాలా పత్రికా ప్రకటన: 2016-2017/590 డా. ఉర్జిత్ ఆర్. పటేల్, సెప్టెంబర్ 6, 2016 తేదీన పదవీస్వీకారం చేశారు. |