RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78527864

గవర్నర్ నివేదిక, డిసెంబర్ 4, 2020

తేదీ: 04/12/2020

గవర్నర్ నివేదిక, డిసెంబర్ 4, 2020

ద్రవ్య విధాన కమిటీ (మానిటరీ పాలిసీ కమిటీ, ఎమ్ పి సి), డిసెంబర్ 2, 3, మరియు 4, 2020 తారీకులలో సమావేశమయింది. దేశంలో మరియు ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం నెలకొని ఉన్న, స్థూల ఆర్థిక మరియు ఆర్థిక పరిణామాలను, కమిటీ సమీక్షించింది. వీటిపై కూలంకష చర్చ అనంతరం, 4 శాతం ఉన్న పాలిసీ రెపో రేట్, మార్పులేకుండా, యథాతథంగా ఉంచాలని నిర్ణయించింది. ఇంతేగాక, ఇకపై ద్రవ్యోల్బణం లక్ష్యాని మించకుండా జాగ్రత్త వహిస్తూ, ఆర్థిక వ్యవస్థపై కోవిడ్-19 ప్రభావాన్ని ఉపశమింపచేస్తూ, దీర్ఘకాల అభివృద్ధిని పునరుద్ధరించుటకొరకు, అవసరమయినంత కాలం - కనీసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో, అవసరమయితే వచ్చే ఆర్థిక సంవత్సరంవరకు - సానుకూల ధోరణితో వ్యవహరించాలని, ఎమ్ పి సి నిర్ణయించింది. ‘మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్’ మరియు ‘బ్యాంక్ రేట్’, మార్పులేకుండా, 4.25 శాతం ఉంటాయి. ‘రివర్స్ రెపో రేట్’ కూడా, మార్పు లేకుండా 3.35 శాతంగా కొనసాగుతుంది.

2. ఈ అవకాశాన్ని పురస్కరించుకొని, ఈరోజు తీసుకొన్న తీర్మానానికి దోహదంచేసిన వారి విజ్ఞతతోకూడిన అమూల్యమైన మార్గదర్శకాలకు, కమిటీ సభ్యులందరికీ, నా ప్రశంసలు తెలియచేస్తున్నాను. వారి విశ్లేషణ, మేధస్సులతో, సమావేశం విజయవంతమగుటకు సహాయంచేసిన రిజర్వ్ బ్యాంకు అధికార బృందాలకు నా అభినందనలు.

3. ఈనాటి తీర్మానానికి, హేతువైన కారణాలు వివరిస్తాను. త్వరగా చెడిపోయే వస్తువుల (పెరిషబుల్ గుడ్స్) ధరలు శీతాకాలంలో కొంత తగ్గి, పుష్కలమైన ఖరీఫ్ పంట చేతికందేవరకు, ద్రవ్యోల్బణం హెచ్చుగానే ఉంటుందని కమిటీ భావించింది. ఈ నిర్బంధం కారణంగా, ద్రవ్య విధానం ప్రస్తుతానికి వృద్ధిని పెంచేదిశగా చర్యలు చేపట్టలేదు. ఆర్థిక వ్యవస్థ తేరుకోవడానికి సహాయపడే, బలమైన చిహ్నాలు తగినన్ని లేవు. అందువల్ల, ద్రవ్య విధానం బాసట అవసరం. అయితే, సరఫరా అడ్డంకులు, అధిక లాభాల వసూలు మరియు పరోక్ష పన్నుల కారణంగా కలిగిన ద్రవ్యోల్బణాన్ని, సక్రియాత్మక చర్యలద్వారా సరఫరా పెంచి, కట్టడి చేయడానికి కొంత వెసులుబాటు ఉంది. సరఫరా ఇక్కట్లమూలంగా కలుగుతున్న ద్రవ్యోల్బణాన్ని శాంతింపచేయడానికి, మరి కొన్ని చర్యలు అవసరం. ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం సాధించుటకొరకు, ఎమ్ పి సి, ధరల నియంత్రణకు ఆటంకమవుతున్న ప్రమాదాలని, నిశితంగా పరిశీలిస్తూ ఉంటుంది. తదనుసారంగా, పాలిసీ రేట్లను యథాతథంగా ఉంచి, ద్రవ్యోల్బణం, లక్ష్యాన్ని మించకుండా జాగ్రత్త వహిస్తూ, ఆర్థిక వ్యవస్థపై కోవిడ్-19 ప్రభావాన్ని ఉపశమింపచేస్తూ, దీర్ఘకాల అభివృద్ధిని పునరుద్ధరించుటకొరకు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరియు రాబోయే ఆర్థిక సంవత్సరంలో, అవసరమయినంత కాలం, సానుకూల ధోరణి కొనసాగించాలని, ఎమ్ పి సి నిర్ణయించింది.

4. 2020 సంవత్సరం అత్యంత కఠినతరమైనది. మన శక్తి సామర్థ్యాలను, ఓర్పును, పట్టుదలను పరీక్షించింది. సంవత్సరం ముగుస్తున్న ఈ సమయంలో, ఒకప్రక్క మహమ్మరితో యుద్ధం చేస్తూ, మనం తీసికొన్న చర్యలను వాటి ఫలితాలను నెమరువేసుకోవడం సముచితం. ప్రతి ఒక్క సవాలును ఎదుర్కో వడానికి మనం చేసిన ప్రయాసను, ప్రత్యేకించి చెప్పాలి. ఇక్కడ, మహాత్మా గాంధీ మాటలు గుర్తు వస్తున్నాయి – “శక్తి అనేది ..... అజేయమైన సంకల్పంనుండి వస్తుంది”. దీనిని పాఠంగా భావించి, భావి ప్రణాళిక వివరించడానికి ప్రయత్నిస్తాను.

2020: మరిచిపోలేని సంవత్సరం.

5. ఆధునిక ప్రపంచ చరిత్రలో, 2020 సంవత్సరం చెడు జ్ఞాపకంగా నిలిచి ఉంటుంది. ‘స్పానిష్ ఫ్లూ’ని తలపించే, కోవిడ్ మహమ్మారి; 1930 లో ఆర్థిక మాంద్యాన్ని మించిన ఆర్థిక పతనం, ప్రపంచాన్ని అతలాకుతలం చేశాయి. ప్రపంచవ్యాప్తంగా అన్నిదేశాలలో ఆర్థిక కార్యకలాపాలు ఒకేసారి క్షీణిస్తున్న సమయంలో, కోవిడ్-19 వ్యాపించడం, మరింత క్షోభను కలిగించింది. ప్రజలకు, ఆర్థిక వ్యవస్థలకు కలిగిన ఈ విషాదం గురించి చరిత్ర పేర్కొన్నపుడు, కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాలు, ఆరోగ్యవ్యవస్థలు, వాటి సిబ్బంది, మానవీయ సంస్థలు, అన్నిటికీ మించి సామాన్య ప్రజలు, కనీవినీ ఎరుగని రీతిలో ఈ సంక్షోభాన్ని ఎదుర్కొన్న తీరు, ప్రముఖంగా చెప్పబడుతుంది.

6. సమిష్టిగా మనం, మరణాల సంఖ్య పెరగకుండా నిరోధించగలిగాము. ఆర్థిక విధానాలు, మార్కెట్లు యథావిధిగా పనిచేసేలా, ద్రవ్య సరఫరా నిరంతరం లభించేలా చూశాము. దుర్బలవర్గాలకు సహాయం చేశాము. తద్వారా, ఆర్థిక వ్యవస్థను అస్థిరంచేసే, స్వల్పకాల ఇబ్బందులను కట్టడి చేశాము. సంకోచించిన వ్యవస్థ తిరిగి వికసిస్తోంది. మార్కెట్లలో పెట్టుబడులు పెరుగుతున్నాయి, మంచి క్రెడిట్ రేటింగ్ ఉన్నవారికి, ‘హార్డ్ కరెన్సీ బాండ్ల’ జారీ పెరిగింది.

7. గడిచిన గడ్డుకాలంలో, వైరస్ వల్ల కలిగిన సవాళ్లను, దానివల్ల కలిగిన ఆర్థిక దుష్పరిణామాలను రిజర్వ్ బ్యాంక్, దీటుగా ఎదుర్కొంది. ఉత్పత్తి, ఉద్యోగావకాశాలలో కలిగిన నష్టాలను శీఘ్రంగా భర్తీచేసుకొని, స్థూల ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వం సాధించడానికి, రాబోయే రోజుల్లో రిజర్వ్ బ్యాంక్ కృషి చేస్తుంది.

8. ఆర్థిక స్థిరత్వం మరియు డిపాజిటర్ల సంక్షేమానికి ప్రాధాన్యమిచ్చి, రెండు షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులలో పరిస్థితులను వెంటనే పరిష్కరించాము. ఆర్థిక రంగ స్థిరత్వం కొరకు అవసరమయిన అన్ని చర్యలూ తీసుకోవడానికి మేము బద్ధులమై ఉన్నాము. నియంత్రణలను బలోపేతంచేసి, పర్యవేక్షణ మరింత క్షుణ్ణంగా చేయడం మా లక్ష్యం. అయితే, బ్యాంకులు, ఎన్ బి ఎఫ్ సి లవంటి ఆర్థిక రంగ సంస్థలు, వారి పరిపాలనలోని నాణ్యతా, నష్ట భయ నిర్వహణ మరియు అంతర్గత నియంత్రణలకు, అత్యంత ప్రాధాన్యమివ్వాలి. ఆర్థికరంగ స్థిరత్వాన్ని రక్షించుటలో వారే ప్రథమ సైనికులు.

9. ప్రభుత్వానికి ఋణ నిర్వాహకులుగా, బ్యాంకరుగా రిజర్వ్ బ్యాంక్ పాత్ర, 2020 లో అగ్నిపరీక్షకు లోనయింది. ఈ సంవత్సరంలో, ప్రభుత్వం తరఫున ఇంతవరకు లేనంత అధికంగా ఋణ తీసుకోవడం జరిగింది. మావిధానాల ఫలితంగా, ఋణ మూల్యం (కాస్ట్ అఫ్ బారోయింగ్) 16 సంవత్సరాలలో కనిష్ఠ స్థాయికి చేరింది. ఇంతేగాక, ప్రభుత్వ రుణాల ‘వైటెడ్ ఏవరేజ్ మాచురిటీ’ అత్యధిక స్థాయికి చేరింది. క్రితం సంవత్సరంతో పోలిస్తే, డిసెంబర్ 1 వ తేదీన, కేంద్ర ప్రభుత్వ రుణాల వైటెడ్ మూల్యం (వైటెడ్ బారోయింగ్ కాస్ట్) 5.82 శాతం మరియు రాష్ట్ర ప్రభుత్వాల అదనపు రుణాల మూల్యం 6.88 శాతం. ఇంతవరకు కేంద్ర / రాష్ట్ర ప్రభుత్వాల ఋణ సమీకరణ కార్యక్రమం సజావుగా సాగింది. ఇక్కడ, నేను అక్టోబర్ లో చెప్పిన విషయాన్ని, తిరిగి ప్రస్తావిస్తున్నాను – మార్కెట్ చలనాలు సక్రమంగా ఉండాలంటే, సమిష్టి పరిష్కారాలు అవసరం. కావలసింది పోటీ తత్వం, పోరాట తత్వం కాదు.

ఆర్థిక విపణులపై దృక్పథం

10. గత సంవత్సరం రిజర్వ్ బ్యాంక్ తీసకొన్న చర్యలు, వడ్డీరేట్లలో సమన్వయాన్ని తెచ్చాయి. ‘రిస్క్ స్ప్రెడ్’ తగ్గి, అత్యధిక సంఖ్యలో కార్పొరేట్ బాండ్లు జారీచేయడం జరిగింది. 3 సంవత్సరాల ‘AAA’ శ్రేణిలో రేట్ చేయబడ్డ, కార్పొరేట్ బాండ్లమీద రాబడి, అక్టోబరు, 8 తేదీన 60 బేసిస్ పాయింట్లు ఉండగా, నవంబర్ 27 తేదీన అదే మాచురిటీ గల ప్రభుత్వ సెక్యూరిటీలకన్న 17 బేసిస్ పాయింట్లు పడిపోయింది. అదే కాలంలో, తక్కువ శ్రేణిలో రేట్ చేయబడ్డ కార్పొరేట్ బాండ్లపై “స్ప్రెడ్” కూడా బాగా తగ్గింది: 3 సంవత్సరాల AA శ్రేణి, BBB (-) శ్రేణి కార్పొరేట్ బాండ్లపై, 34 బి పి ఎస్ తగ్గింది. AAA శ్రేణి, 5 సంవత్సరాల కార్పొరేట్ బాండ్లపై అక్టోబర్ 8, 2020 తేదీన 5.93 శాతంగా ఉన్న రాబడి, నవంబర్ 27, 2020 తేదీకి, 5.59 శాతానికి తగ్గింది. నిజానికి, వివిధ నిర్ణీతకాలాల కార్పొరేట్ బాండ్లపై ‘స్ప్రెడ్’, కోవిడ్ 19 మహమ్మారికి పూర్వపు స్థాయికి చేరింది. ఆర్థిక విపణులు సక్రమంగా పనిచేస్తున్నాయి. 2020-21 సంవత్సర రెండవ అర్ధభాగంలో పరిస్థితులు మెరుగు అవుతున్నాయని సూచిస్తున్న చిహ్నాలు, ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి, మార్గం సుగమం చేస్తున్నాయి.

11. ఈ పరిణామాలు, రిజర్వ్ బ్యాంక్ ద్రవ్యత నిర్వహణద్వారా (లిక్విడిటి మానేజ్మెంట్), ఋణ మూల్యాన్ని మరియు ఆదాయాన్ని తగ్గించడమేగాక, అక్టోబర్లో వారు ఇచ్చిన హామీలను, ఇతర చర్యలద్వారా నిలబెట్టుకొందని, మార్కెట్లో సకారాత్మక భావాన్ని, నమ్మకాన్ని పెంపొందించింది. బాండ్ల మార్కెట్లో సక్రమమైన పరిస్థితులు నెలకొని, ధరలు నిర్ధారించే ఇతర సాధనాల ధరలు, ప్రభుత్వ సెక్యూరిటీల ‘యీల్డ్ కర్వుకు’ దూరంగా ఉండడంలో తోడ్పడ్డాయి. ఋణ నిర్వహణ కార్యకలాపాలు, ద్రవ్య విధాన చర్యలు, మరియు మార్కెట్ అంచనాలు సమన్వయంతో, ఏక దృక్పథం కలిగి ఉన్నాయి. ఆర్థిక స్థిరత్వానికి ఇది మేలు చేస్తుంది. ఈ సందర్భంగా, ఈ సత్ఫలితాలను పొందడానికి బాధ్యతతో వ్యవహరించిన మార్కెట్ భాగస్వాములందరికీ, నా ప్రశంసలు తెలియచేస్తున్నాను. రిజర్వ్ బ్యాంక్ తనవంతుగా, ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) కల్పించుటకు, సరళమైన ఆర్థిక విధానాలను అమలుచేయుటకు, అవసరమైన అన్ని చర్యలూ తీసుకొంటుంది.

12. యు ఎస్ లో బాండ్లపై రాబడి పెరగడం, ‘రిఫ్లేషన్ ట్రేడ్’ వల్ల జరిగింది. అ దేశంలో, రాజకీయ సుస్థిరత కలుగుతుందన్న ఆశ, ఆర్థిక ప్రోత్సాహకాలు, నష్ట భయాలను తగ్గించి, యు ఎస్ ట్రెజరీ భద్రతను వీడి, మదుపరులు, రాబడులవెంట పడేలా చేశాయి. దేశీయ ఆర్థిక పరిస్థితులకు అనువైన రీతిలో, విదేశీ మారక ధరలలోని చంచలత్వాన్ని నియంత్రించి, విదేశీ ముద్రా విపణి సక్రమంగా వృద్ధిచెందుటకు రిజర్వ్ బ్యాంక్ చర్యలు చేపడుతోంది. ఈ చర్యలలో భాగంగా విదేశీ ముద్రా ద్రవ్యత పెంచుటకు చేసిన వ్యయం, దేశంలో ద్రవ్యత, మరియు ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపిస్తుందని దృష్టిలో ఉంచుకొని, ఈవ్యయాన్ని, రివర్స్ రెపోలో గ్రహించడం ద్వారా నిర్వీర్యం చేయబడుతోంది.

13. ప్రపంచ పరిస్థితులు మనపై ప్రభావం చూపకుండా, ఆర్థిక స్థిరత్వానికి లిక్విడిటీ మానేజ్మెంట్ ద్వారా రక్షణ కల్పించడానికి అవసరమైన విధంగా చర్యలు కొనసాగిస్తాము. సరైన మార్పులు చేస్తూ, మనవద్దగల ఆర్థిక సాధనాలను, లిక్విడిటీ పెంచుటకు తగిన సమయంలో వినియోగిస్తాము. బహిరంగ విపణి కార్యకలాపాలు (ఓ ఎమ్ ఓ); ప్రభుత్వ సెక్యూరిటీల ఏకకాల క్రయ విక్రయాలు (ఆపరేషన్ ట్విస్ట్స్) మరియు రివర్స్ రెపోల వినియోగం కొనసాగిస్తాము. ఆర్థిక స్థిరత్వం ఎల్లప్పుడూ దృష్టిలో ఉంచుకుంటూ, అభివృద్ధి సాధన, మా సర్వోన్నత లక్ష్యం.

ద్రవ్యోల్బణం, అభివృద్ధి అంచనా: దృక్పథం

14. ఇప్పుడు మీకు ఎమ్ పి సి ఉద్దేశ ప్రకారం, ద్రవ్యోల్బణానికి కారణ హేతువులు, మరియు దృక్పథం తె లియచేస్తాను. సెప్టెంబర్ లో 7.3 శాతానికి పెరిగిన వినియోగదారుల ధరల సూచిలో (సి పి ఐ) ద్రవ్యోల్బణం, అక్టోబర్ 2020 లో 7.6 శాతానికి చేరింది. ధరలపై ఒత్తిడి పెరుగుతోందనడానికి ఇది సూచన. ద్రవ్యోల్బణం గత రెండునెలలలో ఊహించినదానికన్నా ప్రతికూలంగా మారింది. పుష్కలమైన ఖరీఫ్ పంట తరువాత తృణధాన్యాల ధరలు; శీతాకాలం మొదలయిన తరువాత కూరగాయిల ధరలూ కొంత తగ్గినాగాని, మిగిలిన ఆహార ధరలు హెచ్చుగానే ఉంటాయి. ధరలపై ఒత్తిడి పెరగడంతో, కోర్ ద్రవ్యోల్బణం ప్రభావితమవుతుంది. ఇది పెద్ద సమస్యగా మారవచ్చు. పై అంశాల దృష్ట్యా, సి పి ఐ ద్రవ్యోల్బణం, ప్రతికూలతలను సమతుల్యం చేస్తూ, 2020-21 మూడవ త్రైమాసికంలో 6.8 శాతం; 2020-21 నాలుగవ త్రైమాసికంలో 5.8 శాతం; 2021-22 మొదటి అర్ధ సంవత్సరంలో 5.2-4.6 మేరకు ఉండవచ్చని అంచనా.

స్వస్థత మరియు ఆతరువాత

15. ఈ నేపథ్యంలో, ఇంతవరకు ప్రోగయిన గిరాకీ తీరేవరకు మాత్రమేగాక, నాణ్యమైన వృద్ధు కొనసాగించడంపై మనం, దృష్టి కేంద్రీకరించాలి. 2020-21 త్రైమాసికానికి అందిన గణాంకాలు, ఆర్థిక వ్యవస్థ అనుకొన్నదానికన్న వేగంగా కొలుకొంటోందని, ప్రతి రంగం ఒక్కో వేగంతో దీనిలో చేరుతున్నాయని స్పష్టమవుతోంది. అక్టోబర్ నివేదికలో నేను ఈవిషయం ప్రముఖంగా ప్రస్తావించాను. రెండవ త్రైమాసికంలో, ఎన్ ఎస్ ఓ సంస్థ నవంబర్ ఆఖరివరకు చేసిన ప్రాథమిక అంచనాలకన్న, అక్టోబర్లో సంకోచం తక్కువగా ఉంది.

16. తయారీ మరియు సేవారంగాల కొనుగోలు మానేజర్ల సూచీ (పర్చేజ్ మానేజర్స్ ఇండెక్స్, పి ఎమ్ ఐ) నవంబర్ 2020 లో వరుసగా 56.3 మరియు 53.7, అభివృద్ధి స్థితిని సూచిస్తున్నాయి. సేవల, హై ఫ్రీక్వెన్సీ సూచీలు, స్థిరత్వాన్ని మరియు పెరుగుదలను తెఊపుతున్నాయి. గ్రామీణ గిరాకీ మరింత పెరగవచ్చు. అన్ లాకింగ్ కారణంగా కార్యకలాపాలు, ఉద్యోగావకాశాలు (ప్రత్యేకించి కోవిడ్-19 కారణంగా నిర్వాసితులైన కార్మికులు) పెరిగిన కారణంగా, నగరాల్లో గిరాకీ వేగంగా పుంజుకుంటోంది. అయితే, కొన్ని ప్రాంతాల్లో, కోవిడ్-19 పెరుగుతున్నందువల్ల, నిర్బంధం అమలుచేసిన కారణంగా, ఈ ఆశాజనకమైన వాతావరణంలో మబ్బులు కమ్ముతున్నాయి. అయితే, కోవిడ్ నుండి స్వస్థత పొందినవారి సంఖ్య 94 శాతం దాటింది. వాక్సిన్ ప్రయోగాలు ఫలవంతమౌతాయని గట్టి నమ్మకం ఉంది. రాబోయే సంవత్సరం బాగుంటుందని వినియోగదారులు ఆశిస్తున్నారు.

17. 2020-21 రెండవ త్రైమాసిక కార్పొరేట్ ఫలితాలు, ఊపందుకొంటున్న గిరాకీ మరియు ఖర్చులలో చేస్తున్న పొదుపు మూలంగా లాభాలు పెరుగుతున్నాయని, సూచిస్తున్నాయి. దీనివల్ల రుణాలు తీర్చే సామర్థ్యం పెరిగింది. గత రెండు త్రైమాసికాలలో, సంకోచంలో ఉన్న తయారీ సంస్థలపై అంచనాలు 2020-21 మూడవ త్రైమాసికంలో, వ్యాకోచదశలో అడుగుపెట్టాయి. ఇక్కడినుండి, 2020-21 నాలుగవ త్రైమాసికంవరకు, వ్యాపార అంచనాలు, పెరుగుతున్నాయి.

18. అభివృద్ధి విషయానికి వస్తే, నేను ఇంతకు ముందే చెప్పినట్లు, గ్రామీణ గిరాకీ మరింత బలపడుతుంది. నగరాల్లో కూడా గిరాకీ మెరుగవుతోంది. రాబోయే రోజుల గురించి వినియోగదారులు, అశావాదంతో ఉన్నారు. తయారీ సంస్థల మనోభిప్రాయాలు, క్రమేపీ అనుకూలంగా మారుతున్నాయి. ఆర్థిక ప్రేరణలు, వినియోగానికి మరియు ద్రవ్యతకు ఊతమివ్వడానికి మాత్రమేగాక, ఉత్పత్తిని సృష్టించే పెట్టుబడులను ప్రోత్సహించుటకు వినియోగించబడుతున్నాయి. మరోవైపు, ప్రైవేట్ పెట్టుబడులు ఇంకా మందకొడిగానే ఉన్నాయి. వినియోగ సామర్థ్యం (కెపాసిటీ యుటిలైజేషన్) పూర్తిగా కోలుకోలేదు. ఎగుమతులు సరిగా పుంజుకోకపోయినా, వేక్సిన్ ప్రయోగాలలో సాధించిన ప్రగతివల్ల పరిస్థితి మెరుగయింది. ఈ అంశాలు పరిగణించి, వాస్తవ జి డి పి లో అభివృద్ధి, (ప్రతికూలతలను సమతుల్యం చేస్తూ), 2020-21 లో (-) 7.5 శాతం; 2020-21 మూడవ త్రైమాసికంలో, (+) 0.1 శాతం; 2020-21 నాలుగవ త్రైమాసికంలో (+) 0.7 శాతం; 2021-22 మొదటి అర్ధభాగంలో 21.9 శాతం నుండి 6.5 ఉండవచ్చని అంచనా.

అదనపు చర్యలు

19. ఈ పరిస్థితులలో, రిజర్వ్ బ్యాంక్ ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవితం చేయుటే సర్వోన్నత లక్ష్యంగా కొన్ని అదనపు చర్యల ద్వారా, పట్టుదలతో కృషిచేస్తుంది: (i) ఇతర రంగాలతో సంబంధంగల, నిర్దిష్ట రంగాలకు ద్రవ్యత కల్పించుట; (ii) ఆర్థిక విపణులు వృద్ధి చేయుట; (iii) బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల మూలధనం పరిరక్షణ; (iv) ఆడిట్ ప్రక్రియ బలోపేతంచేయుటద్వారా, పర్యవేక్షణ విధులు పటిష్టం చేయుట; (v) ఎగుమతిదారులకు సదుపాయాలు పెంచి వ్యాపారం సరళతరం చేయుట మరియు (vi) ఆర్థిక సంఘటితం, వినియోగదారుల సేవల వృద్ధికవరకు,చెల్లింపు సేవలు మెరుగుపరచుట.

(i) కార్యకలాపాలు తిరిగి ప్రారంభించుటకు ద్రవ్యత చర్యలు (లిక్విడిటీ మెషర్స్)

ఆన్ ట్యాప్, టి ఎల్ టి ఆర్ ఒ - వివిధ రంగాల విస్తరణ మరియు ఈ సి ఎల్ జి ఎస్ తో సమన్వయం (ఎక్స్ టెన్షన్ అఫ్ సెక్టర్స్ అండ్ సినర్జీ విత్ ఈ సి ఎల్ జి ఎస్)

అక్టోబర్ 09, 2020 తేదీన ప్రకటించిన అనునిత్యం (ఆన్ టాప్) లభించే నిర్దిష్ట దీర్ఘకాలిక రెపో కార్యకలాపాలు, ప్రభుత్వ ‘ఈ సి ఎల్ జి ఎస్ 2.0’ పథకం సమన్వయంతో, ఒత్తిడికి లోనవుతున్న ఇతర రంగాలకుకూడా విస్తరించబడతాయి. ఈ చర్య, ఒత్తిడిలో ఉన్న రంగాలకుకూడా బ్యాంకులు ఋణ సదుపాయాలు కల్పించుటకు ప్రోత్సాహిస్తుంది.

(ii) ఆర్థిక విపణుల అభివృద్ధి

20. ప్రస్తుతం, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, రిజర్వ్ బ్యాంక్ లిక్విడిటీ సదుపాయలుగాని, కాల్ / నోటీస్ మనీ మార్కెట్లు వినియోగించుకొనుటకుగాని అనుమతించబడలేదు. మనీ మార్కెట్లలో వారు పాలుపంచుకొనుటకు మరియు మెరుగైన ద్రవ్యత నిర్వహణకొరకు (లిక్విడిటీ మానేజ్మెంట్), ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఇకముందు, రిజర్వ్ బ్యాంక్, కల్పించిన ద్రవ్యత సర్దుబాటు సదుపాయం (లిక్విడిటి అడ్జస్ట్ మెంట్ ఫెసిలిటీ) మరియు మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ వినియోగించుకొనుటకు, కాల్ / మనీ మార్కెట్లలో పాల్గొనుటకు అనుమతించబడతాయి.

21. ఇండియాలో, క్రెడిట్ డిరైవేటివ్స్ మార్కెట్ ప్రోత్సహించే ఉద్దేశంతో ఇటీవల ఆర్థిక ఒప్పందాల ‘బైలేటరల్ నెట్టింగ్ అఫ్ ఫైనాన్షియల్ కాంట్రాక్ట్స్’ చట్టం, చేసిన తరువాత, క్రెడిట్ డిఫాల్ట్ స్వాప్స్ (సి డి ఎస్) కు సంబంధించిన మార్గదర్శకాలు సమీక్షించి, ముసాయిదా నిర్దేశాలు ప్రజాభిప్రాయ సేకరణకు జారీ చేయవలెనని నిశ్చయించడం జరిగింది. సవరించిన నిర్దేశాలు, క్రెడిట్ డిరైవేటివ్స్ మార్కెట్ ను వృద్ధిచేసి, కార్పొరేట్ బాండ్ల, (ప్రత్యేకించి తక్కువ శ్రేణిలోని) మార్కెట్ కు చురుకుదనం కలిగిస్తాయి.

22. క్రమంగా ఆర్థిక విపణుల వికాసం మరియు ఇటీవలి కాలంలో సరళం చేయుటకు చేపట్టిన చర్యల నేపథ్యంలో, డిరైవేటివ్ ల మీద 2011 లో జారీచేసిన సమగ్ర మార్గదర్శకాలు సమీక్షించి, ముసాయిదా నిర్దేశాలు ప్రజాభిప్రాయ సేకరణకు జారీ చేయవలెనని నిశ్చయించడం జరిగింది. సవరించిన నిర్దేశాలు, ‘ఓవర్ ది కౌంటర్ డిరైవేటివ్’ వ్యాపారంలో ఉన్నత ప్రమాణాలను కాపాడుతూ, డిరైవేటివ్ మార్కెట్లను అందుబాటులోకి తేవడానికి సమర్థవంతంగా సహాయపడతాయి.

23. కాల్ / నోటీస్ / మనీ మార్కెట్లు, సర్టిఫికేట్ అఫ్ డిపాజిట్లు (సి డి) , కమర్షియల్ పేపర్స్ (సి పి) మరియు నాన్-కన్వర్టిబుల్ డిబెంచర్లకు (ప్రథమంగా ఒక సంవత్సరంలోపు మాచురిటీ కలిగిన) సంబంధించిన సమగ్ర మార్గదర్శకాలు ప్రజాభిప్రాయ సేకరణకు, ఈ రోజు జారీ చేయబడుతున్నాయి. వీటిద్వారా, ఉత్పత్తులకు సంబంధించి, జారీ సంస్థలకు, మదుపరులకు మరియు ఇతర భాగస్వాములకు క్రమబద్ధత కలుగుతుంది.

(iii) నియంత్రణ

(a) బ్యాంకులు

24. కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి సమయంలో, ఆర్థిక స్థిరత్వానికి భంగం కలుగకుండా, ఋణ గ్రహీతలకు ఒత్తిడి లేకుండా, వ్యవస్థకు ఋణ సదుపాయాలు అందించుటపై రిజర్వ్ బ్యాంక్ దృష్టిసారించింది. పరిస్థితి సమీక్షించి, బ్యాంకులు మూలధనం కాపాడుకొంటూ, నూతన రుణాలు జారీ చేయుటకు వీలుకల్పించుటకు, వాణిజ్య బ్యాంకులు / సహకార బ్యాంకులు, 2019-20 సంవత్సరానికి, డివిడెండ్లు చెల్లించకుండా, లాభాలను తామే ఉంచుకోవాలని నిర్ణయించడం జరిగింది.

బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్ బి ఎఫ్ సిలు)

25. ఎన్ బి ఎఫ్ సి ల ప్రాముఖ్యత, ఆర్థిక వ్యవస్థలోని ఇతర సంస్థలతో వారికి గల సంబంధాలు, ఈ రంగాన్ని బలపరచడం తప్పనిసరి చేశాయి. ఆ కారణంగా, వివిధ వర్గాల ఎన్ బి ఎఫ్ సిలు, డివిడెండ్ చెల్లించుటకు, కొన్ని పరామితుల ఆధారంగా, పారదర్శకమైన నిబంధనలు కల్పించాలని నిర్ణయించబడింది. ఈ నిబంధనలను వివరిస్తూ, ముసాయిదా సర్క్యులర్ ప్రజాభిప్రాయం తెలిసికొనుటకు త్వరలో జారీచేయబడుతుంది.

26. ఇంతేగాక, ఎన్ బి ఎఫ్ సిల వ్యాపార వంతుప్రకారం (పరవపోర్షనాలిటీ) రూపొందించబడిన నియంత్రణా వ్యవస్థ, సమీక్షించవలసిన అవసరం ఉంది. ఎన్ బి ఎఫ్ సిల స్థాయి అనుసారంగా, ‘సిస్టమిక్ రిస్క్ కంట్రిబ్యూషన్’ కు జోడించిన నియంత్రణా విధానం తగినది కావచ్చు. భాగస్వాముల అభిప్రాయ సేకరణలో భాగంగా, ప్రజల స్పందనకొరకు, ఈ విషయమై ఒక చర్చాపత్రం, జనవరి 15, 2021 తేదీకి ముందుగా జారీచేయబడుతుంది.

(iv) పర్యవేక్షణ

27. తమ నియంత్రణలో ఉన్న సంస్థల నిర్వహణ మరియు హామీఇచ్చిన విధుల పరిపాలన మెరుగుచేయుటకు అవసరమైన పర్యవేక్షణా విధాన రూపకల్పనపై, రిజర్వ్ బ్యాంక్ యోచిస్తూనే ఉంది. ఈ విషయమై విధానాలు ఈరోజు ప్రకటించబడుతున్నాయి: (i) పెద్ద నగర సహకార బ్యాంకులు (యు సి బిలు), బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల్లో (ఎన్ బి ఎఫ్ సి లు), నష్ట భయం తెలిసికొనుటకు అంతర్గత ఆడిట్ (రిస్క్ బేస్డ్ ఇంటర్నల్ ఆడిట్, ఆర్ బి ఐ ఏ), ప్రవేశపెట్టుట (ii) ఆర్థిక నివేదికలలో నాణ్యత పెంచుటకు, వాణిజ్య బ్యాంకులు, యు సి బిలు, ఎన్ బి ఎఫ్ సి లలో స్టాట్యుటరీ అడిటర్ల నియామకానికి సంబంధించిన మార్గదర్శకాలు సమన్వయించుట. వివరాలు ఈ నివేదిక భాగం – B లో కలవు. పై అంశాలపై మార్గదర్శకాలు త్వరలో జారీ చేయబడతాయి.

(v) డిజిటల్ చెల్లింపుల భద్రత

28. డిజిటల్ చెల్లింపుల వాతావరణాన్ని బలిష్టంచేసి, వినియోగదారులకు సులభం చేయుటకు, నియంత్రిత సంస్థలకు రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా (డిజిటల్ పేమెంట్ భద్రత నిబంధనలు) మార్గదర్శకాలు [(రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా(డిజిటల్ పేమెంట్ సెక్యూరిటీ కంట్రోల్స్)] డైరక్షన్స్ జారీచేయాలని అనుకొంటున్నాము. ఈ మార్గదర్శకాలు, ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్, కార్డుతో చెల్లింపులు మొదలైన లావాదేవిలలో పాటించవలసిన కనీస భద్రతపై సూచనలు కలిగి ఉంటాయి. ముసాయిదా మార్గదర్శకాలు, ప్రజాభిప్రాయ సేకరణకు, త్వరలో జారీ చేయబడతాయి.

(vi) ఆర్థిక అక్షరాస్యత మరియు విద్య

29. ఆర్థిక సంఘటితం బలపరుచుటకు, ఆర్థిక అక్షరాస్యత పెంచడంద్వారా వినియోగదారులకు రక్షణకల్పించుటకు, సామాజిక భాగస్వాములతో రిజర్వ్ బ్యాంక్ 2017 లో, ఆర్థిక అక్షరాస్యతా కేంద్రాలను (సి ఎఫ్ ఎల్) ప్రయోగాత్మకంగా, ప్రారంభించింది. ఇవి, ఎంపికచేసిన బ్యాంకులు మరియు ప్రభుత్వేతర సంస్థలద్వారా, నిర్వహించబడుతున్నాయి. ప్రస్తుతం, ప్రతి సి ఎఫ్ ఎల్ 100 బ్లాకులకు సేవలందిస్తున్నాయి. వీటిని ప్రతి బ్లాకుకు సేవలందించే విధంగా వృద్ధిచేయాలని ప్రతిపాదన.

(vii) బ్యాంకులలో ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ

30. బ్యాంకులలో, ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియ సమర్థవంతంగా అమలు చేయుటకు, రిజర్వ్ బ్యాంక్ ఒక సమగ్ర విధానం ప్రవేశపెడుతోంది. ఈ విధానంలో, ఇతర అంశాలతోబాటు ముఖ్యమైనవి – (i) ఖాతాదారుల ఫిర్యాదులు పూర్తిగా వెల్లడిచేయుట (ii) ఫిర్యాదుల పరిష్కారానికి అయిన ఖర్చు బ్యాంకులనుండి రాబట్టుట (iii) బ్యాంకులలో ఫిర్యాదుల పరిష్కార విధానాలు నిశితంగా సమీక్షించి, వాటిని మెరుగుచేయుటలో విఫలమైన బ్యాంకులపై చర్య తీసుకొనుట.

(viii) విదేశీ వాణిజ్యం సులభతరం చేయుట

31. ఎగుమతులలో పోటీ సామర్థ్యం, సౌలభ్యం పెంచుటకు, కాలయాపన తగ్గించుటకు, రిజర్వ్ బ్యాంక్ అనేక చర్యలు ప్రకటించింది. ఈ కృషి కొనసాగిస్తూ, విదేశీ వాణిజ్యం మరింత సులభం చేయుటకు, ఆతరైజ్డ్ డీలర్లకు మరిన్ని అధికారాలు అప్పగించాలని నిర్ణయించడం జరిగింది – (a) షిప్పింగ్ డాక్యుమెంట్లు నేరుగా పంపించిన ఎగుమతులు, విలువతో నిమిత్తం లేకుండా, క్రమబద్ధీకరించుట (b) కొన్ని ప్రత్యేక సందర్భాలలో, వసూలుకాని ఎగుమతిమొత్తాన్ని, ఏ పరిమితి లేకుండా మాఫీచేయుట (c) ఎగుమతి, దిగుమతి అదే సంవత్సరంలో జరిగిఉంటే, కొన్ని నిబంధనలకులోబడి, ఎగుమతి / దిగుమతి విలువలు, సరిపుచ్చుట మరియు (d) ఎగుమతిచేసుకున్న దేశంలో, చెడిపోయే స్వభావంగల వస్తువులు; పోర్ట్ /కస్టమ్ /ఆరోగ్య అధికారులు / నియోజిత సంస్థలు వేలంవేసిన/ ధ్వంసం చేసిన వస్తువులు, తగిన ఋజువు పత్రాలు చూపితే, తిరిగి దిగుమతి చేయాలని ఆంక్షలు విధించకుండా, ఎగుమతి విలువను తిరిగి ఇచ్చివేయుట.

(ix) చెల్లింపు మరియు సెటిల్మెంట్ విధానాలు

32. ఆర్ టి జి ఎస్ సేవలు త్వరలో, రోజంతా (24X7) లభిస్తాయి. ఈ సౌకర్యంతో, ఏ ఈ పి ఎస్, ఐ ఎమ్ పి ఎస్, ఎన్ ఈ టి సి, ఎన్ ఎఫ్ ఎస్, రు పే, యు పి ఐ లావాదేవీలలో ప్రతిరోజూ సెటిల్మెంట్ జరపడంద్వారా వ్యవస్థలోని సెటిల్మెంట్, ఎగవేత భయాలు తగ్గుతాయని యోచన. దీనితో, చెల్లింపుల విధానం సమర్థవంతమౌతుంది.

33. డిజిటల్ చెల్లింపు ప్రక్రియలు సురక్షితంగా విస్తరించుటకు, కార్డ్/ ఇ – మాండేట్ ద్వారా ప్రతిసారీ చేయవలసిన లావాదేవీల విలువ, జనవరి 1, 2021 నుంచి, వినియోగదారునికి సమ్మతమయితే, రూ.2000 నుండి రూ. 5000 వరకు పెంచవలెనని ప్రతిపాదించబడినది.

సారాంశం

34. ఇటీవల కనిపిస్తున్న అభివృద్ధి చిహ్నాలు, ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజితం అవుతుందనడానికి, శుభసూచకాలు. ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ కల్పిస్తున్న ప్రేరణలు, అభివృద్ధి అంకురాలు చిగురించి, పెరగడానికి తోడ్పడతాయి. వైరస్ గురించి జాగ్రత్త వహిస్తూ, ఆర్థిక వ్యవస్థను క్రమంగా అన్ లాక్ చేయుటకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు, జాగరూకతతో మెలగుతూ, మహమ్మారి కలిగించిన గాయాలనుండి కోలుకొని, ఆర్థిక వ్యవస్థను ఉత్తేజితం చేయాలి. వేక్సిన్ కనుగొనడం, మరియు ఆర్థిక వ్యవస్థ క్రమంగా మెరుగుపడుతోందన్న చిహ్నాలు, ఆకాశంలో ఆశాకిరణాలు. కోవిడ్ -19 సంకెళ్లనుండి విముక్తులై

భవితవ్యాన్ని తిరగరాసే సమయం అసన్నమయింది. మహమ్మారి సృష్టించిన సంక్షోభాన్ని, ధైర్య స్థైర్యాలతో భరించాము. ఎన్నో ప్రాణాలు, ఎందరో ఆత్మీయులని కోల్పోయి ఉండవచ్చు కానీ ఈ కష్టాన్ని అధిగమించి, శక్తివంతులమౌతామన్న విశ్వాసాన్ని కోల్పోలేదు. కోవిడ్ తరువాత జీవనం, ముందువలే ఉండదని అంటుంటారు. మరో క్రొత్త ప్రపంచాన్ని సృష్టించడం కష్టం కాదని, మానవ కృషి అనేకమార్లు ఋజువుచేసింది. మనం ధృడమైన విశ్వాసంతో, శ్రమించాలి, శోధించాలి, సాధించాలి. ఇక్కడ నాకు సోక్రటీస్ చెప్పిన వాక్యం గుర్తుకొస్తోంది, “ప్రతికూలతలు ఎదురైనప్పుడు, విషాదంలో ములిగిపోతామా లేక విజయంలో తేలుతామా, అన్నది మన నిర్ణయం”. ఖచ్చితంగా మనం విజయానికే కృషి చేస్తాము.

సురక్షితంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. నమస్తే.

(యోగేశ్ దయాల్) 
చీఫ్ జనరల్ మానేజర్

పత్రికా ప్రకటన: 2020-2021/719


Image 1
Image 2
Image 3
Image 4
Image 5
Image 6

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?