RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78525908

గవర్నర్ యొక్క ప్రకటన: ఏప్రిల్ 08, 2022

ఏప్రిల్ 08, 2022

గవర్నర్ యొక్క ప్రకటన: ఏప్రిల్ 08, 2022

రెండేళ్ల క్రితం మార్చి 2020లో, మన ఆర్థిక వ్యవస్థపై కోవిడ్-19 దాడిని ధైర్యంగా మరియు దృఢ సంకల్పంతో పోరాడేందుకు మనం మన మార్గాన్ని ప్రారంభించాము. ఆ తర్వాతి కాలం వచ్చిన, కల్లోల పరిస్థితులలో రిజర్వు బ్యాంకు విజయవంతంగా తన మార్గాన్ని సుగమం చేసుకుంది. మహమ్మారి మన మనస్తత్వాన్ని దెబ్బతీసి మన స్థితిస్థాపకతను పరీక్షించినప్పటికీ, మహమ్మారి మూడు వేవ్ ల నుండీ ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడానికి మేము సాహసోపేతమైన, సాంప్రదాయేతర మరియు దృఢమైన చర్యలతో ప్రతిస్పందించగలిగాము.. పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుందికాబట్టి, మనం లిక్విడిటీ స్థితిని రీబ్యాలేన్స్ చేయాడానికి సమయానుకూలంగా చురుకైన అనేక చర్యలు చేపట్టాము .

2. ఇప్పుడు రెండు సంవత్సరాల తరువాత, మనం మహమ్మారి పరిస్థితి నుండి బయటపదుతున్న తరుణంలో, ఫిబ్రవరి 24 న ఐరోపాలో యుద్ధం ప్రారంభమవడం, ఆంక్షలు మరియు పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ టెక్టోనిక్ మార్పును చవిచూసింది, మనం అపారమైన కొత్త సవాళ్లను ఎదుర్కొంటున్నాము – అవి కీలక వస్తువుల కొరత; అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థకు బీటలు పడడం; మరియు డీగ్లోబలైజేషన్ భయాలు. అధిక అస్థిరతయే కమోడిటీ మరియు ఆర్థిక మార్కెట్లను నిర్దేశిస్తుంది. మహమ్మారి ఆరోగ్య సంక్షోభం నుండి జీవనం మరియు జీవనోపాధి సంక్షోభానికి వేగంగా మారినప్పటికీ, యూరప్ లో ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను గాడి తప్పించే సామర్థ్యాన్ని కలిగి ఉండి. అనేక ప్రతికూలతల మధ్య చిక్కుకున్నoదువల్ల, మన విధానం జాగరూకతతో ఉండడమేకాక క్రియాశీలంగా ఉండి వృద్ధి ని, ద్రవ్యోల్బణం ను ఇంకా ఇతర ఆర్ధిక పరిస్థితులపై పడుతున్న ప్రతికూల ప్రభావాన్ని తగ్గించేదిగా ఉండాలి. సంవత్సరాలుగా మనం నిర్మించిన బలమైన పునాదులు అంటే పెద్ద ఎత్తున ఉన్న ఫారెక్స్ నిల్వలు, బాహ్య రంగ సూచికలలో గణనీయమైన మెరుగుదల మరియు ఆర్థిక రంగాన్ని గణనీయంగా బలోపేతం చేయడంతో సహా,వీటన్నిటిమీద మాకు పూర్తి నమ్మకం ఉంది, ఇవన్నీ ఈ ఉపద్రవాన్ని ఎదుర్కోవడంలో మనకు సహాయపడతాయి. ఆర్ధిక వ్యవస్థ ను చక్కదిద్దడంకోసం మరియు ప్రస్తుత తుఫాను ను దాటడానికి మళ్లివొకసారి ఆర్‌బిఐ ధృడనిశ్చయముతో సిద్ధంగావుంది.

ద్రవ్య విధాన కమిటీ నిర్ణయాలు మరియు చర్చలు

3. ఈ నేపథ్యంలో, మానిటరీ పాలసీ కమిటీ (MPC) 2022 ఏప్రిల్ 6, 7 మరియు 8 తేదీల్లో సమావేశమై, స్థూల ఆర్థిక పరిస్థితి మరియు ఔట్‌లుక్ యొక్క అంచనా ఆధారంగా పాలసీ రెపో రేటును 4 శాతంగా మార్చకుండా ఏకగ్రీవంగా ఓటు వేసింది. భవిష్యత్తులో ద్రవ్యోల్బణం లక్ష్యంలోపే ఉండేలా చూసుకోవడం కోసం, అనుకూలతలను ఉపసంహరించుకోవడంపై దృష్టి సారించి వృద్ధికి తోడ్పాటునందించేందుకు అనుకూలంగా ఉండాలని MPC ఏకగ్రీవంగా నిర్ణయించింది. అదనంగా, లిక్విడిటీ అడ్జస్ట్‌మెంట్ ఫెసిలిటీ (LAF) కారిడార్ విశాలతను 50 బేసిస్ పాయింట్లకు అంటే మహమ్మారికి పూర్వపు స్థాయికి పునరుద్ధరించాలని రిజర్వు బ్యాంకు నిర్ణయించింది, కారిడార్ యొక్క ఫ్లోర్ (ఆధారం) ఇప్పుడు కొత్తగా స్థాపించబడిన శాశ్వత డిపాజిట్ సౌకర్యం (SDF) ద్వారా అందించబడుతుంది, ఇది రెపో రేటు కంటే 25 బేసిస్ పాయింట్లు తక్కువగా ఉంచబడుతుంది, అంటే 3.75 శాతం. నేను దీని గురించి నా ప్రకటనలో తరువాత మాట్లాడతాను.

4. నేను మొదట పాలసీ రేటు మరియు వైఖరిపై MPC నిర్ణయం యొక్క హేతుబద్ధతను ప్రస్తావించాలనుకుంటున్నాను. ఫిబ్రవరి 2022 ప్రారంభంలో జరిగిన MPC గత సమావేశం నుండి, Omicron వేవ్‌ తగ్గినందువల్ల జనించిన సానుకూల పవనాలు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల పెరుగుదల వల్ల చెదిరిపోయాయి. ఈ పరిస్థితి జాతీయంగాను మరియు అంతర్జాతీయం గాను ప్రకృతి చిత్రాన్ని గణనీయంగా మార్చింది. చమురు మరియు సహజవాయువు, గోధుమ మరియు మొక్కజొన్న; పల్లాడియం, అల్యూమినియం మరియు నికెల్; వంట నూనెలు; మరియు ఎరువులు వంటి కీలక వస్తువుల గ్లోబల్ ఉత్పాదకత మరియు ఎగుమతులలో యుద్ధంలో నిమగ్నమైయున్న రెండు ఆర్థిక వ్యవస్థల గణనీయమైన వాటా కారణంగా, దీర్ఘకాలిక సరఫరా అంతరాయాల ఆందోళనలు, అంతర్జాతీయ కమోడిటీ మరియు ఫైనాన్షియల్ మార్కెట్లను కుదిపేశాయి. గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ధరలు క్లుప్తంగా బ్యారెల్‌కు US$130 మార్కును దాటాయి, 2008 నుండి అత్యధిక స్థాయిని తాకాయి మరియు కొన్ని దిద్దుబాట్లు ఉన్నప్పటికీ అధిక స్థాయిలలో అస్థిరంగా ఉన్నాయి. మెటల్ మరియు ఇతర వస్తువుల ధరలతో పాటు గ్లోబల్ లో ఆహార ధరలు కూడా బాగా పెరిగాయి. అభివృద్ధి చెందుతున్న మార్కెట్ ఆర్థిక వ్యవస్థల (EMEలు) ఆస్తులపై రిస్క్ అవర్షన్ (విరక్తి) పెరిగింది, ఇది పెద్దమొత్తంలో క్యాపిటల్ అవుట్-ఫ్లో కు మరియు వారి కరెన్సీలలో తరుగుదల కు దారితీసింది. ఈ సంఘటనలు, మొట్టమొదట గ్లోబల్ ద్రవ్యోల్బణం అంచనాలను తీవ్రతరం చేశాయి, ఇవి ఇప్పటికే ప్రధాన దేశాలలో లక్ష్యాల కంటే బాగా ఎగువ దిశలోనే పనిచేస్తున్నాయి; మరియు రెండవది, భౌగోళికoగా ఉత్పత్తిపై గణనీయమైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి.

5. ద్రవ్యోల్బణంలో తీవ్ర పెరుగుదల మరియు పర్యవసానంగా మానిటరీ పాలసీ నార్మలైజేషణ్ లో ఆర్ధికంగా అభివృద్ధి చెందిన ప్రధాన దేశాలు తలమునకలైన తరుణంలో, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరిగాయి. గ్లోబల్ సప్లై మార్గాలకు అంతరాయాలు మరియు ఇన్‌పుట్ ఖర్చు ఒత్తిడి మరింత ఎక్కువ కాలం పాటు కొనసాగుతుందని భావిస్తున్నారు. మార్చిలో కొన్ని ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో కోవిడ్-19 ఇన్‌ఫెక్షన్‌ల పునరుద్ధరణ మరియు సంబంధిత లాక్‌డౌన్‌లు ప్రపంచ సరఫరా పరిమితులను మరియు ఇన్‌పుట్ ఖర్చు ఒత్తిడిని మరింత దిగజార్చే ప్రమాదం ఉంది. ప్రపంచ వాణిజ్యం మరియు ఉత్పత్తి మరియు తద్వారా అంతర్జాతీయ (ఎక్స్టర్నల్) డిమాండ్ రెండు నెలల క్రితం ఊహించిన దాని కంటే బలహీనంగా ఉండవచ్చు. మొత్తంమీద, గత రెండు నెలలుగా అంతర్జాతీయoగా (ఎక్స్టర్నల్) పరిణామాలు దేశీయ వృద్ధి దృక్పథాన్నిఅధోపాతాళానికి నెట్టి నష్టాలను పెంచాయి మరియు ఫిబ్రవరి MPC ప్రతిపాదనలో ప్రొజెక్ట్ చేయబడిన ద్రవ్యోల్బణ అంచనాలను ఎగదోసి ప్రతికూల నష్టాలను పెంచాయి. ఫిబ్రవరిలో అంచనా వేసిన దానికంటే ఇప్పుడు ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉంటుందని మరియు వృద్ధి రేటు తక్కువగా ఉంటుందని అంచనా. ఆర్థిక కార్యకలాపాలు, కోలుకుంటున్నప్పటికీ, మహమ్మారి పూర్వ స్థాయి కంటే పెద్ద ఎక్కువేమి లేవు. ఈ నేపథ్యంలో, రెపో రేటును 4 శాతం వద్దే కొనసాగించాలని ఎంపీసీ నిర్ణయించింది. వృద్ధికి మద్దతునిస్తూ ద్రవ్యోల్బణం లక్ష్యంలోనే ఉండేలా చూసుకోవడానికై, వసతులను ఉపసంహరించుకోవడంపై దృష్టి సారిస్తూనే, అందుబాటు వైఖరిని కొనసాగించాలని ఎంపీసీ నిర్ణయించింది.

అభివృద్ధి (గ్రోత్) మరియు ద్రవ్యోల్బణం అంచనా

అభివృద్ధి (గ్రోత్)

6. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (NSO) ఫిబ్రవరి 28, 2022న విడుదల చేసిన రెండవ ముందస్తు అంచనాల ప్రకారం, 2021-22లో వాస్తవ GDP 8.9 శాతం పెరిగింది. అయితే ప్రైవేట్ వినియోగం మరియు స్థిరమైన పెట్టుబడి - దేశీయ డిమాండ్‌కు కీలకమైన చోదకాలు - ఈ రెండు కంపోనెంట్లు వరుసగా కేవలం 1.2 శాతం మరియు 2.6 శాతం మాత్రమే వాటి ప్రీ-పాండమిక్ స్థాయిలకు కొంచం ఎగువలో ఉన్నాయి. సప్లై వైపు నుండి పరిశీలిస్తే, కాంటాక్ట్-ఇంటెన్సివ్ సేవలు ఇప్పటికీ 2019-20 స్థాయిల కంటే వెనుకబడి ఉన్నాయి. అయినప్పటికీ, భారత ఆర్థిక వ్యవస్థ దాని మహమ్మారి-ప్రేరిత సంకోచం నుండి కోలుకోవడం కొనసాగుతోంది.

7. 2021-22లో, Q3లో ఆర్థిక కార్యకలాపాల బలహీనత మళ్లీ ఉద్భవించింది మరియు జనవరి 2022లో ఓమిక్రాన్ వేరియంట్ ఆవిర్భావంతో మరింత తీవ్రమైంది. మార్చి 2022లో మిశ్రమ చిత్రాన్ని గమనించినప్పటికీ, ఫిబ్రవరిలో క్రమంగా మార్పు కనిపించింది. తగ్గుతున్న ఇన్ఫెక్షన్లు మరియు పరిమితుల ఎత్తివేత మధ్య కొన్ని కాంటాక్ట్-ఇంటెన్సివ్ కార్యకలాపాలు దారినబడ్డాయి. అనేక హై-ఫ్రీక్వెన్సీ ఇండికేటర్స్ - రైల్వే సరుకు; GST సేకరణ; టోల్ వసూలు; విద్యుత్ డిమాండ్; ఇంధన వినియోగం; మరియు క్యాపిటల్ గూడ్స్ దిగుమతులు ఫిబ్రవరి-మార్చిలో ఏటికేడాది ప్రాతిపదికన ధృడమైన విస్తరణను నమోదు చేశాయి. పరిమితుల సడలింపుతో, మార్చిలో దేశీయ విమాన ప్రయాణీకుల రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. మా సర్వేల ప్రకారం, వినియోగదారుల విశ్వాసం మెరుగుపడుతోంది మరియు రాబోయే సంవత్సరానికి కుటుంబగృహాల మధ్య ఆశావాద భావాలు బాగా బలపడ్డాయి. వ్యాపార విశ్వాసం ఆశావాదoతో నిండియుండి ఆర్థిక కార్యకలాపాలలో పునరుజ్జీవనానికి మద్దతు ఇస్తున్నది. మరోవైపు, ప్యాసింజర్ వాహనాల విక్రయాలు మరియు రిజిస్ట్రేషన్లు ఒక మోస్తరు వేగంతో తగ్గుతూనే ఉన్నాయి. తయారీ మరియు సేవల PMIలు రెండూ అప్‌ట్రెండ్‌లో ఉన్నాయి; అయితే తయారీ PMI మార్చిలో మోడరేట్ చేయబడింది, సేవలు మరియు ఈ రెంటి మిశ్రమ PMI మెరుగుదలను చూపుతోంది.

8. రాబోయే రోజుల్లో, ధృడమైన రబీ ఉత్పత్తి గ్రామీణ డిమాండ్‌లో మెరుగుదలకు తోడ్పడుతుంది, అలాగే కాంటాక్ట్-ఇంటెన్సివ్ సేవలలో పెరుగుదల పట్టణ డిమాండ్‌ను మరింత బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. వ్యాపార విశ్వాసంలో మెరుగుదల, బ్యాంక్ క్రెడిట్ పెరుగుదల, ప్రభుత్వ మూలధన వ్యయం నుండి నిరంతర మద్దతు మరియు అనుకూలమైన ఆర్థిక పరిస్థితులు పెట్టుబడి కార్యకలాపాలను పెంచుతాయి. ఉత్పాదక రంగంలో కెపాసిటీ యుటిలైజేషన్ (CU) 2021-22 మూడవ త్రైమాసికంలో 72.4 శాతానికి పెరిగింది, మునుపటి త్రైమాసికం 68.3 శాతం నుండి, ఇది 2019-20 నాల్గవ త్రైమాసికంలో 69.9 శాతం ప్రీ-పాండమిక్ స్థాయిని అధిగమించింది.

9. పరిస్తితులు మెరుగుపడుతున్నప్పటికి, పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మన ఆర్థిక అవకాశాలను దెబ్బతీశాయి. యుద్ధానికి కేంద్రంగా ఉన్న దేశాలతో భారత యొక్క ప్రత్యక్ష వాణిజ్య ఎక్ష్పొజరు పరిమితం అయినప్పటికీ, యుద్ధం తనదైన శ్రేణిలో పెరుగుతున్న కమోడిటీ ధరలు మరియు గ్లోబల్ స్పిల్‌ఓవర్ మార్గాల ద్వారా ఆర్థిక పునరుద్ధరణకు అంతరాయం కలిగించవచ్చు. ఇంకా, అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలలో ద్రవ్య విధాన సాధారణీకరణ ద్వారా ప్రేరేపించబడిన ఫైనాన్షియల్ మార్కెట్ ఒడుదుడుకులు, కొన్ని ప్రధాన దేశాలలో పునరుద్ధరించబడిన COVID-19 ఇన్‌ఫెక్షన్‌లతో పాటు పెరిగిన సప్లై సైడ్ అంతరాయాలు మరియు సెమీకండక్టర్లు మరియు చిప్‌ల వంటి క్లిష్టమైన ఇన్‌పుట్‌లకు భారీ డిమాండ్ కారణంగా ఏర్పడిన కొరత ఔట్లుక్ నకు ప్రతికూల ప్రమాదాన్ని కలిగిస్తున్నాయి. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే, 2022-23లో ముడి చమురు ధర (ఇండియన్ బాస్కెట్) బ్యారెల్‌కు US$ 100 గా అంచనా వేయబడి, 2022-23కి వాస్తవిక GDP వృద్ధి ఇప్పుడు 7.2 శాతంగా అంచనా వేయబడింది, ఇది మొదటి త్రైమాసికంలో 16.2 శాతం; రెండో త్రైమాసికంలో 6.2 శాతం; మూడో త్రైమాసికంలో 4.1 శాతం; మరియు నాల్గవ త్రైమాసికంలో 4.0 శాతంగా అంచనా వేయబడింది.

ద్రవ్యోల్బణం

10. ఫిబ్రవరి, 2022-23 సమావేశం లో MPC ద్రవ్యోల్బణానికి ఒక మోడరేట్ మార్గాన్ని అంచనా వేసింది. అయితే, ఫిబ్రవరి చివరి నుండి పెరిగిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, మునుపు గొప్పగా ఊహించిన కథనాన్ని మార్చేశాయి మరియు సంవత్సర ద్రవ్యోల్బణ ఔట్లుక్ ను చెప్పుకోదగ్గరీతిలో మసక పరిచాయి. ఇక ఫుడ్ ప్రైస్-ఫ్రంట్ విషయానికివస్తే, రికార్డు-లెవెల్ లో రబీ పంట సాధ్యం అయితే, తృణధాన్యాలు మరియు పప్పుధాన్యాల దేశీయ ధరలను అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. అయితే, నల్ల సముద్రం ప్రాంతం నుండి గోధుమ సరఫరాలో కొరత మరియు ఎన్నడూలేనివిధంగా అంతర్జాతీయoగా పెరిగిన గోధుమ ధరల వంటి అంతర్జాతీయ కారకాలు దేశీయ గోధుమ ధరలను ప్రభావితం చేశాయి. కీ-ప్రొడ్యూసర్ల ఎగుమతి ఆంక్షలు దీంతోపాటు నల్ల సముద్రం ప్రాంతం నుండి సప్లై కొరత కారణంగా, వంటనూనెల ధరలపై పూర్తి కాలం ఒత్తిళ్ళు పెరగవచ్చు. గ్లోబల్ గా ఫీడ్ సప్లై కొరత వల్ల, ఫీడ్ ధరల ఒత్తిళ్ళు కొనసాగవచ్చు, ఈ ఒత్తిళ్ళు పౌల్ట్రీ, పాలు మరియు పాల ఉత్పత్తుల ధరలను కూడా ప్రభావితం చేయవచ్చు.

11. ఆహారేతర వస్తువుల విషయానికి వస్తే, ఫిబ్రవరి చివరి నుండి అంతర్జాతీయ ముడి చమురు ధరలలో పెరుగుదల ప్రత్యక్ష మరియు పరోక్ష ప్రభావo రెండింటి ద్వారా ద్రవ్యోల్బణాన్ని చెప్పుకోదగ్గరీతిలో పైవైపుకు తీసుకువెళ్ళే ప్రమాదం పొంచిఉంది. దేశీయoగా పెట్రోల్ పంపుల ధరలలో తీవ్రమైన వృద్ధి రెండో తడవ ధరల ఒత్తిడిని విస్తృతంగా ప్రేరేపిస్తుంది. అంతర్జాతీయ కమాడిటి ధరలు విపరీతంగా పెరగడం ఇంకా లాజిస్టికల్ అంతరాయాల వృద్ధి రెండూ కలిసి వ్యవసాయం, తయారీ మరియు సేవల రంగాల ఇన్‌పుట్ ఖర్చులను పెంచవచ్చు. అందువల్ల, రిటైల్ ధరలకు వాటి ప్రభావం బదిలీని నివారించడానికి నిరంతరం స్థిరమైన పర్యవేక్షణ మరియు చురుగ్గా సరఫరా నిర్వహణ అవసరం. రిస్క్ ప్రీమియంలు పెరగడం, ట్రేడ్ మరియు క్యాపిటల్ ఫ్లో లలో అంతరాయం మరియు సెంట్రల్ బ్యాంకుల మధ్య భిన్నమైన ద్రవ్య విధాన ప్రతిస్పందనల కారణంగా ఫైనాన్షియల్ మార్కెట్లు అస్థిరంగా ఉండే అవకాశం ఉంది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని, 2022లో సాధారణ రుతుపవనాలు మరియు ముడి చమురు (ఇండియన్ బాస్కెట్) సగటు ధర బ్యారెల్‌కు US$100గా అంచనా వేయబడి, ద్రవ్యోల్బణం ఇప్పుడు 2022-23లో 5.7 శాతంగా అంచనా వేయబడింది, ఇది మొదటి త్రైమాసికంలో 6.3 శాతం, రెండవ త్రైమాసికంలో 5.8 శాతం; మూడో త్రైమాసికంలో 5.4 శాతం; మరియు నాల్గవ త్రైమాసికంలో 5.1 శాతంగా అంచనా వేయబడింది.

12. ఫిబ్రవరి చివరి నుండి గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ధరలలో తీవ్ర అస్థిరత మరియు ఉద్భవిస్తున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలపై తీవ్ర అనిశ్చితి కారణంగా, వృద్ధి మరియు ద్రవ్యోల్బణం అంచనా ఏదైనాగాని ప్రమాదo తో కూడియుంటుందని అంతేగాక భవిష్యత్తులో ఆయిల్ మరియు కమోడిటీ ధరల పరిణామాలపై ప్రధానంగా ఆధారపడి ఉంటుందని గమనించాలి.

13. ఈ సందర్భంలో, సరఫరా వైపు చర్యలను కొనసాగించడం మరియు తీవ్రతరం చేయడం వలన ఆహార ధరల ఒత్తిడిని తగ్గించవచ్చు మరియు తయారీ మరియు సేవలలో వ్యయ-ప్రేరిత ఒత్తిళ్లను కూడా తగ్గించవచ్చు. మన వైపునుండి, స్థూల ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగించడానికి మరియు మన ఆర్థిక వ్యవస్థ యొక్క స్థితిస్థాపకతను పెంపొందించడానికి రిజర్వు బ్యాంకు తన పాలసీ అస్త్రాలన్నింటినీ ఉపయోగిస్తుందని మా వాటాదారులందరికీ నేను హామీ ఇస్తున్నాను. పరిస్థితి శక్తిమంతంగా మరియు వేగంగా మారుతోంది తదనుగుణంగా మనం మన చర్యలను పురికొల్పాలి.

ద్రవ్యత మరియు ఫైనాన్షియల్ మార్కెట్ పరిస్థితులు

14. ముందుగా చెప్పినట్లుగా, స్థూల ఆర్థిక దృక్పథం వివర్తనిక (టెక్టోనిక్) మార్పులకు లోనవుతోంది మరియు మన విధాన ప్రతిస్పందన మారుతున్న ఔట్లుక్ కు తగ్గట్లు డైనమిక్‌గా తిరిగి క్రమాంకనం చేయబడాలి. వ్యవస్థలో తగినంత లిక్విడిటీని కొనసాగిస్తూనే లిక్విడిటీ నిర్వహణకు రిజర్వు బ్యాంకు స్వలభూయిష్టంగాను మరియు త్వరిత విధానాన్ని కొనసాగిస్తుంది. ప్రస్తుతం, లిక్విడిటీ మేనేజ్‌మెంట్ రెండు-విధాల్లో కార్యకలాపాలను నిర్వహించ బడుతున్నది: వివిధ మెచ్యూరిటీల వేరియబుల్ రేట్ రివర్స్ రెపో (VRRR) వేలం ద్వారా; లిక్విడిటీ ని చోషణ చేయడం మరియు వేరియబుల్ రేట్ రెపో (VRR) వేలం ద్వారా తాత్కాలిక ద్రవ్య కొరతను తీర్చడం మరియు లిక్విడిటీ అసమతుల్యతలను పోగొట్టడం. ఈ విధానం కొనసాగుతుంది.

15. VRRR వేలం ద్వారా లిక్విడిటీని రీబ్యాలెన్స్ చేయడం వల్ల 2021-22 క్యూ4లో LAF కింద శోషించబడిన మొత్తం లిక్విడిటీలో 80 శాతం వరకు, వడ్డీ రేటు పాలసీ రెపో రేటుకు దగ్గరగా మారిందని గమనించవచ్చు. దీని ప్రకారం, ఫైనాన్షియల్ మార్కెట్ భాగస్వాములు LAF కారిడార్ లో సంభవించబోయే సాధారణీకరణకు సిద్ధమయ్యారు.

16. ఇంకా, ఫిబ్రవరి 2020లో స్థాపించబడిన లిక్విడిటీ మేనేజ్‌మెంట్ ఫ్రేమ్‌వర్క్‌ ప్రభావాన్ని మెరుగుపరచడానికి కొన్ని సంస్కరణలతో పాటుగా పూర్తిగా పునరుద్ధరించాలని ప్రస్తుతం నిర్ణయించబడింది. దీని ప్రకారం, ఈ కింది చర్యలు ప్రారంభించబడ్డాయి:

(i) 2018లో ఆర్‌బిఐ చట్టంలోని సెక్షన్ 17కి చేసిన సవరణ రిజర్వు బ్యాంకు కు శాశ్వత డిపాజిట్ సదుపాయాన్ని (ఎస్‌డిఎఫ్) ప్రవేశపెట్టడానికి అధికారం ఇచ్చింది. సెంట్రల్ బ్యాంక్‌పై ఉన్న బైండింగ్ కొలేటరల్ పరిమితిని తొలగించడం ద్వారా, SDF అనేది ద్రవ్య విధాన ఫ్రేమ్‌వర్క్‌ కార్యాచరణను బలపరుస్తుంది. దీని ప్రకారం, ఇప్పుడు LAF కారిడార్ యొక్క ఫ్లోర్‌గా SDFని పరిచయం చేయాలని నిర్ణయించారు. ఇది LAF కారిడార్ దిగువన శాశ్వత శోషణ సదుపాయాన్ని ప్రవేశపెట్టడం ద్వారా ద్రవ్య విధానం యొక్క కార్యాచరణ ఫ్రేమ్‌వర్క్‌ను సమన్వయం చేస్తుంది, కారిడార్ ఎగువన ఉన్న ఆపరేటింగ్ టూల్ అదే మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (MSF).లాగానే. అందువల్ల, LAF కారిడార్ కు ఇరు వైపులా స్టాండింగ్ ఫెసిలిటీస్ ఉంటాయి - ఒకటి లిక్విడిటీని గ్రహించడానికి మరియు మరొకటి ఇంజెక్ట్ చేయడానికి. దీని ప్రకారం, SDF మరియు MSF లను యాక్సెస్ చేయడం బ్యాంకుల అభీష్టానుసారం ఉంటుంది. ఇది రిజర్వు బ్యాంకు అభీష్టానుసారం లభించే రెపో/రివర్స్ రెపో, OMO మరియు CRRలకు విరుద్ధంగా ఉంటుంది. ముఖ్యంగా, SDF అనేది, ద్రవ్య నిర్వహణలో దాని పాత్రతో పాటు, ఆర్థిక స్థిరత్వ సాధనం కూడా.

(ii) SDF రేటు పాలసీ రేటు కంటే 25 bps తక్కువగా ఉంటుంది మరియు ఓవర్-నైట్ డిపాజిట్లపై ఈ స్టేజిలో వర్తిస్తుంది. ఏది ఏమైనప్పటికీ, అవసరమైతే, సహేతుకమైన ధరతో దీర్ఘకాలిక లిక్విడిటీని గ్రహించే సౌలభ్యాన్ని ఇది కలిగి ఉంటుంది. MSF రేట్ పాలసీ రెపో రేటు కంటే 25 bps ఎక్కువగా కొనసాగుతుంది. అందువల్ల, LAF కారిడార్ యొక్క విడ్త్ (వ్యాప్తి) ప్రీ-పాండమిక్ కాన్ఫిగరేషన్‌ లో ఉన్న 50 bpsకి పునరుద్ధరించబడింది, ఇది పాలసీ రెపో రేటు ను చుట్టుకుని కారిడార్ మధ్యగా ఉంటుంది.

(iii) ఫిక్స్‌డ్ రేట్ రివర్స్ రెపో (ఎఫ్‌ఆర్‌ఆర్‌ఆర్) రేటు 3.35 శాతం వద్ద కొనసాగుతుంది. ఇది RBI యొక్క టూల్‌కిట్‌లో భాగంగా ఉంటుంది మరియు కాలానుగుణంగా పేర్కొనబడే ప్రయోజనాల కోసం RBI యొక్క అభీష్టానుసారం పని చేస్తుంది. SDFతో పాటు FRRR, ఆర్బిఐ లిక్విడిటీ మేనేజ్‌మెంట్ ఫ్రేమ్‌వర్క్‌కు తగు సౌలభ్యాన్ని అందిస్తుంది.

(iv) MSF మరియు SDF రెండూ ఏడాది పొడవునా వారంలోని అన్ని రోజులలో అందుబాటులో ఉంటాయి.

(v) ఏప్రిల్ 18, 2022 నుండి, RBI నియంత్రిత ఫైనాన్షియల్ మార్కెట్‌ల ప్రారంభ వేళలను మహమ్మారికి ముందు ఉన్న సమయం అంటే 9:00 AM గా తిరిగి ప్రవేశపెట్టాలని కూడా నిర్ణయించబడింది. అయితే, ప్రస్తుతం ఉన్నటువంటి వాటి ముగింపు సమయాలలో ఎటువంటి మార్పు లేదు.

17. మహమ్మారి సమయంలో, ఆర్‌బిఐ 17.2 లక్షల కోట్ల విలువైన లిక్విడిటీ సౌకర్యాలను అందించింది, వీటిలో 11.9 లక్షల కోట్లు ఉపయోగించబడ్డాయి. ఇప్పటి వరకు 5.0 లక్షల కోట్లు తిరిగి ఇవ్వబడ్డాయి లేదా డ్యూ-డేట్ లో ల్యాప్స్ అయిన వివిధ సౌకర్యాలు రీఫండ్ చేయబడ్డాయి. మహమ్మారి నేపథ్యంలో తీసుకున్న అసాధారణ లిక్విడిటీ చర్యల ఫలితంగా, లిక్విడిటీతో పాటుగా ఆర్‌బిఐ యొక్క అనేక ఇతర కార్యకలాపాల ద్వారా, సిస్టమ్‌లో 8.5 లక్షల కోట్ల లిక్విడిటీ మిగులు ఉంది. ఆర్‌బిఐ ఈ సంవత్సరం ప్రారంభంనుండి అంతరాయం కలిగించని పద్ధతిలో బహు-సంవత్సరాల కాల వ్యవధిలో క్రమంగా మరియు క్రమాంకనంతో ఈ లిక్విడిటీ ఉపసంహరణను చేపడుతుంది. ప్రస్తుతo ఉన్న మానిటరీ పాలసీ వైఖరికి అనుగుణంగా ఉన్న స్థాయికి సిస్టమ్‌లోని లిక్విడిటీ మిగులు మొత్తాన్ని పునరుద్ధరించడం లక్ష్యం. అలా చేయడం ద్వారా, ఆర్థిక వ్యవస్థ ఉత్పాదక అవసరాలను తీర్చడానికి తగినంత లిక్విడిటీ లభ్యతను నిర్ధారించడo లో మా నిబద్ధతను నేను పునరుద్ఘాటించాలనుకుంటున్నాను. గవర్నమెంట్ బారోయింగ్ ప్రోగ్రాం పై కూడా మేము దృష్టి పెడతాము మరియు ఈ దిశలో ఆర్బిఐ అవసరమైన విధంగా వివిధ సాధనాలను ఉపయోగిస్తుంది.

విదేశీ రంగం

18. అధ్వాన్నమైన గ్లోబల్ సప్లై షాక్‌ల కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో రికవరీ మందగించినప్పటికీ, భారతదేశ సరుకుల ఎగుమతులు 2021-22లో US$ 400 బిలియన్ల లక్ష్యాన్ని అధిగమించి బలమైన వృద్ధిని కనబరిచాయి., అంతర్జాతీయ కమోడిటీ ధరల పెరుగుదలతో పాటు, దేశీయ డిమాండ్‌లో రికవరీ వల్ల దిగుమతులు బలంగా పుంజుకోవడం తో వాణిజ్యం మరియు కరెంట్ ఖాతా లోటులు బాగా పెరిగాయి. సేవల ఎగుమతులు మరియు ఇన్‌వర్డ్ రెమిటెన్స్‌లలో స్థిరమైన మరియు ధృడమైన వృద్ధి వల్ల మన ఇన్విజిబుల్ ఖాతా బ్యాలెన్స్‌ పెద్ద మిగులులో ఉండడం సాధ్యపడింది, వాణిజ్య లోటును పాక్షికంగా భర్తీ చేయడంలో ఈ మిగులు సహాయపడుతుంది. క్రూడ్ ఆయిల్ మరియు ఇతర వస్తువుల ధరలు బాగా పెరిగినప్పటికీ, కరెంట్ ఖాతా లోటు భరించతగ్గ స్థిరమైన స్థాయిలో ఉంటుందని మేము ఆశిస్తున్నాము, నార్మల్ క్యాపిటల్ ఫ్లో లతో ఈ లోటును ఫైనాన్స్ చేయవచ్చు.

19. మొత్తంమీద, మన విదేశీ రంగ సూచికలు సానుకూలంగా ఉన్నాయి మరియు ఇటీవలి కాలంలో గణనీయంగా మెరుగుపడ్డాయి. ఏప్రిల్ 1, 2022 నాటికి మన విదేశీమారక(ఫారెక్స్) నిల్వలు US$ 606.5 బిలియన్లు గా ఉన్నాయి, ఇవి RBI నికర ఫార్వార్డ్ ఆస్తులతో కలిసి మరింత బలపడ్డాయి. దేశీయ ఫైనాన్షియల్ మార్కెట్లలో క్రమబద్ధమైన పరిస్థితులను కొనసాగించడానికి రిజర్వు బ్యాంకు కట్టుబడి ఉంది మరియు గ్లోబల్ పరిణామాల యొక్క ప్రతికూల ప్రభావాన్ని నివారించడానికి అవసరమైన విధంగా తగిన చర్యలు నిరంతరం తీసుకుంటుంది.

అదనపు చర్యలు

20. నేను ఇప్పుడు మానిటరీ పాలసీ స్టేట్‌మెంట్‌లోని డెవలప్‌మెంటల్ అండ్ రెగ్యులేటరీ పాలసీల స్టేట్‌మెంట్ (పార్ట్-బి)లో వివరించిన కొన్ని అదనపు చర్యలను ప్రకటించాలనుకుంటున్నాను. ఈ చర్యలు క్రింది విధంగా ఉన్నాయి:

పర్సనల్ హోమ్ లోన్ లు - రిస్క్ వెయిట్‌ల హేతుబద్ధీకరణ

21. మార్చి 31, 2022 వరకు మంజూరైన అన్ని కొత్త హౌసింగ్ లోన్‌లకు లోన్ టు వాల్యూ (LTV) నిష్పత్తిని మాత్రమే జోడించడం ద్వారా వ్యక్తిగత హౌసింగ్ లోన్‌ల రిస్క్ వెయిట్‌లు అక్టోబర్ 2020లో హేతుబద్ధీకరించబడ్డాయి. గృహనిర్మాణ రంగం యొక్క ప్రాముఖ్యతను మరియు దాని బహుళ ప్రభావాలను గుర్తించి, ఈ మార్గదర్శకాల వర్తింపును మార్చి 31, 2023 వరకు పొడిగించాలని నిర్ణయించారు. ఇది వ్యక్తిగత గృహ రుణాలకు అధికమొత్తంలో ఋణాలు అందించడం ను సులభతరం చేస్తుంది.

HTM కేటగిరీ లో SLR హోల్డింగ్స్

22. 2022-23 సంవత్సరంలో బ్యాంకులు తమ ఇన్వెస్ట్‌మెంట్ పోర్ట్‌ఫోలియోను మెరుగ్గా నిర్వహించేందుకు వీలుగా, మార్చి 31, 2023 నాటికి హెల్డ్ టు మెచ్యూరిటీ (HTM) కేటగిరీ కింద ఉన్న పరిమితిని NDTLలో 22 శాతం నుంచి 23 శాతానికి పెంచాలని నిర్ణయo తీసుకోబడింది. ఈ మెరుగుపరచబడిన పరిమితి క్రింద ఏప్రిల్ 01, 2022 మరియు మార్చి 31, 2023 మధ్య సేకరించిన అర్హత కలిగిన SLR సెక్యూరిటీలను కవర్ చేయడానికి బ్యాంకులను అనుమతించాలని కూడా నిర్ణయించబడింది. HTM పరిమితి జూన్ 30, 2023తో ముగిసిన త్రైమాసికం నుండి దశలవారీగా 23 శాతం నుండి 19.5 శాతానికి పునరుద్ధరించబడుతుంది.

వాతావరణ మార్పు (క్లైమేట్) రిస్క్ మరియు సస్టైనబుల్ ఫైనాన్స్ పై చర్చా పత్రం

23. వాతావరణ మార్పు, ఆర్థిక సంస్థల భద్రత మరియు పటిష్టత అలాగే ఆర్థిక స్థిరత్వానికి సంబంధించిన కొన్ని ప్రమాదాలను కలిగిస్తుంది. నియంత్రిత సంస్థల ద్వారా వాతావరణ-సంబంధిత ఆర్థిక నష్టాల సంభావ్య ప్రభావం గురించి మెరుగైన అవగాహన మరియు అంచనాలను అందించడానికి, క్లైమేట్ రిస్క్ మరియు సస్టైనబుల్ ఫైనాన్స్‌పై చర్చా పత్రం, ఫీడ్‌బ్యాక్ పొందడం కోసం త్వరలో ప్రచురించబడుతుంది.

ఆర్బీఐ చే నియంత్రించబడే సంస్థలలో కస్టమర్ సేవా ప్రమాణాలను సమీక్షించడానికి కమిటీ

24. వినియోగదారుల రక్షణను పెంపొందించడానికి రిజర్వు బ్యాంకు సంవత్సరాలుగా అనేక చర్యలు తీసుకుంది. ఈ చర్యలలో కస్టమర్ సర్వీస్, అంతర్గత ఫిర్యాదుల పరిష్కారం మరియు అంబుడ్స్‌మన్ మెకానిజంపై రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించడం వంటివి ఉన్నాయి. ఉత్పత్తులు మరియు సేవలలో ఆవిష్కరణలు, డిజిటల్ యాక్సెస్ పెరుగుదల మరియు వివిధ సర్వీస్ ప్రొవైడర్ల ఆవిర్భావం కారణంగా ఆర్థిక రంగంలో వచ్చిన మార్పుల దృష్ట్యా, ఆర్బీఐ చే నియంత్రించబడే సంస్థలలో కస్టమర్ సర్వీస్ యొక్క ప్రస్తుత స్థితిని పరిశీలించడానికి మరియు సమీక్షించడానికి, కస్టమర్ సర్వీస్ నిబంధనల సమర్ధత మరియు వాటిని మెరుగుపరచడానికి చర్యలు సూచించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించబడింది.

ATM లలో ఇంటర్‌ఆపరబుల్ కార్డ్‌లెస్ నగదు ఉపసంహరణ

25. ప్రస్తుతం ఏటీఎంల నుంచి కార్డు రహిత నగదు ఉపసంహరణ సౌకర్యం కొన్ని బ్యాంకులకే పరిమితమైంది. UPI ని ఉపయోగించి అన్ని బ్యాంకులు మరియు ATM నెట్‌వర్క్‌లలో కార్డ్‌లెస్ నగదు ఉపసంహరణ సౌకర్యాన్ని అందించాలని ఇప్పుడు ప్రతిపాదించబడింది. లావాదేవీల సౌలభ్యాన్ని పెంపొందించడమే కాకుండా, అటువంటి లావాదేవీల కోసం భౌతిక కార్డ్ అవసరాన్ని తొలగించడం వలన కార్డ్ స్కిమ్మింగ్, కార్డ్ క్లోనింగ్ మొదలైన మోసాలను నిరోధించడంలో ఇది సహాయపడుతుంది.

భారత్ బిల్ చెల్లింపు వ్యవస్థ - ఆపరేటింగ్ యూనిట్ల కోసం నెట్-వర్త్ ఆవశ్యకత హేతుబద్ధీకరణ

26. భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (BBPS), బిల్ చెల్లింపుల కోసం ఇంటర్‌ఆపరబుల్ ప్లాట్‌ఫారమ్, సంవత్సరాలుగా బిల్లు చెల్లింపులు మరియు బిల్లర్ల పరిమాణంలో పెరుగుదలను చూసింది. BBPS ద్వారా బిల్లు చెల్లింపు యాక్సెస్‌ను మరింత సులభతరం చేయడానికి మరియు BBPSలో ఎక్కువ సంఖ్యలో నాన్-బ్యాంక్ భారత్ బిల్ పేమెంట్ ఆపరేటింగ్ యూనిట్ల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి, అటువంటి సంస్థల నికర విలువ (నెట్-వర్త్) రిక్వైర్మెంట్ 100 కోట్ల నుండి 25 కోట్లకు తగ్గించాలని ప్రతిపాదించబడింది.

సైబర్ స్థితిస్థాపకత మరియు పేమెంట్ సెక్యూరిటీ కంట్రోల్స్ ఆఫ్ పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్స్ (PSOs)

27. ఆర్థిక సమీకరణను సులభతరం చేయడం మరియు ఆర్థిక స్థిరత్వాన్ని ప్రోత్సహించడంలో చెల్లింపు వ్యవస్థలు ఉత్ప్రేరక పాత్ర పోషిస్తాయి. మన చెల్లింపు వ్యవస్థలను, కన్వెన్షనల్ మరియు ఎమర్జింగ్ రిస్కులు ప్రత్యేకించి సైబర్ భద్రతకు సంబంధించిన వాటికి స్థితిస్థాపకంగా ఉండేలా చూసుకోవడానికి, పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్‌ల కోసం సైబర్ స్థితిస్థాపకత మరియు పేమెంట్ సెక్యూరిటీ కంట్రోల్స్‌పై మార్గదర్శకాలను జారీ చేయాలని ప్రతిపాదించబడింది.

ముగింపు వాక్యాలు

28. గత రెండేళ్లుగా చాలా అశాంతి, అనిశ్చితి నెలకొంది. మన ఆర్థిక వ్యవస్థపై వాటి ప్రభావాన్ని తగ్గించడానికి రిజర్వు బ్యాంకు నందు, మనం అవిశ్రాంతంగా పనిచేశాము. నేను వెనక్కి తిరిగి చూసుకుంటే, మనం నిష్కపటంగా, ధైర్యంతో, ఉజ్వల భవిష్యత్తు ఉందన్న నమ్మకంతో కష్టమైన మార్గాన్ని దాటినట్లు నేను చూశాను.

29. ఐరోపాలో ఇప్పుడున్న సంఘర్షణ సరికొత్త మరియు ప్రధాన సవాలుగా ఉంది, ఇది ఇప్పటికే అనిశ్చితoగా ఉన్న గ్లోబల్ ఔట్లుక్ ను క్లిష్టతరం చేస్తున్నది. భౌగోళిక రాజకీయ పరిస్థితుల ఇబ్బందులు మనకు సవాలు విసురుతున్నందున, RBI తన నియంత్రణలో ఉన్న అన్ని సాధనాలతో భారత ఆర్థిక వ్యవస్థను రక్షించడానికి సిద్ధంగా ఉంది. గత రెండు సంవత్సరాలుగా మనం ప్రదర్శించినట్లుగా, ఆర్థిక వ్యవస్థను రక్షించే విషయం తక్షణ కర్తవ్యo కాబట్టి మనం ఎటువంటి రూల్-బుక్ నకు బందీలుగా లేము మరియు అవుట్-అఫ్ ది టేబుల్ ఎటువంటి చర్య తీసుకోలేదు. మన లక్ష్యాలు ముఖ్యంగా ధరల స్థిరత్వం, స్థిరమైన వృద్ధి మరియు ఆర్థిక స్థిరత్వం, ఇవి ఒకదాని నొకటి పరస్పరం బలోపేతం చేసుకుంటాయి మరియు మనం ఈ విధానం ద్వారా మార్గనిర్దేశం చేయడాన్ని కొనసాగిస్తాము.

30. ప్రస్తుతం, ఆకాశం అనిశ్చితితో మేఘావృతమై ఉండవచ్చు, కానీ మన శక్తి, సంకల్పం మరియు వనరులను సూర్యప్రకాశంతో భారతదేశ భవిష్యత్తును మరింత ప్రకాశవంతం చేయడానికి ఉపయోగిస్తాము. జాతిపిత మహాత్మాగాంధీ చాలా కాలం క్రితం చెప్పిన మాటలను గుర్తుచేసుకుంటూ ముగిస్తాను: "విశ్వాసమే తుఫాను సముద్రాల గుండా మనల్ని నడిపిస్తుంది, పర్వతాలను కదిలించేది విశ్వాసమే మరియు విశ్వాసమే సముద్రాన్ని లంఘించగలిగేది."1

ధన్యవాదాలు. క్షేమంగా ఉండండి మరియు స్వస్థతతో ఉండండి. నమస్తే.

(యోగేష్ దయాళ్) 
చీఫ్ జనరల్ మేనేజర్

పత్రికా ప్రకటన: 2022-2023/37.


1 యంగ్ ఇండియా, 24-9-1925, p. 331

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?