RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78469720

గోల్డ్ మోనిటైజేషన్ పథకం, 2015

RBI/2015-16/211
మాస్టర్ డైరెక్షన్ సంఖ్య. డి.బి.ఆర్.ఐ.బి.డి.(DBR.IBD).No.45/23.67.003/2015-16

అక్టోబర్ 22, 2015
(మార్చి 31, 2016 నాటికి నవీకరించబడింది)
(జనవరి 21, 2016 నాటికి నవీకరించబడింది)

గోల్డ్ మోనిటైజేషన్ పథకం, 2015

బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం, 1949 సెక్షన్ 35A క్రింద సంక్రమించిన అధికారాలను వినియోగించుకొని మరియు "గోల్డ్ మోనటైజేషన్ పథకం (జిఎంఎస్)" గురించిన సెప్టెంబరు 15, 2015 నాటి కేంద్ర ప్రభుత్వ కార్యాలయ మెమోరాండం F.No.20/6/2015-FT ప్రకారం, ప్రజా ప్రయోజనాలకు సంతృప్తి చెందినదై, భారతీయ రిజర్వు బ్యాంకు (RBI), అన్ని షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులకు (ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు మినహాయించి) ఈ క్రింది నిర్దేశాన్ని జారీచేస్తోంది.

అధ్యాయం – I
ప్రాథమిక అంశాలు

1.1 లక్ష్యం

గోల్డ్ మోనిటైజేషన్ పథకం (జిఎంఎస్)ప్రస్తుతం ఉన్న గోల్డ్ డిపాజిట్ పథకం (జిడిఎస్) మరియు గోల్డ్ మెటల్ లోన్ పథకం (జిఎంఎల్)లను సవరించడం ద్వారా దేశంలోని కుటుంబాలు, సంస్థలచే నిర్వహించబడుతున్న బంగారంను సమీకరించుకోవడం, ఉత్పాదక ప్రయోజనాల కోసం దాని వినియోగాన్ని సులభతరం చేయడం, దీర్ఘకాలంలో బంగారం దిగుమతిపై దేశ ఆధారితను తగ్గించేందుకు ఉద్దేశించబడినది.

1.2. లఘు శీర్షిక మరియు ఆరంభం

i. ఈ డైరెక్షన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (గోల్డ్ మోనటైజేషన్ పథకం) డైరెక్షన్, 2015 గా పిలవబడుతుంది.

ii. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు (RRBs) మినహాయించి, అన్ని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు ఈ పథకం అమలు చేయడానికి అర్హులు.

iii. పథకంలో పాల్గొనడానికి ఉద్దేశించిన బ్యాంకులు దానిని అమలు చేయడానికి బోర్డు ఆమోదంతో సమగ్రమైన విధానాన్ని రూపొందించాలి.

1.3 నిర్వచనాలు

సందర్భం అవసరం లేకపోతే తప్ప, క్రింది నిబంధనలు, ఇవ్వబడిన అర్ధాలను కలిగి ఉంటాయి:

i. సేకరణ మరియు స్వచ్ఛత పరీక్ష కేంద్రం (CPTC) - బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) చే ధృవీకరించబడిన మరియు కేంద్ర ప్రభుత్వంచే నోటిఫై చేయబడిన సేకరణ మరియు స్వచ్ఛత పరీక్ష కేంద్రాలు, గోల్డ్ మోనిటైజేషన్ పథకం క్రింద బంగారం స్వీకరించడం మరియు రెడెంప్షన్ చేయటానికి అర్హులు.

ii. నియమించబడిన బ్యాంకు - పథకం అమలు చేయాలని నిర్ణయించుకున్న అన్ని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు (ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు మినహాయించి).

iii. గోల్డ్ డిపాజిట్ ఖాతా - పథకం క్రింద నియమించబడిన బ్యాంకులో, గ్రాము బంగారం కొలమానంగా ప్రాంభించబడిన ఖాతా.

iv. మధ్య మరియు దీర్ఘకాలిక ప్రభుత్వ డిపాజిట్లు (MLTGD) - గోల్డ్ మోనటైజేషన్ పథకం క్రింద, 5-7 సంవత్సరాల మధ్యకాల వ్యవధిలో లేదా 12-15 సంవత్సరాల దీర్ఘకాల వ్యవధిలో లేదా ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వంచే నిర్ణయించబడిన కాలవ్యవధి లో చేయబడిన బంగారం డిపాజిట్లు.

v. నామినేటెడ్ బ్యాంకు - విదేశీ వాణిజ్య విధానం క్రింద, బంగారం దిగుమతి చేసుకోవటానికి ఆర్బిఐ అధికారం ఇచ్చిన ఒక షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్.

vi. రిఫైనర్స్ (Refiners) - టెస్టింగ్ మరియు కాలిబ్రేషన్ కోసం నేషనల్ అక్రిడిటిటేషన్ బోర్డ్ (National Accreditation Board for Testing and Calibration-NABL) ద్వారా గుర్తింపు పొందిన మరియు కేంద్ర ప్రభుత్వం చే నోటిఫై చేయబడిన శుద్ధి కర్మాగారాలు.

vii. పథకం - గోల్డ్ మోనటైజేషన్ పథకం, 2015 లో, పునరుద్దరించబడిన గోల్డ్ డిపాజిట్ పథకం (R-GDS) మరియు గోల్డ్ మెటల్ లోన్ పథకం (R-GML) సమ్మిళతమై ఉంటాయి.

viii. స్వల్పకాలిక బ్యాంకు డిపాజిట్ (STBD) - గోల్డ్ మోనటైజేషన్ పథకం క్రింద, 1-3 సంవత్సరాల స్వల్పకాల వ్యవధిలో, నియమించబడిన బ్యాంకు లో చేయబడిన బంగారం డిపాజిట్లు.

అధ్యాయం – II
పునరుత్పాదక గోల్డ్ డిపాజిట్ పథకం (Revamped Gold Deposit Scheme-R-GDS)

2.1 ప్రాథమిక లక్షణాలు

2.1.1 సాధారణ లక్షణాలు

i. ఈ పథకం ఇప్పటికే ఉన్న గోల్డ్ డిపాజిట్ పథకం, 1999 ని భర్తీ చేస్తుంది. అయినప్పటికి, డిపాజిటర్లు అప్పటికే ఉన్న సూచనల ప్రకారం వ్యవధి కంటే ముందుగా వెనక్కి తీసుకుంటే తప్ప, గోల్డ్ డిపాజిట్ పథకం క్రింద ఉన్న డిపాజిట్లు, పరిపక్వత వరకు అమలు చేయబడతాయి.

ii. నియమించబడిన అన్ని బ్యాంకులు, పథకం అమలు చేయడానికి అర్హులు.

iii. STBD పై అసలు మరియు వడ్డీ, బంగారంతో పేర్కొనబడుతుంది. MLTGD విషయంలో అసలు, బంగారంతో పేర్కొనబడుతుంది. అయితే, MLTGD పై వడ్డీ, డిపాజిట్ చేసిన సమయంలోని బంగారం విలువను సూచిస్తూ భారత రూపాయలలో లెక్కించబడుతుంది.

iv. డిపాజిట్ చేయటానికి అర్హత కలిగిన వ్యక్తులు - నివాస భారతీయులు (వ్యక్తులు, HUF లు, యాజమాన్య & భాగస్వామ్య సంస్థలు, ట్రస్టులు, సెబీ (మ్యూచువల్ ఫండ్) రెగ్యులేషన్స్ క్రింద నమోదు చేయబడిన మ్యూచువల్ ఫండ్స్ / ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, ఈ పథకం లో డిపాజిట్ చేయవచ్చు. రెండు లేదా అంతకంటే ఎక్కువ అర్హత గల డిపాజిటర్ల జాయింట్ డిపాజిట్లు కూడా పథకం కింద అనుమతించబడతాయి మరియు అటువంటి సందర్భంలో అలాంటి డిపాజిటర్ల పేరుతో ప్రారంభించబడిన ఉమ్మడి డిపాజిట్ ఖాతాకు జమ చేయాలి. నామినేషన్లతో సహా బ్యాంకు డిపాజిట్ ఖాతాల ఉమ్మడి లావాదేవీలకు సంబంధించిన ప్రస్తుత నియమాలు నామినేషన్ తో సహా, ఈ గోల్డ్ డిపాజిట్లకు వర్తిస్తాయి.

v. ఈ పథకం కింద అన్ని డిపాజిట్లు CPTC వద్ద చేయబడతాయి.

డిపాజిటర్ల అభీష్టానుసారం, ప్రత్యేకంగా పెద్ద డిపాజిటుదార్ల నుండి నియమించబడిన శాఖలలో, ఎక్కువ మొత్తం గోల్డ్ డిపాజిట్లను బ్యాంకులు అంగీకరించవచ్చు.

బ్యాంకులు, వారి అభీష్టానుసారం, డిపాజిటర్లను తమ బంగారం నిధులను నేరుగా రిఫైనరీస్ లో జమ చేయటానికి, మరియు 995 ప్రామాణిక బంగారం యొక్క డిపాజిట్ రసీదులను అవి డిపాజిటర్ల కు ఇవ్వటానికి అనుమతించవచ్చు.

vi. ఈ పథకం కింద డిపాజిట్లపై పోగయ్యే వడ్డీ, బంగారాన్ని వాణిజ్యానికి అనువైన గోల్డ్ బార్స్ గా శుద్ధీకరణ చేసిన తేదీ నుండి లేదా CPTC/నియమించబడిన శాఖలలో జమ చేసిన 30 రోజుల తర్వాత ప్రారంభమవుతుంది.

vii. CPTC/నియమించబడిన శాఖ ద్వారా బంగారం అందుకున్న తేదీ నుండి, డిపాజిట్ లో వడ్డీని ప్రారంభించే తేదీ వరకు, CPTC/నియమించబడిన శాఖ ద్వారా అంగీకరించిన బంగారం, నియమించబడిన శాఖ సురక్షిత అదుపులో వున్న అంశంగా పరిగణించాలి.

viii. ఏ తేదీ నుండి ఈ పథకం క్రింద జమ అయిన బంగారం పై వడ్డీ చెల్లింపు మొదలువుతున్నదో, అదే తేదీ నుండి నియమించబడిన బ్యాంకులు ఆర్బిఐ ప్రకటించిన రూపాయి-యుఎస్ డాలర్ రిఫరెన్స్ రేటుతో, రూపాయలలో లండన్ AM గోల్డ్/యుఎస్ డాలర్ రేటును దాటుకొని, అసెట్స్ మరియు లయబిలిటీస్ గా మార్చాలి. బంగారం దిగుమతికి అవసరమైన కస్టమ్స్ సుంకం, బంగారు తుది విలువకు చేర్చబడుతుంది. ఈ విధానం తర్వాత ఏవైనా వాల్యుయేషన్ తేదీలలో బంగారు విలువ కోసం మరియు పథకం క్రింద భారత రూపాయలలో బంగారు మార్పిడికి కూడా అనుసరించబడుతుంది.

ix. పథకం అమలుచేసే విధానం బోర్డు ఆమోదం పొందిన వెంటనే, పథకంలో పాల్గొనడానికి బ్యాంకు తమ నిర్ణయాన్ని ఆర్బిఐకి తెలియజేయాలి. అనుబంధం-2 లో ఇవ్వబడిన ఫార్మాట్ ప్రకారం, నెలవారీ ప్రాతిపదికన, పథకం కింద సమీకరించిన బంగారం వివరాలు ఆర్.బి.ఐ కి రిపోర్ట్ చేయాలి.

x. గోల్డ్ డిపాజిట్ పథకం (GMS) పై పన్ను వివరాలు ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేస్తుంది.

xi. బంగారం పరిమాణం ఒక గ్రాము యొక్క మూడు దశల వరకు వ్యక్తం చేయబడుతుంది.

2.1.2 డిపాజిట్ల స్వీకరణ

i. ఏ సమయంలోనైనా కనీస డిపాజిట్ 30 గ్రాముల ముడి బంగారం (బార్స్, నాణేలు, రాళ్ళు మరియు ఇతర లోహాలు మినహా ఆభరణాలు). పథకం కింద డిపాజిట్ కొరకు ఎటువంటి గరిష్ట పరిమితి లేదు.

ii. ఈ పథకం క్రింద CPTC వద్ద లేదా నియమించబడిన బ్రాంచీలలో స్వీకరించిన అన్ని బంగారు డిపాజిట్లు, CPTC వద్ద వన్నె చూచి నిర్ణయించబడతాయి.

నియమించబడిన బ్యాంకు శాఖలు నేరుగా అంగీకరించిన ప్రామాణిక బంగారం, CPTC వద్ద వన్నె చూచుట, బ్యాంకు వారి అభీష్టానుసారం.

2.2 డిపాజిట్ల రకాలు

క్రింద సూచించిన విధంగా రెండు వేర్వేరు బంగారు డిపాజిట్ పథకాలు అమలులో ఉంటాయి:

2.2.1 స్వల్పకాలిక బ్యాంకు డిపాజిట్ (STBD)

i. పైన పేర్కొన్న 2.1 నిబంధనలన్నీ ఈ డిపాజిట్ కు వర్తిస్తాయి.

ii. డిపాజిట్ 1-3 సంవత్సరాల వ్యవధి (ఒక సంవత్సరపు గుణిజాలలో రోలోవర్ తో) కొరకు, నియమించబడిన బ్యాంకులలో చేయవచ్చు మరియు అది వారి ఆన్-బ్యాలెన్స్ షీట్ లయబిలిటీ గా వ్యవహరించబడుతుంది.

iii. ఆర్.బి.ఐ. వర్తింపచేసే సూచనల ప్రకారం డిపాజిట్, CRR మరియు SLR అవసరాలకు, డిపాజిట్ ఖాతాకు జమ చేసిన తేదీ నుండి ఆకర్షిస్తుంది. ఏది ఏమైనప్పటికీ, జూలై 1, 2015 నాటి ఆర్.బి.ఐ. మాస్టర్ సర్క్యులర్ - నగదు నిల్వ నిష్పత్తి (CRR) మరియు చట్టబద్ధ ద్రవ్యత నిష్పత్తి (SLR) ప్రకారం, బ్యాంకులచే వారి పుస్తకాలలో ఉన్న బంగారు నిల్వలు, SLR అవసరానికి తగిన ఆస్తిగా పరిగణించబడతాయి.

iv. నియమించబడిన బ్యాంకులు, వారి అభీష్టానుసారంగా, డిపాజిట్ యొక్క మొత్తము లేదా కొంత భాగం వ్యవధి కంటే ముందు తీసుకోవడానికి మరియు కనీస లాక్-ఇన్ వ్యవధి మరియు జరిమానాలు, ఏమైనా ఉంటే, విధించటానికి నిర్ణయం కలిగి ఉంటాయి.

v. ఈ డిపాజిట్లపై వడ్డీ రేట్లు నియమించబడిన బ్యాంకుల విచక్షణ ఆధారంగా ఉంటాయి. డిపాజిట్ ఖాతాలపై వడ్డీ, చెల్లింపవలసిన తేదీ నాడు జమ చేయబడుతుంది మరియు డిపాజిట్ నిబంధనల ప్రకారం కాలానుగుణంగా లేదా పరిపక్వతలో ఉపసంహరించుకోవచ్చు.

vi. పరిపక్వత ఐన డిపాజిట్ రిడంప్షన్ సమయంలో, అసలు మరియు వడ్డీ, డిపాజిటుదారుని అభిమతం ప్రకారం బంగారానికి మరియు పోగయ్యే వడ్డీకి ఇండియన్ రూపాయిలలో సమానమైన విలువ లేదా సమానమైన బంగారంగా ఉంటుంది. ఈ విషయంలో డిపాజిట్ చేసే సమయంలో డిపాజిటర్ యొక్క అభిమతం వ్రాతపూర్వకంగా తీసుకోవడం జరుగుతుంది మరియు అది వాపసు తీసుకోవడం వీలుపడదు.

వ్యవధి కంటే ముందు వాపసు తీసుకున్న డిపాజిట్లు, నియమించబడిన బ్యాంకు అభీష్టానుసారం, భారతదేశ రూపాయికి సమానమైన విలువలో లేదా బంగారం రూపంలో చెల్లించబడతాయి.

2.2.2 మధ్య మరియు దీర్ఘకాలిక ప్రభుత్వ డిపాజిట్ (MLTGD)

i. పైన 2.1 లో తెలిపిన మార్గదర్శకాలు అన్నీఈ డిపాజిట్ కు వర్తిస్తాయి.

ii. కేంద్ర ప్రభుత్వం తరపున నియమించబడిన బ్యాంకులచే, ఈ వర్గం క్రింద డిపాజిట్ ఆమోదించబడుతుంది. CPTC ద్వారా జారీ చేసిన రసీదులు మరియు నియమించబడిన బ్యాంకులచే జారీ చేయబడిన సర్టిఫికెట్లు, ఈ విషయాన్నీ స్పష్టంగా తెలియజేయాలి.

iii. ఈ డిపాజిట్ నియమించబడిన బ్యాంకుల బ్యాలెన్స్ షీట్లో ప్రతిబింబించదు. ఇది కేంద్ర ప్రభుత్వ లయబిలిటీ గా ఉంటుంది. నియమించబడిన బ్యాంకులు, కేంద్ర ప్రభుత్వ ఆదేశానుసారం తగిన వ్యక్తికి బదిలీ చేయబడే వరకు, అట్టి డిపాజిట్ లను తమ అధీనంలో కలిగి ఉంటాయి.

iv. మధ్యకాల ప్రభుత్వ డిపాజిట్ (MTGD) 5-7 సంవత్సరాలు, మరియు దీర్ఘకాలిక ప్రభుత్వ డిపాజిట్ (LTGD), 12-15 సంవత్సరాలుగా లేదా ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన వ్యవధి లో ఉంటుంది.

(ఎ) అటువంటి డిపాజిట్లపై వడ్డీరేటు కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది మరియు భారత రిజర్వ్ బ్యాంక్ ఎప్పటికప్పుడు తెలియజేస్తుంది. కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన ప్రస్తుత వడ్డీ రేటు ఈ క్రింది విధంగా వుంది:

(i) మధ్యకాల డిపాజిట్ - 2.25% సాలీనా

(ii) దీర్ఘకాల డిపాజిట్ - 2.50% సాలీనా

(బి) నియమించబడిన బ్యాంకులు, డిపాజిట్ యొక్క మొత్తము లేదా కొంత భాగం వ్యవధి కంటే ముందు తీసుకోవడానికి ఈ క్రింద సూచించిన కనీస లాక్-ఇన్ వ్యవధి మరియు జరిమానాలతో అనుమతించవచ్చు:

(i) కనీస లాక్-ఇన్ వ్యవధి

మధ్యకాల ప్రభుత్వ డిపాజిట్ (MTGD) 3 సంవత్సరాల తర్వాత మరియు దీర్ఘకాలిక ప్రభుత్వ డిపాజిట్ (LTGD) 5 సంవత్సరాల తర్వాత వాపసు తీసుకోవడానికి అనుమతింపబడతాయి.

(ii) వ్యవధి కంటే ముందు వాపసు తీసుకున్నప్పుడు విధించబడే జరిమానాలు:

వ్యవధి కంటే ముందు వాపసు తీసుకున్నప్పుడు చెల్లించవలసిన మొత్తాన్ని (A) మరియు (B) యొక్క మొత్తం గా లెక్కించవచ్చు.

(A) ఉపసంహరణ రోజున గోల్డ్ డిపాజిట్ యొక్క వాస్తవిక మార్కెట్ విలువ.

(B) క్రింద సూచించిన విధంగా, డిపాజిట్ సమయంలో బంగారు విలువపై చెల్లించే వడ్డీ; @

డిపాజిట్ రకం లాక్ ఇన్ వ్యవధి (సంవత్సరాలు) డిపాజిట్ చేసిన అసలు వ్యవధి (సంవత్సరాలు)
>3 మరియు <5 ≤ 5 మరియు <7
MTGD 3 డిపాజిట్ చేసే సమయంలో MTGD కి వర్తించే వడ్డీ- 0.375% డిపాజిట్ చేసేసమయంలో MTGD కి వర్తించే వడ్డీ- 0.25%

డిపాజిట్ రకం లాక్ ఇన్ వ్యవధి (సంవత్సరాలు) డిపాజిట్ చేసిన అసలు వ్యవధి (సంవత్సరాలు)
>5 మరియు <7 ≤ 7 మరియు <12 ≤ 12 మరియు <15
LTGD 5 డిపాజిట్ చేసే సమయంలో MTGD కి వర్తించే వడ్డీ- 0.25% డిపాజిట్ చేసే సమయంలో LTGD కి వర్తించే వడ్డీ- 0.375% డిపాజిట్ చేసే సమయంలో LTGD కి వర్తించే వడ్డీ- 0.25%

v. MLTGD విషయంలో, డిపాజిటర్ ఇష్టానుసారం, డిపాజిట్ చేసిన బంగారం యొక్క విలువ ఇండియన్ రూపాయలలో బంగారు విలువకు లేదా బంగారంతో సమానంగా ఉంటుంది. డిపాజిట్ చెల్లింపు బంగారంలో ఐతే, విలువ మొత్తం లో 0.2% పరిపాలనా బాధ్యతల దృష్ట్యా, డిపాజిటర్ నుండి సేకరించబడుతుంది. MLTGD పై వచ్చే వడ్డీని, డిపాజిట్ సమయంలో ఇండియన్ రూపాయల పరంగా బంగారం విలువకు సంబంధించి లెక్కించాలి మరియు నగదులో మాత్రమే చెల్లించబడతాయి.

vi. MLTGD క్రింద పొందిన బంగారం, ప్రభుత్వం ప్రకటించిన ఏజన్సీలచే వేలం వేయబడుతుంది మరియు విక్రయాల ద్వారా ఆర్.బి.ఐ లో ఉన్న ప్రభుత్వ ఖాతాకు జమ చేయబడుతుంది.

vii. డిపాజిట్ ఖాతాలు బంగారం రూపం లో, గోల్డ్ డిపాజిట్ ఎకౌంట్స్ గా రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తుంది.

viii. వేలం వివరాలు మరియు అకౌంటింగ్ విధానం, భారత ప్రభుత్వం నోటిఫై చేస్తుంది.

ix. పథకం ప్రారంభించిన తేదీ నుండి ఒక సంవత్సర ప్రారంభ కాలం కోసం అనగా నవంబర్ 5, 2015 నుండి, పథకం కింద సమీకరించిన MLTGD డిపాజిట్ల రూపాయి మొత్తం విలువకి, నియమయించబడిన బ్యాంకుల నిర్వహణ ఖర్చులు (బంగారు స్వచ్ఛత పరీక్ష, శుద్ధి, రవాణా, నిల్వ మరియు ఇతర సంబంధిత వ్యయాలు) నిమిత్తం, 1.5% మరియు కమిషన్ 1% గా బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది.

వివరణ: బ్యాంకులకు చెల్లించాల్సిన నిర్వహణ ఖర్చులు మరియు కమిషన్ లెక్కించడం కోసం డిపాజిట్ చేయబడిన తేదీన బంగారం ధర యొక్క రూపాయి విలువ ఆధారంగా ఉంటుంది.

2.3 గోల్డ్ డిపాజిట్ ఖాతాలు ప్రారంభించడం

ఇతర డిపాజిట్ ఖాతాకు వర్తించే విధంగా బంగారం డిపాజిట్ ఖాతాలు కూడా ఖాతాదారుని గుర్తింపుకు సంబంధించి, అవే నియమాలకు లోబడి ఉండాలి. ఇంతకుముందు నియమయించబడిన బ్యాంకులో ఏ ఖాతా లేని డిపాజిటుదారులు గోల్డ్ డిపాజిట్ ఖాతాను సున్నా బాలన్స్ తో CPTC లో బంగారం జమ చేయడానికి ముందు ప్రారంభించాలి. రిజర్వ్ బ్యాంక్ సూచించిన విధంగా KYC నియమావళికి అనుగుణంగా గోల్డ్ డిపాజిట్ ఖాతాను ప్రారంభించాలి.

డిపాజిట్ సర్టిఫికేట్ జారీ కోసం డిపాజిటర్ సమర్పించే రసీదుతో సంబంధం లేకుండా, CPTC వద్ద బంగారం అందుకున్న 30 రోజులు తర్వాత, CPTC సూచించిన విధంగా 995 స్వచ్ఛత గల బంగారం మొత్తంతో, నిర్ణయించిన బ్యాంకులు STBD లేదా MLTGD లను చెల్లిస్తాయి.

2.4 సేకరణ మరియు స్వచ్ఛత పరీక్షా కేంద్రాలు

i. BIS సర్టిఫికేట్ కలిగి పథకం క్రింద వున్న CPTCల జాబితాను కేంద్ర ప్రభుత్వం ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) ద్వారా బ్యాంకులకు తెలియజేస్తుంది.

ii. కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రకటించిన జాబితాలో వున్న CPTC లను, వారి క్రెడిట్ విశ్వసనీయత ఆధారంగా, ఏజెంట్లుగా బంగారం నిర్వహణ కోసం నియమించబడిన బ్యాంకులు ఎంచుకోవచ్చు. (బ్యాంకులు, రిఫైనరీలు మరియు CPTC ల మధ్య త్రైపాక్షిక ఒప్పందం కోసం పేరా 2.6 చూడండి).

iii. బ్యాంకు తరఫున బంగారం డిపాజిట్ సేకరించే CPTC, అట్టి బ్యాంకు పేరు అది ప్రదర్శించబడే బ్యాంకుల జాబితాలో ఉండేలా, నియమించబడిన బ్యాంకు సురక్షితం చేసుకోవాలి.

iv. CPTC లు వసూలు చేసే రుసుము యొక్క షెడ్యూల్ అట్టి కేంద్రంలో ఒక ప్రముఖ ప్రదేశంలో ప్రదర్శించాలి.

v. CPTC లో ముడి బంగారం జమ చేసేముందు, ఏ నియమించబడిన బ్యాంకులో డిపాజిట్ చెయ్యాలనుకుంటున్నాడో అది డిపాజిటుదారు తెలియపర్చాలి. $

vi. బంగారం యొక్క వన్నె పరీక్షణ తరువాత డిపాజిటర్ సూచించిన నియమించబడిన బ్యాంక్ తరఫున, అధీకృత సంతకందారులచే సంతకం చేసిన 995 ప్రామాణిక బంగారుని చూపే రసీదును, CPTC జారీ చేస్తుంది. అదే సమయంలో, డిపాజిట్ ఆమోదం గురించి నియమించబడిన బ్యాంకుకి CPTC సమాచారం ఇస్తుంది.

vii. CPTC చే నిర్ణయించబడిన 995 వన్నెకు సమానమైన బంగారు విలువ ప్రామాణికంగా ఉంటుంది. CTPC ద్వారా రసీదు జారీ చేయబడిన తర్వాత పరిమాణం లేదా నాణ్యతలో ఏదైనా వ్యత్యాసం లేక మరేదైనా కారణంవల్ల తేడా ఉంటే, త్రైపాక్షిక ఒప్పందం యొక్క నిబంధనలకు అనుగుణంగా మూడు పార్టీలు అనగా, CPTC, రిఫైనర్ మరియు నియమించబడిన బ్యాంకు పరిష్కరించుకోవాలి.

viii. వ్యక్తిగతంగా లేదా పోస్ట్ ద్వారా, CPTC జారీ చేసిన 995 వన్నెకు సమానమైన మొత్తం బంగారం చూపించే రసీదుని, డిపాజిటర్ నియమించబడిన బ్యాంకు శాఖకు సమర్పించాలి.

ix. డిపాజిటర్ ద్వారా డిపాజిట్ రసీదు సమర్పించినప్పుడు, నియమించబడిన బ్యాంకు అదే రోజున లేదా CPTC వద్ద బంగారం జమ చేసిన ౩౦ రోజుల తర్వాత, ఏది తరువాత ఐతే అది, అంతిమ డిపాజిట్ సర్టిఫికేట్ జారీ చేయాలి.

x. CPTC వద్ద బంగారం యొక్క వన్నె పరీక్షణ గురించి అనుబంధం -1 లో వివరించబడింది.

2.5 రిఫైనరీస్ కు బంగారం బదిలీ చేయడం

i. రిఫైనర్స్ యొక్క విశ్వసనీయత ఆధారంగా, నియమించబడిన బ్యాంకులు వారి అంచనా ఆధారంగా రిఫైనర్స్ ని ఎంచుకోవచ్చు.

ii. త్రైపాక్షిక ఒప్పందంలో పేర్కొన్న నిబంధనలు మరియు షరతుల ప్రకారం CPTCలు రిఫైనర్లకు బంగారం బదిలీ చేస్తాయి.

iii. నియమించబడిన బ్యాంకు యొక్క అభిమతం ప్రకారం, శుద్ధి చేయబడిన బంగారం, రిఫైనర్స్ యొక్క వాల్ట్ లో లేదా శాఖలోనే ఉంచబడుతుంది.

iv. రిఫైనర్స్ అందించిన సేవలకు, నియమించబడిన బ్యాంకులు, పరస్పరం నిర్ణయించుకున్న విధంగా రుసుము చెల్లిస్తాయి.

v. డిపాజిటర్ నుండి ఏ చార్జీలు, రిఫయినర్లు వసూలు చేయరు.

2.6 నియమించబడిన బ్యాంకులు, రిఫైనర్లు మరియు CPTC ల మధ్య త్రైపాక్షిక ఒప్పందం

i. ప్రతి నియమించబడిన బ్యాంకు, ఈ పథకం క్రింద రిఫైనర్స్ మరియు CPTC లతో చట్టబద్ధత కలిగిన త్రైపాక్షిక ఒప్పందం చేసుకోవాలి.

ii. రుసుము చెల్లింపు, అందించే సేవలు, ప్రమాణాలు, బంగారం యొక్క కదలికలు, మూడు పక్షాల యొక్క హక్కులు మరియు బాధ్యతలు, పథకం యొక్క కార్యకలాపాలకి సంబంధించిన అన్ని విషయాల గురించి ఒప్పందం లో స్పష్టంగా ఉండాలి

iii. త్రైపాక్షిక ఒప్పందం లో రిఫైనరీస్ వద్ద నేరుగా బంగారం డిపాజిట్ చేసేలా ఉండాలి అలా లేనిచో ప్రత్యామ్నాయంగా బ్యాంకులు రిఫైనరీస్ తో త్రైపాక్షిక ఒప్పందంతో పాటు, ఈ విషయంలో ద్వైపాక్షిక ఒప్పందం కూడా చేసుకోవాలి.

2.7 గోల్డ్ మోనిటైజేషన్ పథకం క్రింద సమీకరింపబడిన బంగారం వినియోగం

2.7.1 STBD క్రింద అంగీకరింపబడిన బంగారం

సామాన్యతకు పక్షపాతం లేకుండా, నియమించబడిన బ్యాంకులు STBD కింద సమీకరించబడిన బంగారాన్ని;

i. ఇండియా బంగారు నాణాలు (IGC) తయారుచేయడానికి ఎంఎంటీసీ (MMTC)కి, నగల వ్యాపారులకు మరియు గోల్డ్ మోనిటైజేషన్ పథకం లో పాల్గొనే బ్యాంకులకు విక్రయించవచ్చు లేదా;

ii. ఇండియా బంగారు నాణాలు (IGC) తయారుచేయడానికి GML క్రింద MMTCకి మరియు నగల వ్యాపారులకు అప్పు గా ఇవ్వవచ్చు.

2.7.2 MLTGD క్రింద అంగీకరింపబడిన బంగారం

i. MLTGD క్రింద డిపాజిట్ చేయబడిన బంగారాన్ని MMTC, మరియు కేంద్ర ప్రభత్వం నోటిఫై చేసిన ఏ ఇతర సంస్థలైనా వేలం వేయవచ్చు మరియు అమ్మకపు సొమ్ము ఆర్బీఐ లో ఉన్న కేంద్ర ప్రభుత్వ ఖాతా కు జమచేయబడుతుంది.

ii. RBI, MMTC, బ్యాంకులు మరియు కేంద్ర ప్రభత్వం నోటిఫై చేసిన ఏ ఇతర సంస్థలైనా వేలం లో పాల్గొనవచ్చు.

iii. నియమించబడిన బ్యాంకుచే వేలం క్రింద కొనుగోలు చేయబడిన బంగారం, పైన పేర్కొన్న పేరా 2.7.1 వద్ద సూచించిన ఏ ప్రయోజనాల కోసం అయినా వాడుకోవచ్చు.

2.8 రిస్క్ మేనేజ్మెంట్

i. నియమించబడిన బ్యాంకులు ఇంటర్నేషనల్ ఎక్స్ఛేంజీలను, లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ ను ఉపయోగించడానికి లేదా ఆర్బీఐ జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా బులియన్ ధరలకు ఓవర్ ది కౌంటర్ కాంట్రాక్టులను ఎక్స్పోజర్స్ హెడ్జ్ చేయడానికి అనుమతించబడతాయి.

ii. నియమించబడిన బ్యాంకులు బంగారు ధరల నుండి ఉత్పన్నమైన నష్టాన్ని ఎదుర్కోవడానికి సముచిత పరిమితులతో, తగిన రిస్క్ మేనేజ్మెంట్ మెళుకువలను కలిగి ఉంచాలి.

2.9 CPTCలు మరియు రిఫైనరీస్ మీద పర్యవేక్షణ

i. BIS, NABL, RBI మరియు IBA లతో సంప్రదింపుల ద్వారా CPTCలు మరియు రిఫైనర్స్ మీద కేంద్ర ప్రభుత్వం (BIS మరియు NABL), ప్రమాణాలను పాటించడానికి సరైన పర్యవేక్షక యంత్రాంగాన్ని నియమించవచ్చు.

ii. కేంద్ర ప్రభుత్వం అసంతృప్త CPTCలు మరియు రిఫైనర్లకు వ్యతిరేకంగా చర్య మరియు జరిమానాలు కూడా విధించవచ్చు.

iii. CPTCలకు వ్యతిరేకంగా ఏదైనా డిపాజిటర్ యొక్క ఫిర్యాదులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సరైన ఫిర్యాదు నివారణ ప్రక్రియ అమలులో పెట్టవచ్చు.

iv. రసీదులు మరియు డిపాజిట్ సర్టిఫికేట్లు, డిపాజిట్ల రిడంప్షన్, వడ్డీ చెల్లింపు చేయడంలో ఏవైనా వ్యత్యాసాలకు సంబంధించి, నియమించబడిన బ్యాంకులపై ఫిర్యాదులు మొదట బ్యాంకు యొక్క ఫిర్యాదు నివారణ ప్రక్రియ ద్వారా ఆ తరువాత ఆర్బిఐ బ్యాంకింగ్ అంబుడ్స్ మన్ చే పరిష్కరింపబడుతాయి.

అధ్యాయం – III
GMS - లింక్డ్ గోల్డ్ మెటల్ లోన్ (GML) పథకం

3.1.1 జనరల్

i. STBD క్రింద సమీకరించబడిన బంగారాన్ని నగల వర్తకులకు GML గా అందించవచ్చు. నియమించబడిన బ్యాంకులు కూడా MLTGD క్రింద వేలం వేయబడిన బంగారం కొనుగోలుచేసి, దాన్ని నగల వర్తకులకు GML గా ఇవ్వవచ్చు.

ii. శుద్ధి చేసిన బంగారు నిల్వ ఉన్న స్థలంపై ఆధారపడి, గోల్డ్ రిఫైనర్ల నుండి లేదా నియమించబడిన బ్యాంకు నుండి, భౌతికంగా బంగారం పంపిణీ జరుగుతుంది.

iii. జూలై 1, 2015 నాటి రుణాలు మరియు అడ్వాన్సుల పై ఆర్బిఐ మాస్టర్ సర్క్యులర్ యొక్క పేరా 2.3.12 ప్రకారం, నామినేట్ అయిన బ్యాంకులచే ప్రస్తుతం అమలులో ఉన్న బంగారం (మెటల్) లోన్ (GML) పథకం, GMS- లింక్డ్ జిఎంఎల్ పథకానికి సమాంతరంగా కొనసాగుతుంది. ప్రస్తుతమున్న GML పథకానికి ఉన్న అన్ని ప్రూడెన్షియల్ మార్గదర్శకాలు మాస్టర్ సర్క్యులర్ లో ఎప్పటికప్పుడు సవరించిన విధంగా, కొత్త పథకానికి కూడా వర్తిస్తాయి.

iv. నామినేటెడ్ బ్యాంకుల కాక, నియమించబడిన బ్యాంకులు STBD కింద సమీకరించబడిన బంగారు డిపాజిట్లపై మాత్రమే, బంగారం దిగుమతి చేసుకోవడానికి అర్హులు.

3.1.2 వసూలు చేయబడే వడ్డీ

GMS - లింక్డ్ గోల్డ్ మెటల్ లోన్ (GML) ఫై వడ్డీరేటును నిర్ణయించటానికి బ్యాంకులకు స్వేచ్ఛ ఉంటుంది

3.1.3 టెనార్

GMS-లింక్డ్ GML, మరియు GML పథకం యొక్క టెనార్, ఒకే విధంగా ఉంటుంది.

రాజిందర్ కుమార్
చీఫ్ జనరల్ మేనేజర్


@ వడ్డీ లెక్కింపు ఉదాహరణ (Illustration of interest calculation)

డిపాజిట్ రకం లాక్ ఇన్ వ్యవధి (సంవత్సరాలు) డిపాజిట్ అమలు చేసిన అసలు వ్యవధి (సంవత్సరాలు)
>3 మరియు <5 ≤ 5 మరియు <7
MTGD …………… నాటి స్థితి 2.250%-0.375%= 1.875% 2.250%-0.250%= 2.00%

    >5 మరియు <7 ≤ 7 మరియు <12 ≤ 12 మరియు <15
LTGD ……. నాటి స్థితి 2.250%-0.250%= 2.00% 2.500%-0.375%= 2.125% 2.500%-0.250%= 2.25%

$ GMS అమలు గురించి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA), ప్రామాణిక దస్తావేజులు అనగా ముడి బంగారాన్ని నాణ్యతా పరీక్షా కేంద్రానికి ఇవ్వడం, బంగారం యొక్క భౌతిక రూపం మరియు ఇతర లక్షణాలు, XRF యొక్క ఫలితాలు నమోదు చేయటం, బంగారాన్ని కరిగించడానికి ఖాతాదారుని సమ్మతి, అంతిమ డిపాజిట్ చేయడానికి ఖాతాదారుని సమ్మతి, ఖాతాదారునికి ఇవ్వాల్సిన అంతిమ రసీదు మరియు ఇతర ఏదైనా దస్తావేజులు మొదలగునవి రూపొందించడానికి సమ్మతి తెలిపింది. దస్తావేజుల మొత్తం సెట్ డిపాజిటుదారుకి ముందుగానే ఇవ్వాలి మరియు దాంట్లో పథకం యొక్క నియమ నిబంధనలు, రుసుములు కూడా వెల్లడించాలి. ఈ దస్తావేజులన్నీ IBA వెబ్ సైట్ లో ఉంచాలి మరియు భౌతిక రూపంగా కూడా ఖాతాదారునికి ఇవ్వాలి.

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?