RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78484347

ద్ర‌వ్య విధాన క‌మిటీ స‌మావేశం మినిట్స్, ఏప్రిల్ 5-6, 2017
(రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్, 1934లోని 45 ZL సెక్ష‌న్ క్రింద‌)

చిత్ర ప‌టం 1

ఏప్రిల్ 20, 2017

ద్ర‌వ్య విధాన క‌మిటీ స‌మావేశం మినిట్స్, ఏప్రిల్ 5-6, 2017
(రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్, 1934లోని 45 ZL సెక్ష‌న్ క్రింద‌)

స‌వ‌రించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్, 1934లోని 45ZB సెక్షన్ క్రింద ఏర్పాటు చేయబడిన ద్రవ్య విధాన కమిటీ నాలుగవ సమావేశం, ముంబైలోని భారతీయ రిజర్వ్ బ్యాంక్ నందు ఏప్రిల్ 5-6, 2017న నిర్వహించబడింది.

2. ఈ స‌మావేశానికి స‌భ్యులంద‌రూ- డా. చేత‌న్ ఘాటే, ప్రొఫెస‌ర్‌, ఇండియ‌న్ స్టాటిస్టిక‌ల్ ఇన్‌స్టిట్యూట్‌; డా. పామి దువా, డైరెక్ట‌ర్‌, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎక‌నామిక్స్; డా.ర‌వీంద్ర హెచ్‌.‌ధోల‌కియా, ప్రొఫెస‌ర్‌, ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌, అహ్మ‌దాబాద్‌; డా.మైఖేల్ దేబ‌బ్ర‌త పాత్ర‌, ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ (రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్, 1934లోని సెక్ష‌న్ 45 ZB (2) (c) క్రింద సెంట్ర‌ల్ బోర్డు ద్వారా ఆఫీస‌ర్ ఆఫ్ ది రిజ‌ర్వ్ బ్యాంక్ గా నియ‌మితులు); డా. విర‌ల్ వి.ఆచార్య‌, డిప్యూటీ గ‌వ‌ర్న‌ర్, ద్ర‌వ్య విధాన ఇన్‌చార్జ్ లు హాజ‌ర‌య్యారు. ఈ స‌మావేశానికి రిజ‌ర్వ్ బ్యాంక్ గ‌వ‌ర్న‌ర్ డా. ఉర్జిత్ ఆర్‌.ప‌టేల్ అధ్య‌క్ష‌త వ‌హించారు.

3. స‌వ‌రించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్, 1934లోని సెక్షన్ 45ZL క్రింద, రిజ‌ర్వ్ బ్యాంక్ ప్ర‌తి ద్ర‌వ్య విధాన క‌మిటీ స‌మావేశం అనంత‌రం, ప‌ధ్నాలుగో రోజున ఆ స‌మావేశంలో జ‌రిగిన అంశాల మినిట్స్ ను ప్ర‌చురిస్తుంది. వాటిలో ఈ క్రింది అంశాలుంటాయి-

(ఎ) ద్ర‌వ్య విధాన క‌మిటీ స‌మావేశంలో ఆమోదించిన తీర్మానం;

(బి) పైన పేర్కొన్న స‌మావేశంలో ఆమోదించిన తీర్మానానికి ద్ర‌వ్య విధాన క‌మిటీ యొక్క ప్ర‌తి స‌భ్యుడు వేసిన ఓటు; మ‌రియు

(సి) పైన పేర్కొన్న స‌మావేశంలో ఆమోదించిన తీర్మానానికి స‌బ్ సెక్ష‌న్ (11) ఆఫ్ సెక్ష‌న్ 45ZI క్రింద ద్ర‌వ్య విధాన క‌మిటీలోని ప్ర‌తి స‌భ్యుడూ చేసిన ప్ర‌క‌ట‌న‌.

4. ద్ర‌వ్య విధాన క‌మిటీ రిజ‌ర్వ్ బ్యాంక్ నిర్వ‌హించిన స‌ర్వేల‌ను, వినియోగ‌దారుల విశ్వాసాన్ని, కుటుంబాల ద్ర‌వ్యోల్బ‌ణ అంచ‌నాలు, కార్పొరేట్ రంగం ప‌నితీరు, ప‌ర‌ప‌తి ప‌రిస్థితి, పారిశ్రామిక‌, సేవా, మౌలిక స‌దుపాయ రంగాల దృక్పథం, ప్రొఫెష‌న‌ల్ ఫోర్ క్యాస్ట‌ర్స్ ముంద‌స్తు అంచ‌నాలను స‌మీక్షించింది. సిబ్బంది యొక్క స్థూల ఆర్థిక అంచ‌నాలు, వాటి చుట్టూ ఉన్న‌ వివిధ రిస్కుల‌కు ప్ర‌త్యామ్నాయాల‌ను క‌మిటీ స‌వివ‌రంగా స‌మీక్షించింది. వాటిని స‌మీక్షించి, ద్ర‌వ్య విధానంపై విస్తృతంగా చ‌ర్చించిన అనంత‌రం, ద్ర‌వ్య విధాన క‌మిటీ ఈ క్రింది తీర్మానాన్ని ఆమోదించింది

తీర్మానం

5. నేటి స‌మావేశంలో ప్ర‌స్తుత మ‌రియు మార్పు చెందుతున్న స్థూల ఆర్థిక ప‌రిస్థితిని స‌మీక్షించిన అనంత‌రం, ద్ర‌వ్య విధాన క‌మిటీ (MPC) ఈ విధంగా నిర్ణ‌యించింది:

  • పాల‌సీ రెపో రేటును ఎలాంటి మార్పు లేకుండా 6.25 శాతం వ‌ద్ద లిక్విడిటీ అడ్జస్ట్ మెంట్ ఫెసిలిటీ (LAF) కింద ఉంచాలి.

6. దీనితో పాటు జ‌త‌ప‌రిచిన అభివృద్ధి మ‌రియు నియంత్ర‌ణా విధానాల ప్ర‌క‌ట‌నలో పేర్కొన్న‌ట్లుగా, LAF కారిడార్‌ను త‌గ్గించిన పిమ్మ‌ట‌, రివ‌ర్స్ రెపో రేటును LAF కింద 6.0 శాతం వ‌ద్ద‌, మార్జిన‌ల్ స్టాండింగ్ ఫెసిలిటీ (MSF) రేట్ మ‌రియు బ్యాంకు రేట్ల‌ను 6.50 వ‌ద్ద ఉంచాలని నిర్ణ‌యించ‌డం జ‌రిగింది.

7. MPC యొక్క నిర్ణ‌యం, ఒక‌వైపున అభివృద్ధిని ప్రోత్స‌హిస్తూ, ద్ర‌వ్య విధానంలో మ‌ధ్య‌స్థ దారిని అనుస‌రిస్తూ, వినియోగ‌దారుల ధ‌ర‌ల సూచిక (CPI) విష‌యంలో, +/- 2 శాతం బ్యాండ్‌లో 4 శాతం ద్ర‌వ్యోల్బ‌ణం మ‌ధ్యకాలిక ల‌క్ష్యాన్ని సాధించాల‌నే ల‌క్ష్యానికి అనుగుణంగా ఉంది. ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డానికి ముఖ్య కార‌ణాల‌ను ఈ క్రింది ప్ర‌క‌ట‌న‌లో వివ‌రించ‌డం జ‌రిగింది:

అంచ‌నా

8. MPC ఫిబ్ర‌వ‌రి, 2017లో స‌మావేశ‌మైన‌ నాటి నుంచి, అంత‌ర్జాతీయ అభివృద్ధి సూచిక‌లు అత్యంత ఆధునిక ఆర్థిక వ్య‌వ‌స్థ‌(AE)లో బ‌ల‌మైన మార్పుల‌ను మ‌రియు స‌రుకుల‌ను ఎగుమ‌తి చేసే భారీ ఎమ‌ర్జింగ్ మార్కెట్ ఎకాన‌మీ(EME)లు ఆర్థిక మాంద్యం త‌గ్గుదుల‌ను సూచిస్తున్నాయి. అమెరికాలో గ‌త త్రైమాసికంలో అతి త‌క్కువ పెర్‌ఫామెన్స్ నుంచి 2017 మొద‌టి Q1లో లేబ‌ర్ మార్కెట్‌, పారిశ్రామిక ఉత్ప‌త్తి మరియు రిటైల్ అమ్మ‌కాలు గ‌ణ‌నీయంగా పుంజుకున్నాయ‌ని హై ఫ్రీక్వెన్సీ డాటా సూచిస్తోంది. అయిన‌ప్ప‌టికీ, స్థూల ఆర్థిక విధానాలు కార్య‌రూపం దాల్చ‌ని కార‌ణంగా, లేదా త‌క్కువ అభివృద్ధి కార‌ణంగా భారీ ల‌క్ష్యాలు సాధించ‌లేమ‌నే భ‌యాలు క‌మ్ముకున్నాయి. యూరో విష‌యంలో, వినియోగ‌దారుల విశ్వాసం పెర‌గ‌డం మ‌రియు ఉపాధి అవ‌కాశాలు క్ర‌మంగా పెర‌గ‌డం లాంటి కార‌ణాల‌తో పారిశ్రామిక ప‌ర్చేజింగ్ మేనేజ‌ర్స్ ఇండెక్స్ (PMI) మార్చి నెల‌లో ఆరేళ్ల గ‌రిష్టానికి చేరంది. జ‌పాన్ ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో, నిరుద్యోగం త‌గ్గుముఖం ప‌ట్ట‌డం, స్థిర పెట్టుబ‌డుల విష‌యంలో బిజినెస్ సెంటిమెంట్ మెరుగుప‌డ‌డం, యెన్ విలువ త‌గ్గుద‌ల‌తో పెరిగిన ఎగుమ‌తులు త‌దిత‌ర కార‌ణాల వ‌ల్ల జ‌పాన్ ఆర్థిక వ్య‌వ‌స్థ మ‌ళ్లీ పుంజుకుంటున్న సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. అయితే ప్ర‌తి ద్ర‌వ్యోల్బ‌ణ రిస్కులు ఇంకా కొన‌సాగుతూనే ఉన్నాయి.

9. 2016లో కనిపించిన మాంద్యం లక్షణాలు నెమ్మదిగా తగ్గిపోతుండడంతో EME ల దృక్పథం క్రమంగా మెరుగుపడుతోంది, చైనాలో ఆర్థిక స్థిరత్వం మరియు క్యాపిటల్ అవుట్ ఫ్లోల విషయంలో కొన్ని సందేహాలు ఉన్నప్పటికీ, అనుకూల స్థూల ఆర్థిక విధానాలు, పెరుగుతున్న క్రెడిట్ గ్రోత్ మరియు ప్రాపర్టీ మార్కెట్ అంచనాకు మించిన అభివృద్ధి కలిసి ఆ దేశ అభివృద్ధి రేటు కొనసాగేందుకు కారణమయ్యాయి. బ్రెజిల్‌లో ప్రభుత్వం తీసుకున్న సంస్కరణలకు ఊతంగా స్థిరపడుతున్న ఉత్పత్తుల ధరలు ఆర్థిక వ్యవస్థను మాంద్యం నుంచి బయట పడేసేందుకు ఉపయోగపడుతున్నాయి, ఆర్థిక దుర్భలత్వం ఇంకా ప్రమాదకరంగా ఉన్నప్పటికీ. క్రూడాయిల్ ధరల కారణంగా లాభం పొందుతున్న రష్యా, 2017లో మరోసారి అభివృద్ధి బాట పడుతుందని భావిస్తున్నారు.

10. క్రమంగా తగ్గుతున్న నిరుపయోగ వనరులు, పటిష్టమైన లేబర్ మార్కెట్లు, పెరుగుతున్న ఉత్పత్తుల ధరల నేపథ్యంలో AEలలో ద్రవ్యోల్బణం క్రమంగా పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ద్రవ్యోల్బణ వత్తిడులు మెల్లమెల్లగా తగ్గుతున్న నేపథ్యంలో EME లలో టర్కీ, దక్షిణాఫ్రికా మాత్రం దీనికి అతీతంగా ఉన్నాయి. వాణిజ్య నిబంధనల్లో మార్పుల నేపథ్యంలో ఎట్టకేలకు గ్లోబల్ ట్రేడ్ వాల్యూమ్స్ మెల్లగా మెరుగ‌వుతున్న సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. పలు EME లలో మరియు తమ కరెన్సీ విలువను తగ్గించిన కొన్ని AE లలో ఎగుమతులు వేగంగా పెరుగుతున్నాయి.

11. అంతర్జాతీయ ఫైనాన్స్ మార్కెట్లు అనేక AE లలో చేసిన విధాన ప్రకటనలతో, భౌగోళిక-రాజకీయ కారణాలతో, ఆయా దేశాలకు చెందిన ప్రత్యేక అంశాల వల్ల ప్రభావితమయ్యాయి. AE లలోని ఈక్విటీ మార్కెట్లు ప్రతి ద్రవ్యోల్బణ వాణిజ్యం, బలమైన ఇన్ కమింగ్ డాటా మరియు కరెన్సీ కదలికల వల్ల ప్రభావితం చెందాయి. ఇన్వెస్టర్ల అప్రమత్తత, క్యాపిటల్ ఫ్లోల వల్ల స్వదేశీ అంశాలను ప్రతిబింబిస్తూ EME లలోని ఈక్విటీ మార్కెట్లలో మిశ్రమ ప్రతిస్పందన కనిపించింది. మార్చి నెల రెండో అర్ధభాగంలో అమెరికా ఆర్థిక విధానంపై డోవిష్ గైడెన్స్ కారణంగా అన్ని ప్రాంతాలలో మరీ ముఖ్యంగా ఆసియాలో ఈక్విటీలు ఎత్తివేయబడి, EME ల అసెట్స్ కోసం మరోసారి పోటీ పెరిగింది, అయితే అమెరికా విధానాలు ఏ మేరకు వాస్తవరూపం దాలుస్తాయన్న అనుమానాలను, బ్రెగ్జిట్ మరియు తగ్గిన క్రూడాయిల్ ధరలు నిమ్మళింపజేశాయి. అమెరికాలో ఫిస్కల్ స్టిమ్యులస్ చుట్టూ అలుముకున్న‌ అనిశ్చితిని ప్రతిఫలించిన బాండ్ మార్కెట్లు, దాని వల్ల AE ల వైపుగా ట్రేడ్ అయ్యాయి, అయితే EME లలో అవి కొంత సడలాయి. కరెన్సీ మార్కెట్లలో అమెరికా డాలర్ యొక్క బుల్ రన్ మార్చి నెల మధ్యనాటికి వేగాన్ని కోల్పోయింది. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో EME కరెన్సీలు మొదట కొంత పెరిగినప్పటికీ, కమోడిటీ ధరలు తగ్గడంతో ఇటీవలి కాలంలో వాటిలో కొన్ని బలహీనపడ్డాయి. షేల్ అవుట్ పుట్ పెరగడం, అమెరికా ఇన్వెంటరీలు పెరగడంతో క్రూడాయిల్ ధరలు మార్చికి మూడు నెలల కనిష్టానికి పడిపోయాయి. తృణధాన్యాల కారణంగా ఆహారపదార్థాల ధరలు ప్రపంచవ్యాప్తంగా క్రమంగా పెరుగుదలను సూచిస్తున్నాయి.

12. మన దేశం విషయానికి వస్తే, సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (CSO) ఫిబ్రవరి 28న, 2016-17 సంవత్సరానికి తన రెండో ముందస్తు అంచనాలను విడుదల చేసింది. వాటి ప్రకారం ఈ ఏడాది భారత వాస్తవ GVA అభివృద్ధి 6.7 గా అంచనా వేశారు. ఇది జనవరి 6న విడుదల చేసిన మొదటి ముందస్తు అంచనా విలువకన్నా తక్కువ. వరుసగా రెండేళ్లు ఒకటి కన్నా తక్కువ అభివృద్ధి అనంతరం వ్యవసాయం ఏటికేడాదీ అతి శక్తివంతంగా విస్తరించింది. పారిశ్రామిక రంగంలో, విద్యుత్ ఉత్పత్తి తప్ప అన్ని విభాగాలలో మందగమనం చోటు చేసుకుంది. వాణిజ్యం, హోటళ్లు, రవాణా, కమ్యూనికేషన్ తో పాటు ఫైనాన్షియల్, రియల్ ఎస్టేట్ మరియు వృత్తిపరమైన సేవల మందగమనంతో సేవారంగం కూడా మందగించింది. అయితే ప్రైవేట్ వినియోగం మరియు క్యాపిటల్ ఫార్మేషన్ లో తగ్గుదలను ప్రభుత్వ పెట్టుబడులు కొంతవరకు పూరించాయి.

13. స్థూల ఆర్థిక దృక్పథంలో కొంత అభివృద్ధి ఉంటుందని అనేక సూచికలు వెల్లడిస్తున్నాయి. వరి, గోధుమలు, తృణధాన్యాల రికార్డు స్థాయి ఉత్పత్తితో ఆహారధాన్యాల ఉత్పత్తి ముందెన్నడూ లేనంతగా 272 మిలియన్ టన్నుల అత్యధిక స్థాయిని తాకింది. గోధుమ రికార్డుస్థాయి ఉత్పత్తి వల్ల ధాన్య సేకరణ కార్యకలాపాలు పెరిగి, ఇటీవలి కాలంలో పెరిగిన ఎగుమతులు కొంత తగ్గే అవకాశముంది. బఫర్ స్థాయికన్నా తగ్గిన వరి స్టాక్, ఖరీఫ్ సేకరణతో పెరిగింది. పప్పుధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరగడంతో అనుకున్న బఫర్ స్టాక్ స్థాయి (20 లక్షల టన్నులు) లక్ష్యం చేరుకుంది. దీని వల్ల పప్పుధాన్యాల ధరలు కూడా అదుపులో ఉంటాయి. ఇప్పటికే దేశంలో కాయధాన్యాల ధరలు కనీస మద్దతు ధర కన్నా తక్కువకు చేరాయి.

14. పారిశ్రామిక ఉత్పత్తి సూచిక (IIP)తో కొలిచే పారిశ్రామిక ఉత్పాదన, ఉత్పత్తితో పాటు మైనింగ్, క్వారీయింగ్ రంగాలలో అభివృద్ధి కారణంగా జనవరి నెల తరుగుదల నుంచి కోలుకుని కొంత తేరుకుంది. ఆశాజనకంగా లేని బేస్ ఎఫెక్ట్స్ తగ్గుతున్నాయని సూచించినప్పటికీ క్యాపిటల్ గూడ్స్ ఉత్పత్తి చెప్పకోదగినంతగా మెరుగుపడింది. బేస్ ఎఫెక్ట్ లు ఆశాజనకంగా ఉన్నప్పటికీ, వినియోగదారుల నాన్- డ్యూరబుల్స్ వరుసగా రెండో నెల కూడా తరుగుదలను నమోదు చేశాయి. అందువల్ల ఇన్వెస్ట్ మెంట్ మరియు గ్రామీణ వినియోగ డిమాండ్ తక్కువస్థాయిలో ఉంది. ఫిబ్రవరిలో బొగ్గు తప్ప అన్ని రంగాలలో ఉత్పత్తి మందగించడంతో కోర్ ఇండస్ట్రీస్ ఉత్పాదన కూడా తగ్గుముఖం పట్టింది. ఫిబ్రవరిలో విస్తరణ సూచనలు కనిపించినా ఉత్పాదక పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (PMI) మార్చిలో కొత్త ఆర్డర్లు మరియు ఉత్పాదన కారణంగా ఐదు నెలల గరిష్టానికి చేరింది. పికప్ డిమాండ్ పెరుగుతుందనీ, కొత్త ప్రాడక్ట్ లైన్లను ప్రారంభిస్తారన్న అంచనాల నేపథ్యంలో ఫ్యూచర్ అవుట్ పుట్ ఇండెక్స్ లు కూడా బలంగా పుంజకున్నాయి. రిజర్వ్ బ్యాంక్ యొక్క 77వ రౌండ్ పారిశ్రామిక ఔట్ లుక్ సర్వే 2017-18, అంతర్గత, బయటి దేశాల నుంచి డిమాండ్లు పెరుగుతున్న నేపథ్యంలో మొదటి త్రైమాసికంలో ఓవరాల్ బిజినెస్ సెంటిమెంట్ మెరుగుపడుతుందని అంచనా వేసింది. అనేక పరిశ్రమలలో వనరులను పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోతున్న కారణాలు పెట్టుబడులకు ప్రతికూలంగా పరిణమించినప్పటికీ ఎగుమతులు, నాన్-ఆయిల్, నాన్-గోల్డ్ దిగుమతులు లాంటి కోఇన్సిడెంట్ సూచికలు పారిశ్రామిక అభివృద్ధి మెరుగుపడుతుందని సూచిస్తున్నాయి.

15. డీమానిటైజేషన్ ప్రభావం క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో సేవారంగంలో కార్యకలాపాలు క్రమంగా పుంజుకుంటున్నాయి. ఒకవైపున తగ్గిన ద్విచక్ర, త్రిచక్ర వాహనాల అమ్మకాలు మరియు ఎరువుల అమ్మకాలు గ్రామీణ ప్రాంతంలో తగ్గిన డిమాండును సూచిస్తున్నాయి. మరోవైపు - రైల్వే ట్రాఫిక్, టెలిఫోన్ ఖాతాదారులు, విదేశీ పర్యాటకుల సంఖ్య, ప్యాసింజర్ మరియు కమర్షియల్ కార్ల అమ్మకాలు పెరగడం తదితర హై ఫ్రీక్వెన్సీ సూచికలు సేవారంగం పుంజుకుంటున్న సూచనలిస్తున్నాయి. కొత్త వ్యాపారాలు పెరగడంతో వరుసగా మూడు నెలల పాటు తగ్గిన సేవల PMI ఫిబ్రవరీ, మార్చి నెలల్లో విస్తరణ జోన్ లోనికి ప్రవేశించింది.

16. గత ఆరు నెలలుగా విరామం లేకుండా చారిత్రాత్మక కనిష్ట స్థాయికి చేరుకున్న రిటైల్ ద్రవ్యోల్బణం, వినియోగదారుల ధరల సూచీ (CPI) లో మార్పుల కారణంగా ఫిబ్రవరిలో 3.7 శాతానికి మారింది. ఆహారధరలు గత మాసపు కనిష్ట స్థాయికి చేరగా, ఈ విభాగంలో బేస్ ఎఫెక్ట్స్ ద్రవ్యోల్బణాన్ని పైకి నెట్టాయి. చక్కెర, పళ్లు, మాంసం, చేపలు, పాలు, ప్రాసెస్డ్ ఆహార పదార్థాల ధరలు పెరగడంతో ఆహార విభాగం కొంత వేగం పుంజుకుంది. ఇంధన విభాగంలో, అంతర్జాతీయ ధరలు క్రమంగా స్థిరీకరణం చెంది డిసెంబర్ 2016 - ఫిబ్రవరి 2017 కాలంలో దేశీయ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ ధరలను పెంచడంతో ఈ రంగంలో ద్రవ్యోల్బణం పెరిగింది. కిరోసిన్ పై సబ్సిడీని తొలగించడంతో వాటి ధరలు కూడా జులై నుంచి క్రమంగా పెరుగుతున్నాయి. వీటి ధరల్లో మార్పులకు అనుగుణంగా, రిజర్వ్ బ్యాంక్ డిసెంబర్ లో నిర్వహించిన సర్వేలో తగ్గుముఖం పట్టిన మూడు నెలల ముందస్తు మరియు ఏడాది ముందస్తు కుటుంబ ద్రవ్యోల్బణ అంచనాలు, తాజా రౌండ్లో మాత్రం తిరుగుముఖం ప‌ట్టాయి. అంతే కాకుండా ఈ సర్వే ప్రకారం, అన్ని ఉత్పత్తుల బృందాలలో ధరల అంచనాలు క్రమంగా స్థిరీకరణం చెందుతున్నాయని తేలింది. రిజర్వ్ బ్యాంక్ యొక్క 77వ పారిశ్రామిక ఔట్లుక్ సర్వే ఉత్పాదక ఖర్చులు లాభాల మార్జిన్ లను తగ్గిస్తుండడంతో, ధరల నిర్ణాయిక శక్తి తిరిగి కార్పొరేట్లకు చేరుతోందని తేల్చింది.

17. ఆహార పదార్థాలు, ఇంధనం కాకుండా, ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 20 బేసిస్ పాయింట్లు తగ్గి 4.8 శాతానికి చేరింది, మరీ ముఖ్యంగా తాత్కాలిక మరియు ప్రత్యేక వస్తుగత అంశాలపై ఆధారపడి. ఫిబ్రవరీలో దుస్తులు మరియు బెడ్డింగ్ సబ్ గ్రూపుతో పాటు పర్సనల్ కేర్ మరియు ఎఫెక్ట్స్ సబ్-గ్రూపులో బేస్ ఎఫెక్ట్స్ అనుకూలంగా ఉన్నాయి. బంగారు ధరలో చోటు చేసుకున్న ప్రతి ద్రవ్యోల్బణం కూడా పర్సనల్ కేర్ మరియు ఎఫెక్ట్స్ కు కలిసి వచ్చింది. క్రూడాయిల్ ధరలలో ఒడిదుడుకులు మరియు నిమ్మళించిన పాస్-త్రూలు ఆహారపదార్థాలు, ఇంధనం కాకుండా ఇతర వస్తువుల CPI ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపుతున్నాయి. ఫిబ్రవరి ప్రారంభం నుంచి అంర్జాతీయ క్రూడాయిల్ ధరలు 4.5 అమెరికా డాలర్లు తగ్గిపోవడం, ఏప్రిల్ లో వచ్చే CPI లో ప్రతిఫలిస్తుంది (దాని క్యుములేటివ్ పాస్-త్రూ చాలా నెమ్మదిగా ఈ నెల మొదటి వారంలో జరగడం మూలంగా). మరీ ముఖ్యంగా - ఆహార పదార్థాలు, ఇంధనం కాకుండా మిగతావి నిలకడను ప్రదర్శించి, సెప్టెంబర్, 2016 నుంచి ఉన్న ప్ర‌ధాన‌ ద్రవ్యోల్బణంకన్నా పైనే ఉన్నాయి.

18. రీమానిటైజేషన్ వల్ల బ్యాంకింగ్ వ్యవస్థలో జనవరి 04, 2017న అత్యధికంగా రూ.7,956 బిలయన్లు ఉన్న సర్ ప్లస్ లిక్విడిటీ ఫిబ్రవరిలో రూ.6,014 బిలయన్ల సగటుకు, మార్చిలో మరింత తగ్గి రూ.4,806 బిలియన్లకు చేరింది. ఈ కాలంలో చలామణిలో ఉన్న కరెన్సీ క్రమంగా పెరిగింది. అయితే ప్రభుత్వం మార్చి మధ్య వరకు ఆర్థిక వ్యవస్థలోకి లిక్విడిటీని విడుదల చేయడంతో క్యాష్ బ్యాలెన్స్ చెప్పుకోదగినంత పరిమాణంలో తగ్గి, లిక్విడిటీ ఓవర్ హ్యాంగ్ పై దాని ప్రభావాన్ని తగ్గించింది. ఆ తర్వాత ముందస్తు పన్ను చెల్లింపులు, బ్యాంకుల బ్యాలెన్స్ షీట్ సర్దుబాట్ల మూలంగా ప్రభుత్వ నగదు బ్యాలెన్స్ పెరగడం మూలంగా, మార్చి చివరి నాటికి అదనపు లిక్విడిటీ రూ.3,141 బిలియన్లకు తగ్గింది. మార్కెట్ మొబిలైజేషన్ స్కీమ్ (MMS) కింద క్యాష్ మేనేజ్ మెంట్ బిల్స్ (CMB) ను జారీ చేయడం జనవరి మధ్యనాటికి ముగిసి, అప్పటికి ఉన్న ఇష్యూలు మెచ్యూర్ కావడంతో, వేరీయింగ్ టెనర్ల వేరియబుల్ రేట్ రివర్స్ రెపోల వేలం వల్ల తదనంతరం లిక్విడిటీని ఇముడ్చుకోవడం జరిగింది. తదనుగుణంగా రిజర్వ్ బ్యాంక్ యొక్క సగటు నెట్ అబ్సార్ప్షన్ జనవరిలో రూ.2,002 నుంచి మార్చి నాటికి రూ.4,483 బిలియన్లకు చేరుకుంది. వెయిటెడ్ యావరేజ్ కాల్ మనీ రేట్ (WACR) LAF కారిడార్ పరిమితులలోనే ఉంది. CMBలు మెచ్యూర్ కావడం మరియు మార్చి చివరి వరకు ట్రెజరీ బిల్లుల జారీ తగ్గడం కారణంగా ట్రెజరీ బిల్లుల రేట్లు పాలసీ రేట్లకన్నా తక్కువ కావడానికి తోడ్పడ్డాయి.

19. ముందు నెలలకన్నా ఫిబ్రవరి, 2017లో వాణిజ్య ఎగుమతులు చాలా ఎక్కువగా పెరిగాయి. ఇంజనీరింగ్ వస్తువులు, పెట్రోలియం ఉత్పత్తులు, ఇనుప ఖనిజం, వరి మరియు రసాయనాల కారణంగా అభివృద్ధి సూచికలు కూడా విస్తృతంగా కనిపించాయి. జనవరి, ఫిబ్రవరి 2017లో పెరిగిన ఎగుమతులు క్రూడాయిల్ మరియు బొగ్గు వంటి వస్తువుల ధరలు స్థిరీకరణం చెందడాన్ని ప్రతిఫలించాయి. ఇంధనేతర, స్వర్ణేతర దిగుమతులు చాలా మెల్లగా పెరగడం ప్రారంభించగా, క్యాపిటల్ గూడ్స్ దిగుమతులు మాత్రం మందకొడిగా ఉన్నాయి. దిగుమతులు ఎగుమతులను అధిగమించడం వల్ల, గత ఏడాది స్థాయికన్నా ఈసారి జనవరి, ఫిబ్రవరి మధ్యకాలంలో వాణిజ్య లోటు అంతరం పెరిగింది - ఏప్రిల్-ఫిబ్రవరి 2017 మధ్య కాలానికి క్యుములేటివ్ బేసిస్ మీద అది తక్కువగా ఉన్నప్పటికీ.

20. మూడో త్రైమాసికానికి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ గణాంకాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు మొదటి మూడు త్రైమాసాలకు కరెంట్ అకౌంట్ లోటు GDP లో 0.7 శాతానికి, ఏడాది క్రితం ఉన్నదానిలో సగానికి, తగ్గింది. ఏడాదిని మొత్తంగా తీసుకుంటే, కరెంట్ అకౌంట్ లోటు GDP లో 1 శాతం కన్నా తక్కువగా స్థిరంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. ఏప్రిల్-డిసెంబర్ మధ్యకాలంలో నెట్ క్యాపిటల్ ఇన్ ఫ్లోస్ లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎక్కువగా ఉన్నాయి. ఉత్పత్తి, కమ్యూనికేషన్, ఆర్థిక సేవల రంగాల పట్ల ఆకర్షణ ఎక్కువగా కనిపించింది. అంతర్జాతీయ ఫైనాన్స్ మార్కెట్లలో ఒడిదుడుకుల వల్ల గ్లోబల్ రిస్క్ అవర్షన్ కనిపించింది. పెట్టుబడులు పెట్టేందుకు సురక్షితమైన ప్రదేశాల కోసం అన్వేషణ కారణంగా నవంబర్ 2016, జనవరి, 2017 మధ్యకాలంలో ఫారిన్ పోర్ట్ ఫోలియో ఇన్వెస్ట్ మెంట్ (FPI) లు బయటికి తరలిపోయాయి. అయితే పెడరల్ బ్యాంక్ నార్మలైజేషన్ పాత్ లో ప్రైజింగ్-ఇన్ వల్లా, అంతర్జాతీయ అభివృద్ధి అవకాశాలు పెరగడం వల్లా, ఈ పరిస్థితి మారింది. FPI ప్రవాహాలు ఫిబ్రవరిలో పాజిటివ్ గా మారడమే కాకుండా, మార్చినాటికి భారీగా పెరిగాయి. మరీ ప్రత్యేకించి డెట్ మార్కెట్లతో (ఫిబ్రవరి వరకు దీనికే ఎక్కువగా అందాయి) పోలిస్తే, ఈక్విటీ మార్కెట్లలో ఇది ఎక్కువగా కనిపించింది. ఈ మార్పు దేశంలో స్థిరమైన ద్రవ్యోల్బణం, అనుకున్నదానికన్నా ఎక్కువ అభివృద్ధి రేటు, ప్రోత్సాహకరంగా ఉన్న కార్పొరేట్ ఆదాయాలు, FPI ట్యాక్సేషన్ పై స్పష్టత, సంస్కరణలకు అనుకూలంగా ఉన్న బడ్జెట్ ప్రతిపాదనలు, వివిధ రాష్ట్రాలలో ఎన్నికల ఫలితాలు కారణంగా జరిగి ఉంటుందని అంచనా. మార్చి 31, 2017 నాటికి విదేశీ ద్రవ్య నిలువలు 369.9 బిలియన్ల అమెరికా డాలర్లుగా ఉన్నాయి.

స్థూల దృక్ప‌థం

21. ఫిబ్ర‌వ‌రి ద్వైమాసిక ద్ర‌వ్య విధాన ప్ర‌క‌ట‌న నాటి నుంచి ద్ర‌వ్యోల్బ‌ణం నిశ్చ‌లంగా ఉంది. జ‌న‌వ‌రి, ఫిబ్ర‌వ‌రిలో స‌బ్‌-4 ప‌ర్సెంట్ రీడింగ్స్ కార‌ణంగా ప్ర‌ధాన‌ CPI ద్ర‌వ్యోల్బ‌ణం 2016-2017 నాలుగో త్రైమాసికానికి 5.0 శాతం ల‌క్ష్యంక‌న్నాత‌క్కువ న‌మోద‌య్యే అవ‌కాశ‌ముంది. 2017-18కు ద్ర‌వ్యోల్బ‌ణం ఏడాది మొద‌టి అర్ధ‌భాగంలో స‌గ‌టున 4.5 శాతం, రెండో అర్ధ‌భాగంలో 5 శాతం ఉండే అవ‌కాశ‌ముంది. (చిత్ర ప‌టం 1)

22. ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌లో ద్ర‌వ్యోల్బ‌ణ గ‌తిలో రిస్కులు స‌మ‌తూకంతో ఉన్నాయి. ఎల్ నినో ప‌రిస్థితి కార‌ణంగా నైరుతి రుతుప‌వ‌నాల‌లో అనిశ్చితి నెల‌కొన‌డం, దాని కార‌ణంగా ఆహార ద్ర‌వ్యోల్బ‌ణం పెరిగే అవ‌కాశాలు ఉండ‌డం త‌దిత‌ర కార‌ణాలు దీనికి ప్ర‌ధాన కార‌ణం. ప్ర‌ధాన‌ ద్ర‌వ్యోల్బ‌ణ ఒత్తిళ్ల‌ను త‌గ్గించ‌డంలో ప్రోయాక్టివ్ సప్లై మేనేజ్ మెంట్ ముఖ్య‌పాత్ర‌ను పోషిస్తుంది. ఏడ‌వ వేత‌న క‌మిష‌న్ నివేదించిన ప్ర‌కారం, అల‌వెన్సుల‌ను అమ‌లు చేస్తే త‌లెత్తే స‌మ‌స్య‌లను ప‌రిష్క‌రించ‌డం ఒక పెద్ద స‌వాలు. ఏడ‌వ వేత‌న క‌మిష‌న్ సూచించిన‌ట్లుగా నివాస భ‌త్యం పెంచిన‌ట్లయితే, మొద‌ట CPI పై గ‌ణాంకాల ప్రభావం, ఆ త‌ర్వాత సెకెండ్-ఆర్డ‌ర్ కార‌ణాల వ‌ల్ల 12-18 నెల‌ల కాలంలో ఇది బేస్ లైన్ గ‌తిని 100-150 బేస్ పాయింట్ల మేర పైకి నెడుతుంద‌ని అంచ‌నా. GST యొక్క వ‌న్‌-ఆప్ ప్ర‌భావం నుంచి మ‌రో అప్-సైడ్ రిస్క్ ఉత్ప‌న్న‌మ‌య్యే అవ‌కాశం క‌నిపిస్తోంది. అంత‌ర్జాతీయంగా పోలిస్తే చాలా ఎక్కువ‌గా ఉండే సాధార‌ణ ప్ర‌భుత్వ లోటు, ద్ర‌వ్యోల్బ‌ణ దారిలో మ‌రో ప్ర‌మాదంగా క‌నిపిస్తోంది. పంట రుణాల‌ను ర‌ద్దు చేస్తే, ఇది మ‌రింత దిగ‌జారే అవ‌కాశ‌ముంది. ఇటీవ‌లి కాలంలో అంత‌ర్జాతీయ ప‌రిణామాలు, ప్ర‌తిద్ర‌వ్యోల్బ‌ణ రిస్కును సూచిస్తూ, దీని వ‌ల్ల వ‌స్తువుల ధ‌ర‌లు మ‌రింత పెరిగి, అది దేశంలో ద్ర‌వ్యోల్బ‌ణంగా మారే అవ‌కాశం క‌నిపిస్తోంది. అంతే కాకుండా, భౌగోళిక‌, రాజ‌కీయ ప‌రిస్థితులు కూడా అంత‌ర్జాతీయ మార్కెట్ల అనిశ్చితికి కార‌ణ‌మ‌య్యే అవ‌కాశ‌ముంది. డౌన్-సైడ్ ప‌రంగా చూస్తే, ఇటీవ‌లి కాలంలో అంత‌ర్జా‌తీయ క్రూడాయిల్ ధ‌ర‌లు తగ్గ‌డం మూలంగా, అవి దేశంలో పెట్రోలియం ఉత్ప‌త్తుల ధ‌ర‌లు త‌గ్గ‌డానికి కార‌ణ‌మై, త‌ద్వారా హెడ్-లైన్ ద్ర‌వ్యోల్బ‌ణ వ‌త్తిడిని త‌గ్గించే అవ‌కాశ‌ముంది. ఆహార ఉత్ప‌త్తులు రికార్డు స్థాయిలో పెర‌గ‌డంతో ధాన్య సేక‌ర‌ణ ప్ర‌య‌త్నాలు ఊపందుకోవ‌డంతో బ‌ఫ‌ర్ స్టాక్ పెరిగి, ఆహార వ‌స్తువుల ధ‌ర‌ల వ‌త్తిడిని త‌గ్గించే అవ‌కాశ‌ముంది.

23. రిస్కులు స‌మ‌తూకంతో ఉన్నందువ‌ల్ల‌, 2016-17లో 6.7 శాతం ఉన్న GVA అభివృద్ధి రేటు 2017-18లో 7.4 శాతం వ‌ద్ద బ‌లోపేత‌మ‌య్యే అవ‌కాశ‌ముంది (చిత్ర‌ప‌టం 2).

24. ఈ గ‌తిని స్థానికంగా అనేక అంశాలు వేగ‌వంతం చేసే అవ‌కాశాలున్నాయి. మొద‌ట‌, రీమానిటైజేష‌న్ ప్ర‌భావం వ‌ల్ల వినియోగ‌దారులు మ‌ళ్లీ స్వేచ్ఛ‌గా ఖ‌ర్చు చేస్తార‌ని భావించ‌డం జ‌రుగుతోంది. క్యాష్ ఇన్సెంటివ్ రిటైల్ వ్యాపారాలు, హోట‌ళ్లు, రెస్టారెంట్లు, ర‌వాణా, అసంఘ‌టిత రంగాల కార్య‌క‌లాపాలు చాలావ‌ర‌కు తిరిగి పూర్వ‌స్థితికి చేరుకున్నాయి. రెండోది, డీమానిటైజేష‌న్ త‌ద‌నంత‌ర కాలంలో గ‌త పాల‌సీరేటు త‌గ్గింపుల‌ను బ్యాంకులు రుణాలిచ్చే రేటుగా మార్చ‌డంలో విజ‌యం సాధించ‌డంతో అది సంస్థ‌ల ఖ‌ర్చును, పెట్టుబ‌డి డిమాండ్ ను పెంచే అవ‌కాశ‌ముంది. క్యాపిటల్ ఖర్చులకు ఊత‌మిచ్చే కేంద్ర బడ్జెట్ లోని వివిధ ప్రతిపాదనలు, గ్రామీణ డిమాండ్, సామాజిక భౌతిక మౌలిక స‌దుపాయాలు - ఇవ‌న్నీ క‌లిసి ఆర్థిక కార్య‌క‌లాపాల‌కు ఊత‌మిచ్చే అవ‌కాశ‌ముంది. నాలుగోది - GST అమ‌లులోకి వ‌స్తే జ‌రిగే సంస్థాగ‌త మార్పులు, దివాలా మ‌రియు రుణ‌గ్ర‌స్త‌త కోడ్ సంస్థ‌, విదేశీ పెట్టుబ‌డుల ప్రోత్సాహ‌క బోర్డు నిర్మూల‌న వంటివి ఇన్వెస్ట‌ర్ల న‌మ్మ‌కాన్ని పెంచి, లాభాల‌ను తీసుకురాగ‌ల‌వు. ఐదోది - ప్రైమ‌రీ క్యాపిట‌ల్ మార్కెట్లో ప్రాథ‌మిక ప‌బ్లిక్ ఆఫ‌రింగ్స్ పెర‌గ‌డం పెట్టుబడుల‌కు, అభివృద్ధికి చాలా మేలు.

25. అంత‌ర్జాతీయ ప‌రిణామాలు కుదుట ప‌డుతున్నాయి. అనేక సంస్థ‌లు 2017లో అంత‌ర్జాతీయ ఉత్పాద‌క‌త‌, వాణిజ్యం వేగం పుంజుకుంటుంద‌ని అంచ‌నా వేస్తున్నాయి. త‌ద‌నుగుణంగా అంత‌ర్జాతీయ డిమాండ్‌, జాతీయ అభివృద్ధి రేటును మెరుగుప‌రిచే అవ‌కాశ‌ముంది. అయితే- నైరుతి రుతుప‌వ‌నం ప్ర‌తికూలత‌, ఆదాయం కొర‌కు అన్వేషిస్తున్న‌వినియోగ‌దారులు ఖ‌ర్చులు త‌గ్గించుకోవ‌డం, సాధార‌ణ ఆర్థిక ప‌రిస్థితి, మార్చి, 2017 రిజ‌ర్వ్ బ్యాంక్ యొక్క క‌న్జూమ‌ర్ కాన్ఫిడెన్స్ స‌ర్వేలో ఉపాధి విష‌యంలో వెల్ల‌డించిన అంశాలు, క్రూడాయిల్ త‌ప్ప ఇత‌ర వ‌స్తువుల ధ‌ర‌లు మ‌రింత‌గా స్థిర‌ప‌డుతుండ‌డం – ఇవి డౌన్ సైడ్ రిస్కులు.

26. మొత్తంగా, MPC యొక్క డీమానిటైజేష‌న్ త‌ద‌నంర‌త ప‌రిణామాలు మెల్ల‌గా త‌గ్గిపోతాయ‌న్న అంచ‌నాలు స్థూలంగా నిజ‌మ‌ని తేలాయి. ఆ ప‌రిణామాలు ఇంకా ఉన్న‌ప్ప‌టికీ, అవి 2016-17 చివ‌రి త్రైమాసికానికి తొల‌గిపోతాయ‌ని భావించడం జ‌రుగుతోంది. ఇటీవ‌ల ద్ర‌వ్యోల్బ‌ణం కొంత పెరిగింద‌ని గుర్తించినప్ప‌టికీ, 2017-18లో దాని గ‌మ‌నం ఒడిదుడుకుల‌తో క‌నిపిస్తూ, అప్ సైడ్ రిస్కులు మ‌రియు అనుకూలంగా లేని బేస్ ఎఫెక్ట్ ల కార‌ణంగా ఏడాది రెండో అర్ధ‌భాగంలో స‌వాళ్లు ఎదుర‌వుతాయ‌ని భావిస్తున్నారు. అంతేకాకుండా, అంత‌ర్గ‌త ద్ర‌వ్యోల్బ‌ణ వ‌త్తిడులు ఇంకా కొన‌సాగుతున్నాయి, మ‌రీ ముఖ్యంగా సేవ‌ల ధ‌ర‌ల విష‌యంలో. డిమాండ్ ప‌రిస్థితులు మెరుగుప‌డుతుండ‌గా, ఉత్పాద‌క ఖ‌ర్చు ఒత్తిళ్లు క్ర‌మంగా ధ‌ర‌ల‌ను నిర్ణ‌యించే అధికారాన్ని ప‌రిశ్ర‌మ‌ల‌కు వ‌దిలివేస్తున్నాయి. ఒక క్ర‌మ‌బ‌ద్ధ‌మైన ప‌ద్ధ‌తిలో హెడ్ లైన్ ద్ర‌వ్యోల్బ‌ణాన్ని 4.0 శాతానికి ద‌గ్గ‌ర‌గా తీసుకొచ్చి దాన్ని స్థిరంగా ఉంచ‌డానికి MPC క‌ట్టుబ‌డి ఉంది. త‌ద‌నుగుణంగా ద్ర‌వ్యోల్బ‌ణ ప‌రిణామాల‌ను నిరంత‌రం ద‌గ్గ‌ర‌గా ప‌రిశీలిస్తూ ఉండాల్సిన అవ‌స‌ర‌ముంది. దీని వ‌ల్ల ఆహార ప‌దార్థాల ధ‌ర‌లు పెర‌గ‌కుండా ఉండి, ద్ర‌వ్యోల్బ‌ణ అంచ‌నాల‌ను స‌వ‌రించుకొనే వీలుంది. అదే స‌మ‌యంలో స‌గ‌టు డిమాండ్ వ‌త్తిళ్ళు పెరిగి, అది ద్రవ్యోల్బణ గ‌తిని ప్రభావితం చేసే అవకాశం ఉంది.

27. ఈ నేప‌థ్యంలో MPC ఈ స‌మీక్ష‌లో మ‌ధ్య‌స్థ దారిని కొన‌సాగిస్తూ పాల‌సీ రేటును య‌థాత‌థంగా ఉంచాల‌ని నిర్ణ‌యించింది. భ‌విష్యత్తు ద్ర‌వ్య విధానం ముందుముందు స్థూల ఆర్థిక ప‌రిస్థితులు ఏ విధంగా మార్పు చెందుతాయ‌న్న దాని మీద ఆధార‌ప‌డి ఉంటుంది. భ‌విష్య‌త్తులో చిన్న మొత్తాలు/అడ్మినిస్టర్డ్ రేట్ల‌తో పాటు పాల‌సీ ఇంప‌ల్స్ ల పూర్తి మార్పిడి జ‌రిగే అవ‌కాశం ఉన్న‌ప్ప‌టికీ, బ్యాంకులు త‌మ వ‌డ్డీ రేట్ల‌ను త‌గ్గించాయి. ఈ నేప‌థ్యంలోనే, స‌ర్‌ప్ల‌స్ లిక్విడిటీ క్ర‌మంగా త‌గ్గిపోతున్న‌ప్ప‌టికీ, లిక్విడిటీ మేనేజ్ మెంట్‌పై క్ర‌మంగా స్ప‌ష్ట‌త వ‌స్తోంది. రిజ‌ర్వ్ బ్యాంక్ ఒక‌వైపు లిక్విడిటీ ప‌రిస్థిత‌లను స‌మ‌తులీక‌రించ‌డం, ఒత్తిడిలో ఉన్న బ్యాంకుల ఆస్తుల‌ను స్థిరీక‌రించ‌డం, బ్యాంకు రుణాలు ‌మ‌రోసారి పుంజుకునే ప‌రిస్థితుల‌ను కల్పించడం, ఆర్థిక వ్య‌వ‌స్థ‌లోని ఉత్పాద‌క శ‌క్తులు పుంజుకోవ‌డం కోసం కృషి చేస్తోంది.

28. ద్ర‌వ్య విధాన నిర్ణ‌యానికి అనుకూలంగా ఆరుగురు ఓటు వేయ‌డం జ‌రిగింది. MPC స‌మావేశం యొక్క మినిట్స్ ను ఏప్రిల్ 20, 2017 నాటికి ప్ర‌చురించ‌డం జ‌రుగుతుంది.

29. MPC యొక్క త‌రువాతి స‌మావేశం జూన్ 6 మ‌రియు 7, 2017ల‌లో నిర్వ‌హించ‌బ‌డును.

పాల‌సీ రెపో రేటును ఎలాంటి మార్పు లేకుండా 6.25 వ‌ద్ద ఉంచాల‌న్న తీర్మానంపై జ‌రిగిన ఓటింగ్‌:

స‌భ్యులు ఓటు
డా. చేత‌న్‌ ఘాటే అవును
డా. పామి దువా అవును
డా. ర‌వీంద్ర హెచ్‌.ధోల‌కియా అవును
డా. మైఖేల్ దేబ‌బ్ర‌త పాత్ర అవును
డా. విర‌ల్ వి.ఆచార్య అవును
డా. ఉర్జిత్ ఆర్‌. ప‌టేల్ అవును

డా. చేత‌న్‌ ఘాటే ప్ర‌క‌ట‌న‌

30. కోర్ ద్ర‌వ్యోల్బ‌ణం (ఆహార‌ప‌దార్థాలు, ఇంధ‌నం కాకుండా ఇత‌ర CPI ద్ర‌వ్యోల్బ‌ణం) ఇంకా స‌మ‌స్య‌గానే ఉంది, ఇది +/-2 శాతం బ్యాండ్‌లో 4 శాతం ద్రవ్యోల్బణం సాధించాలన్న మధ్యకాలిక లక్ష్యం సాధించేందుకు అప్‌-సైడ్ రిస్కులు సృష్టించేలా క‌నిపిస్తోంది. డీమానిటైజేష‌న్ కాలంలో అప్పుడ‌ప్పుడూ త‌గ్గుముఖం ప‌ట్టినా, ఇత‌ర ఎక్స్‌క్లూజ‌న్ బేస్డ్ చ‌ర్య‌లు కూడా పెద్ద‌విగానే ఉన్నాయి. మీడియన్ కూడా 3 నెలలు, ఏడాది ముంద‌స్తు ద్రవ్యోల్బణ అంచనాలను మించి నెమ్మ‌దిగా పెరుగుతోంది. ఇటీవ‌లి కాలంలో ప్ర‌ధాన‌ ద్రవ్యోల్బణం త‌గ్గ‌డం పూర్తిగా ఆహార‌ప‌దార్థాల ద్రవ్యోల్బణం మీద ఆధార‌ప‌డి జ‌రిగింది. వేస‌వి నెల‌ల్లో ఈ ధోర‌ణి తిరుగుముఖం ప‌ట్టే అవ‌కాశ‌ముంది.

31. ఏడ‌వ పే క‌మిష‌న్ యొక్క HRA అమ‌లు ద్వారా ద్ర‌వ్యోల్బ‌ణ గ‌తికి ఒక బ‌ల‌మైన అప్‌-సైడ్ రిస్క్ క‌నిపిస్తోంది. ఈ క్రింది అంశాల దృష్ట్యా దీనిని జాగ్ర‌త్త‌గా గ‌మ‌నించాల్సి ఉంటుంది (i) కేంద్ర HRA ఏ మేర‌కు రాష్ట్ర HRA కు స‌రితూగుతోంది; మ‌రియు (ii) కేంద్ర‌, రాష్ట్ర HRA లు ఒకే స‌మ‌యం నుంచి అమ‌లులోకి వ‌స్తున్నాయా (దీనర్థం ద్ర‌వ్యోల్బ‌ణ ప్ర‌భావం మ‌రింత ఎక్కువ‌గా ఉంటుంది) లేదా వాటి అమ‌లు మ‌ధ్య కొంత విరామం ఉందా (ద్ర‌వ్యోల్బ‌ణ ప్ర‌భావం బ‌ల‌హీనంగా ఉంటుంది). HRA పెంపు ద్వారా క‌లిగే గ‌ణాంకాల ప్ర‌భావాల ప‌రిశీల‌న ద్వారా, రెండో రౌండ్ ప్ర‌భావాలు చాలా ఎక్కువ‌గా ఉండ‌వ‌చ్చు, HRA అమ‌లులోకి వ‌చ్చే విధానాన్ని బ‌ట్టి, ఏ మేర‌కు అమ‌లులోకి వ‌స్తుంద‌న్న దాన్ని బ‌ట్టి, ద్ర‌వ్య విధాన ప్ర‌తిస్పంద‌న అవ‌స‌రం కావ‌చ్చు. ఇలాంటి రిస్కుల నేప‌థ్యంలో మ‌ధ్య‌కాలిక ద్ర‌వ్యోల్బ‌ణ ల‌క్ష్యాన్ని చేరుకునేలా మ‌న దృష్టి అత్యంత సునిశితంగా ఉండాలి.

32. మ‌న చివ‌రి స‌మీక్ష నాటి నుంచి, సాఫ్ట్ డాటా (స‌ర్వేల మీద ఆధార‌ప‌డి) మ‌రియు హార్డ్ డాటా (వాస్త‌వ ప‌నితీరు మీద ఆధార‌ప‌డి) రెండింటి ఆధారంగా, వాస్త‌వ ఆర్థిక ప‌రిస్థితిపై డిమానిటైజేష‌న్ ప్ర‌భావం తాత్కాలిక‌మే అనేదానిపై మ‌రింత స్ప‌ష్ట‌త వ‌చ్చింది. ముఖ్యంగా, సేవ‌ల‌లో PMI కాంట్రాక్ష‌న్ మోడ్ నుంచి బ‌య‌ట‌ప‌డింది. ర‌బీ నాట్ల విష‌యంలో డీమానిటైజేష‌న్ ప్ర‌భావం చాలా తాత్కాలికంగా, త‌క్కువ‌గా ఉంది. రుతుప‌వ‌నాలు బాగా ఉండ‌డం, క‌నీస మ‌ద్ద‌తు ధ‌రను స‌రైన స‌మయంలో ప్ర‌క‌టించ‌డం దీనికి దోహ‌ద‌ప‌డ్డాయి. రియ‌ల్ ఎస్టేట్ రంగ లిస్టెడ్ కంపెనీల ప‌నితీరులో మెరుగుద‌ల క‌నిపించింది. డీమానిటైజేష‌న్ అనంత‌రం, కొన్ని చిన్న‌, సూక్ష్మ రంగాలు ఇంకా తీవ్ర ప్ర‌భావానికి లోన‌వుతున్న‌ప్ప‌టికీ, భారీ మ‌రియు మ‌ధ్య‌స్థాయి ప‌రిశ్ర‌మ‌లు డిమాండ్ విష‌యంలో చాలా వేగంగా కోలుకున్నాయి. స్థూలంగా, ఔట్ పుట్ అంత‌రం కొంత నెగిటివ్ గా ఉన్న‌ప్ప‌టికీ, క్ర‌మంగా త‌గ్గుతూ, ద్ర‌వ్యోల్బ‌ణ ఒత్తిళ్ల‌ను పెంచే దిశ‌గా సాగుతోంది.

33. నేను గ‌త స‌మీక్ష‌లో చెప్పిన‌ట్లుగా, యూఎస్ ఫెడ్ బ్యాలెన్స్ షీట్ హోల్డింగ్స్ నుంచి రీ-ఇన్వెస్ట్‌మెంట్ ఆఫ్ ప్రిన్సిప‌ల్ పేమెంట్స్ తొల‌గింపు యొక్క ఆఖ‌రు గ‌తిని జాగ్ర‌త్త‌గా గ‌మ‌నించాలి. అంతే కాదు, ఫెడ్ యొక్క ఈ బ్యాలెన్స్ షీట్ రిడ‌క్ష‌న్ మ‌రియు ఫెడ్ ఫండ్స్ రేటులో పెంపుద‌ల ఫైనాన్షియ‌ల్ మార్కెట్ల‌కు ఏ మేర‌కు ప్ర‌తికూలం అన్న‌ది కూడా గ‌మ‌నించాలి.

34. వీటిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటూ, నేటి ద్ర‌వ్య విధాన క‌మిటీ స‌మావేశంలో పాల‌సీ రెపో రేటును ఎలాంటి మార్పు లేకుండా 6.25 వ‌ద్దే ఉంచ‌డానికి నేను మ‌ద్ద‌తిస్తున్నాను.

డా. పామీ దువా ప్ర‌క‌ట‌న‌

35. అనేక అంశాలు మ‌న ఆర్థికరంగం నెమ్మ‌దిగా, సానుకూలంగా పురోగ‌మిస్తోంద‌ని సూచిస్తున్నాయి. రీమానిటైజేష‌న్ డ్రైవ్ చాలా బాగా కొన‌సాగుతోంది, ఈ ఏడాది మార్చి నాటికి స‌ర‌ఫ‌రాలో ఉన్న క‌రెన్సీ 75 శాతానికి చేరుకుంది, ఇది వివేక‌వంత‌మైన వ్య‌యానికి స‌హ‌క‌రించ‌నుంది. ద్ర‌వ్య వినిమ‌యం ఎక్కువ‌గా ఉండే హోట‌ళ్లు, రెస్టారెంట్లు, ర‌వాణా మ‌రియు అసంఘ‌టిత రంగాలలో కార్య‌క‌లాపాలు జోరందుకుంటున్నాయి. దీనికి తోడు, గ‌తంలో పాల‌సీ రేట్‌ల త‌గ్గింపు యొక్క ఆల‌స్య‌భ‌రిత ట్రాన్స్‌మిష‌న్ కార‌ణంగా బ్యాంకుల వ‌డ్డీ రేట్లలో త‌గ్గుద‌ల ఆర్థిక రంగానికి మేలు చేస్తూ, వినియోగాన్ని, పెట్టుబ‌డుల‌పై ఖ‌ర్చు చేయ‌డం పెంచే అవకాశ‌ముంది. కేంద్ర బ‌డ్జెట్ 2017-18లో సూచ‌న‌ప్రాయంగా వెల్ల‌డించిన అనేక అంశాలు గ్రామీణ ఆర్థిక వ్య‌వ‌స్థ‌, మౌలిక స‌దుపాయాలు, గృహ‌నిర్మాణంతో పాటు ఇత‌ర అనేక కీల‌క రంగాల‌లో అభివృద్ధికి అనుకూలంగా ఉంటూ, అవి ఇత‌ర అంశాల‌ను కూడా ప్ర‌భావితం చేసే అవ‌కాశం ఉంది. రిజ‌ర్వ్ బ్యాంక్ చేప‌ట్టిన మార్చి 2017 రౌండ్ పారిశ్రామిక దృక్ప‌థ స‌ర్వే కూడా కార్పొరేట్ రంగంలో సెంటిమెంట్ మెరుగైంద‌ని సూచిస్తోంది. బ‌య‌టి దేశాలప‌రంగా చూస్తే, అభివృద్ధి చెందిన మ‌రియు చెందుతున్న ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల్లో క‌నిపిస్తున్న సానుకూల అభివృద్ధి కార‌ణంగా భార‌త ఎగుమ‌తులు పెరిగే అవ‌కాశం ఉంది. జాతీయ‌, అంత‌ర్జాతీయ ఆర్థికాభివృద్ధి విష‌యంలో క‌నిపిస్తున్న ఈ సానుకూల దృక్ప‌థం, ఎక‌న‌మిక్ సైకిల్ రీసెర్చ్ ఇన్స్‌టిట్యూట్ (ECRI), న్యూయార్క్ యొక్క ప్ర‌ధాన సూచిక‌ల‌లో కూడా ప్ర‌తిఫ‌లించింది.

36. ద్ర‌వ్యోల్బ‌ణ‌ప‌రంగా, ఆహార ప‌దార్థాల ధ‌ర‌లు త‌క్కువ కావ‌డం, కూర‌గాయ‌ల ధ‌ర‌లు త‌గ్గ‌డం (ఇది బ‌హుశా డీమానిటైజేష‌న్ కార‌ణంగా త‌క్కువ ధ‌ర‌కు అమ్ముకోవ‌డం వ‌ల్ల క‌లిగింది కావ‌చ్చు) వ‌ల్ల‌ వినియోగ‌దారుల ధ‌ర‌ల సూచీలో ఎలాంటి ప్ర‌తికూల‌తా క‌నిపించ‌లేదు. అయితే కోర్ ద్ర‌వ్యోల్బ‌ణం (ఆహార ప‌దార్థాలు, ఇంధ‌నం కాకుండా) ఫిబ్ర‌వ‌రిలో కొంచెం త‌గ్గి 4.8కి చేరినప్ప‌టికీ, ఇంకా ఎక్కువ‌గానే ఉంటోంది. అదే స‌మ‌యంలో రీమానిటైజేష‌న్‌, గ్రామీణ ప్రాంతాల‌లో పెరుగుతున్న వేత‌నాలు, అవుట్ పుట్ అంత‌రాలు త‌గ్గ‌డం, ఏడో వేత‌న క‌మిష‌న్‌లో HRA పెంపు అమ‌లు, GST అమ‌లు, ఎల్ నినో ప‌రిస్థితుల ప్ర‌భావం, అంత‌ర్జాతీయ స‌రుకుల ధ‌ర‌లు పెర‌గ‌డం, క్రూడాయిల్ ధ‌ర‌ల‌లో అస్థిర‌త‌, ఎక్స్ఛేంజ్ రేట్‌లో అస్థిత‌ర‌- వీట‌న్నిటి కార‌ణంగా ద్ర‌వ్యోల్బ‌ణ అప్‌-సైడ్ రిస్కుల సూచ‌న‌లు ఇంకా క‌నిపిస్తూనే ఉన్నాయి. కుటుంబ ద్ర‌వ్యోల్బ అంచ‌నాల‌పై రిజ‌ర్వ్ బ్యాంక్ మార్చి 2017లో చేప‌ట్టిన స‌ర్వేలో 3-నెల‌ల మ‌రియు ఏడాది ముంద‌స్తు ద్ర‌వ్యోల్బ‌ణ అంచ‌నాలు కూడా పెరుగుద‌ల‌ను సూచిస్తున్నాయి. అంతే కాకుండా, దేశంలో ద్ర‌వ్యోల్బ‌ణాన్ని అంచ‌నా వేసే ECRI యొక్క భార‌తీయ భ‌విష్య‌త్ ద్ర‌వ్యోల్బ‌ణ సూచి, ద్ర‌వ్యోల్బ‌ణ ఒత్తిడుల‌లో కొంత స్థిర‌త్వం వ‌స్తుంద‌ని అంచ‌నా వేస్తోంది.

డా. ర‌వీంద్ర హెచ్‌. ధోల‌కియా ప్ర‌క‌ట‌న

37. డీమానిటైజేష‌న్‌ ప్ర‌భావం ఇప్ప‌టివ‌ర‌కు భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై తాత్కాలికంగాను, త‌క్కువ ప్ర‌భావం చూపేదిగా ఉంటూ, గ‌తంలో మేము చెప్పిన దాన్ని రుజువు చేశాయి. దేశీయంగా స్థూల ఆర్థిక‌రంగ ప‌నితీరు కొంత మెరుగుప‌డుతున్న‌ట్లు సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. అభివృద్ధి, వాణిజ్యం మ‌రియు ధ‌ర‌ల విష‌యంలో కూడా అంత‌ర్జాతీయ దృక్ప‌థం మెరుగ‌పడింది. ఇది భార‌తీయ ఎగుమ‌తులు మ‌రియు ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై ఒక సానుకూల ప్రభావాన్ని చూపే అవ‌కాశ‌ముంది. మాన్యుఫ్యాక్చ‌రింగ్ ప‌ర్చేజింగ్ మేనేజ‌ర్స్ ఇండెక్స్ (PMI) మ‌రియు రిజ‌ర్వ్ బ్యాంక్ స‌ర్వే రెండూ కూడా దేశం లోప‌ల, బ‌య‌ట కూడా సెంటిమెంట్లు మెరుగుప‌డుతున్న విష‌యాన్ని ధృవ‌ప‌రుస్తున్నాయి. అయితే ప‌రిశ్ర‌మ‌ల‌లో పూర్తి సామ‌ర్థ్య వినియోగం చాలా త‌క్కువ‌గా ఉంది. దీని వ‌ల్ల అవుట్ పుట్ అంతరం పెర‌గ‌కున్నా, కొన‌సాగుతుంద‌ని స్ప‌ష్టమ‌వుతోంది. దీనికి వ్య‌తిరేకంగా - కూర‌గాయలు, కాయ‌ధాన్యాల కార‌ణంగా, ప్ర‌ధాన‌ ద్ర‌వ్యోల్బ‌ణం 4 శాతం క‌న్నా త‌క్కువ‌గా ఉంది. అయితే ఆహార పదార్థాలు, ఇంధనం కాకుండా (కోర్ ద్రవ్యోల్బణం) ఇత‌ర ద్ర‌వ్యోల్బ‌ణం, ఫిబ్రవరిలో కొంచెం తగ్గి 4.8కి చేరినప్పటికీ. ఇంకా ఎక్కువగానే ఉంటోంది. జ‌న‌వ‌రి, 2017 నుంచి ఆర్థిక రంగంలో ఉన్న స‌ర్ ప్ల‌స్ లిక్విడిటీ క్ర‌మంగా రూ. 8 ట్రిలియ‌న్ల నుంచి మార్చి, 2017 నాటికి రూ.4.8 ట్రిలియ‌న్ల‌కు త‌గ్గింది.

38. నా అంచ‌నా ప్ర‌కారం, కోర్ ద్ర‌వ్యోల్బ‌ణం ఈ ఏడాది కొంచెం త‌గ్గుముఖం ప‌ట్టే అవ‌కాశ‌ముంది. అంతే కాకుండా, నాన్‌-కోర్ నుంచి కోర్ ద్ర‌వ్యోల్బ‌ణం వైపు మారుతున్న పాస్-త్రూ డైన‌మిక్స్ కార‌ణంగా ఆహార‌/ఇంధ‌న ధ‌ర‌ల‌లోని అస్థిర‌త్వం గ‌తంలో క‌న్నా సుల‌భంగా కోర్ లోనికి చొచ్చుకుపోయే అవ‌కాశ‌ముంది. నా ఉద్దేశం ప్ర‌కారం ఆయిల్ ధ‌ర‌లు ఎక్కువ కాలం పైనే ఉంటాయ‌ని అనుకోను. కేంద్రం యొక్క 7వ వేత‌న క‌మిష‌న్ మ‌రియు అన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప్ర‌తిపాదించిన ఇంటి అద్దె భ‌త్యాన్ని ఒకేసారి అమ‌లు చేయ‌డం వీలు కాక‌పోవ‌చ్చు. త‌ద‌నుగుణంగా, 2017-18లో ద్ర‌వ్యోల్బ‌ణంపై దాని ప్ర‌భావం 1 నుంచి 1.5 శాతం పాయింట్ల‌క‌న్నా ఎక్కువ ఉండే అవకాశం లేదు. జులై-ఆగ‌స్ట్ మ‌ధ్య కాలంలో ఎల్ నినో పెరిగే అవ‌కాశాలుండ‌డంతో ఇది ఆహార ధాన్యాల ఉత్ప‌త్తిపై తీవ్ర ప్ర‌భావాన్ని చూపే అవ‌కాశ‌మున్నా, త‌గినంత బ‌ఫ‌ర్ స్టాకు ఉన్న కార‌ణంగా అది ఆహార ప‌దార్థాల ధ‌ర‌ల‌పై ప్ర‌భావం చూపే అవ‌కాశం లేదు. బ‌హుళ‌-స్థాయి రేట్ వ్య‌వ‌స్థ కార‌ణంగా GST అమ‌లు ప్ర‌ధాన‌ ద్ర‌వ్యోల్బ‌ణంపై పెద్ద‌గా ప్ర‌భావం చూపే అవ‌కాశం లేదు.

39. వీట‌న్నిటి ఫ‌లితంగా, నా అంచ‌నా ప్ర‌కారం, ద్ర‌వ్యోల్బ‌ణ అంచ‌నా 2017-18 మొద‌టి అర్ధ‌భాగానికి సుమారు 4 శాతం, రెండో అర్ధ‌భాగానికి 4.5 శాతం ఉండే అవ‌కాశ‌ముంది. వ్య‌వ‌స్థ‌లో ఇంకా స‌ర్ ప్ల‌స్ లిక్విడిటీ ఉన్న నేప‌థ్యంలో, ప్ర‌స్తుత ప‌రిస్థితిలో పాల‌సీ రేట్ల‌లో మార్పు చేయ‌డం వాంఛ‌నీయం కాదు. త‌ట‌స్థ విధానానికి అనుగుణంగా లిక్విడిటీ ప‌రిస్థితి త్వ‌ర‌లో సాధార‌ణ స్థాయికి చేరుకునే అవ‌కాశ‌ముంది.

డా.మైఖేల్ దేబబ్రత పాత్ర ప్ర‌క‌ట‌న

40. క‌మిటీ చివ‌రి స‌మావేశంలో వేసిన అంచ‌నాల‌కు అనుగుణంగా, ద్ర‌వ్యోల్బ‌ణం పెరుగుతోంది. ఇది డీమానిటైజేష‌న్ ఫ‌లితంగా వ‌చ్చిన U- ఆకార‌పు కంప్రెష‌న్ లోంచి బ‌య‌ట‌ప‌డి, ప్ర‌స్తుతం పైకి పాకుతున్న వాలు మీద‌కు చేరింది. అనేక అంశాలు ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రాన్ని నొక్కి చెబుతున్నాయి.

41. మొదట, డీమానిటైజేషన్ కు ముందుగా, ఆగస్టులో సబ్-4 శాతం త‌గ్గుద‌ల‌కు దారి తీసిన ప్రతిద్రవ్యోల్బణానికి కార‌ణ‌మైన‌ట్లుగానే, ఫిబ్రవరిలో ప్ర‌ధాన‌ ద్రవ్యోల్బణాన్ని పెంచింది ఆహారమే. గతంలోలాగా అది కూరగాయలు కాదు - కాయధాన్యాలు కాకుండా ప్రొటీన్ ఎక్కువగా కలిగిన ఇతర పదార్థాలు; తృణధాన్యాలు, చక్కెర. ఈ పై వాటి్కి ద్రవ్యోల్బణం తోడైనప్పుడు, అది పెరుగుతుందని మన అనుభవం చెబుతోంది.

42. రెండోది - ఆహారం, ఇంధ‌నం త‌ప్ప మిగిలిన వాటిల్లో ద్ర‌వ్యోల్బ‌ణం త‌గ్గడం లేదు. కేవ‌లం ఫిబ్ర‌వ‌రి సూచిక‌ల‌లో మాత్ర‌మే అది కొంచెం కిందికి దిగిన‌ట్లు క‌నిపిస్తోంది. కానీ అది అక్క‌డ స్థిర‌ప‌డుతుందా? స‌్థిర‌ప‌డుతుంద‌ని నేన‌నుకోను. అది అన్నిటికీ వ‌ర్తించ‌దు, కొన్ని నిర్ధిష్ట అంశాల‌కు మాత్ర‌మే వ‌ర్తించేది. సిబ్బంది యొక్క అంచ‌నాలు నిజ‌మైతే, ఆహారం, ఇంధ‌నం త‌ప్ప మిగిలిన వాటిల్లో ద్ర‌వ్యోల్బ‌ణం 2017-18 అంతా ప్ర‌ధాన‌ ద్ర‌వ్యోల్బ‌ణాన్ని దాటిపోయే అవ‌కాశ‌ముంది.

43. ఈ ముఖ్య‌మైన ధ‌ర‌ల స్థిరీక‌ర‌ణ‌ త‌ద‌నంత‌ర ప‌రిణామాల కార‌ణంగా ద్ర‌వ్యోల్బ‌ణం అంచ‌నాలు తిరుగుముఖం ప‌ట్టి, స్థిర‌ప‌డ్డాయి. అది కేవ‌లం స‌మీప కాలంలోనే కాకుండా, మొత్తం ఏడాదంతా మరియు అన్ని ఉత్ప‌త్తి బృందాల విష‌యంలోను. ధ‌ర‌ల విష‌యంలో వినియోగ‌దారుల విశ్వాసం త‌గ్గింది. ధ‌ర‌ల‌ను నిర్ణ‌యించే అధికారాన్ని సంస్థ‌లు తిరిగి త‌మ ఆధీనంలోకి తెచ్చుకుంటున్నాయి.

44. డీమానిటైజేష‌న్ నిజానికి సామ‌ర్థ్యాన్ని కాకుండా ఉత్పాద‌క‌త‌ను ప్ర‌భావితం చేసింద‌ని హై ఫ్రీక్వెన్సీ సూచిక‌లు సూచిస్తుండ‌వ‌చ్చు. అందువ‌ల్ల రీమానిటైజేష‌న్ ఫ‌లితంగా, ఔట్ పుట్ అంత‌రం అనుకున్న‌దానిక‌న్నా ముందుగానే త‌గ్గ‌వ‌చ్చు - అనేక ప‌రిశ్ర‌మ‌ల‌లో పూర్తి సామ‌ర్థ్యాన్ని ఉప‌యోగించుకోక‌పోవ‌డం వ‌ల్ల‌ బ‌హుశా అది అనుకున్న‌దానిక‌న్నా కింది స్థాయికి త‌గ్గ‌వ‌చ్చు. రాబోయే నెల‌ల్లో డిమాండ్ వ‌త్తిళ్లు ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనాల్సి రావ‌చ్చు.

45. ఈ ప‌రిస్థితుల‌ను బ‌ట్టి చూస్తే, ద్ర‌వ్యోల్బ‌ణ ప‌రిస్థితుల క్రింద కొంత వేగం పుంజుకుంటోంద‌ని నాక‌నిపిస్తోంది, ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌లో ఇది స‌రైన‌ది కూడా. 2017-18 రెండో అర్ధ‌భాగంలో అనుకూల‌మైన బేస్ ఎఫెక్స్ త‌గ్గి, మార‌డానికి నిరాక‌రిస్తున్న‌ ద్ర‌వ్యోల్బ‌ణానికి తోడు ఆహార ద్రవ్యోల్బ‌ణం పెరిగితే అది పెద్ద తుఫానుగా మార‌వ‌చ్చు.

46. ద్ర‌వ్యోల్బ‌ణం గురించి ఇవీ నా అంచ‌నాలు. ఇక ఖ‌ర్చుల విష‌యానికి వ‌ద్దాం.

47. ఖర్చులకు ముఖ్యమైన ప్రేరకం 7వ వేతన కమిషన్ యొక్క నివాస భత్యం నుంచి ఉత్పన్నమవుతుంది. CPI మీద ఫస్ట్ ఆర్డర్ గణాంకాల ప్రభావం ప్ర‌ధాన ‌ద్రవ్యోల్బణాన్ని అప్పర్ టాలరెన్స్ బ్యాండ్ దగ్గరకు లేదా దాన్ని దాటి కూడా తీసుకెళ్లవచచ్చు. సెకెండ్ ఆర్డర్ ప్రభావాలు రాష్ట్రాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, యూనివర్సిటీలు, ఆ ముందుకు విస్తరించి, అంచనాలు మరియు ‘డ్యూసెన్ బెర్రీ’ ప్రభావం గుండా పని చేస్తాయి. ఈ సెకెండ్ ఆర్డర్ ప్రభావాలు మొదటి ఆర్డర్ ప్రభావాల పైన‌ పని చేసి, 6 శాతం ద్రవ్యోల్బణం మరికొంత కాలం అక్కడే కొనసాగవచ్చు.

48. రెండోది GST యొక్క వ‌న్-ఆఫ్ ప్ర‌భావం - 7వ వేత‌న క‌మిష‌న్‌తో పోలిస్తే ఇది చిన్న‌ది, స్వ‌ల్ప కాలికం. అయినా, ఇది ఒక ఏడాది పాటు కొన‌సాగి, ద్ర‌వ్యోల్బ‌ణాన్ని పైకి నెట్ట‌వ‌చ్చు.

49. మూడోది - అనేక నియంత్రిత ధ‌ర‌ల అంశాలు - పాలు; గ‌్యాస్‌; కిరోసిన్‌, ఎప్ప‌టిలాగే క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర పై దిశ‌గా స‌ర్దుబాటు చేయ‌బ‌డుతున్నాయి; అవి త‌మ‌దైన శైలిలో ప్ర‌ధాన‌ ద్ర‌వ్యోల్బ‌ణంపై త‌మ ప్ర‌భావాన్ని చూపుతాయి.

50. చివ‌రిగా, న‌న్ను గ‌దిలోని ఏనుగును గురించి ప్ర‌స్తావించ‌నివ్వండి. ఏనుగులు ఎప్పుడు కొట్టుకున్నా లేదా ఆటాడుకున్నా, న‌లిగిపోయేది మాత్రం కింద ఉన్న గ‌డ్డే.

51. నైరుతి రుతుప‌వ‌నాలు ద‌గ్గ‌ర‌గా ఉన్నాయి. ఎల్ నినో ప్ర‌భావం పెరిగి, 2009లో జ‌రిగిన‌ట్లుగా రుతుప‌వ‌నాల ప్ర‌భావం స‌రిగా లేక ఆహార ద్ర‌వ్యోల్బ‌ణం దానిలో చిక్కుకుంటే, సెకెండ్ ఆర్డ‌ర్ ఎఫెక్ట్స్ త‌ప్ప‌వు.

52. రెండోది దిగుమ‌తి చేసుకున్న ద్ర‌వ్యోల్బ‌ణం. దీనిలో ఫైనాన్షియ‌ల్ మార్కెట్ ఒడిదుడుకులు, పెరుగుతున్న ర‌క్ష‌ణాత్మ‌క ధోర‌ణి రెండూ మిళిత‌మై ఉంటాయి.

53. మూడోది అంత‌ర్జాతీయ ద్ర‌వ్యోల్బ‌ణం - అభివృద్ధి చెందిన ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల‌లో క్ర‌మంగా వేడి పెరుగుతోంది. భార‌త్ కూడా దీనికి మిన‌హాయింపు కాదు. ఈ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల‌లో ద్ర‌వ్య విధానం సాధార‌ణ స్థితికి చేరుకోవ‌డం ప్రారంభించింది, ఇది కేవ‌లం పాల‌సీ రేట్ల‌ను/స‌్వ‌ల్ప‌కాలిక రేట్ల‌ను పెంచ‌డం కాదు. పెరిగిన బ్యాలెన్స్ షీట్ల‌ను సాధార‌ణ స్థితికి తీసుకురావ‌డం దీర్ఘ‌కాలిక రేట్ల‌ను కూడా క‌ఠిన‌త‌రం చేయ‌డానికి దారి తీయ‌వ‌చ్చు.

54. మొత్తంగా చెప్పాలంటే, పాల‌సీ రేట్ల‌ను ముంద‌స్తుగా 25 బేసిస్ పాయింట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల క‌మిటీ గ‌తంలో స్ప‌ష్టంగా క‌ట్టుబ‌డిన 4 శాతం ల‌క్ష్యాన్ని చేరుకోవ‌డం సాధ్య‌ప‌డుతుంద‌ని నేను విశ్వ‌సిస్తున్నాను. దీని వ‌ల్ల భ‌విష్య‌త్తులో ద్ర‌వ్యోల్బ‌ణం అంగీక‌రించ‌లేని పైస్థాయికి చేరిన‌పుడు లేదా చుట్టుముట్ట‌బ‌డిన‌పుడు బ్యాక్-లోడెడ్ పాల‌సీ చ‌ర్య‌లు తీసుకోవడాన్ని అరిక‌ట్ట‌వ‌చ్చు. మిగతా విషయాలలో నేను ఈ ద్వైమాసిక సమావేశంలో పాలసీ రేటును ఎలాంటి మార్పు లేకుండా ఉండడానికే ఓటు వేస్తాను. మరికొంత ఇన్ కమింగ్ డాటా కోసం వేచి చూసి, దాని వల్ల కొన్ని తాత్కాలిక స‌మ‌స్య‌లు గడిచిపోయి దేశం లోపల, బయటా స్థూల ఆర్థిక పరిస్థితులపై ఒక స్పష్టమైన అంచనా వస్తుందని భావిస్తున్నాను.

డా. విర‌ల్ వి. ఆచార్య ప్ర‌క‌ట‌న‌

55. ఇటీవలి కాలంలో ఆహార ద్రవ్యోల్బణంలో, మరీ ముఖ్యంగా కూరగాయలలో, అంచనా వేసిన (గ‌త నెల‌లో నిజ‌మని తేలిన) మీన్-రివర్షన్ కారణంగా ప్రధాన ద్రవ్యోల్బణం అతి తక్కువ స్థాయి నుంచి తిరిగి పుంజుకోనుంది. అంత‌ర్జాతీయ ద్ర‌వ్యోల్బ‌ణ ధోర‌ణులు కూడా అప్‌-సైడ్‌లోనే కొన‌సాగుతున్నాయి. ప్ర‌స్తుతం ఆహార‌, ఇంధ‌నం కాకుండా ఇత‌ర ద్ర‌వ్యోల్బ‌ణం మొండిగా ల‌క్ష్యంక‌న్నా ఎక్కువ‌గా కొన‌సాగుతున్న నేప‌థ్యంలో, ప్రధాన ద్ర‌వ్యోల్బ‌ణం ఎప్పుడు నిర్దేశిత లక్ష్యం 4 శాతాన్ని దాటి, పెరుగుతూనే ఉంటుంద‌న్న దానిపై కొంత అనిశ్చితి నెల‌కొంది. ఈ తీర్మానంలో మ‌నం అనేక అప్‌-సైడ్ రిస్కుల‌ను చ‌ర్చ‌కు పెట్ట‌డం జ‌రిగింది. వాటిలో కొన్ని భౌగోళిక‌రాజ‌కీయ రిస్కులు, కేంద్రం యొక్క ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణ‌ను కొన్ని రాష్ట్రాలు ప‌క్క‌న పెడ‌తాయేమోన‌న్న సందేహాలు నాకు పెద్ద స‌మ‌స్య‌లుగా క‌నిపిస్తున్నాయి. స‌రుకుల ధ‌ర‌లు, మ‌రీ ముఖ్యంగా క్రూడాయిల్ చాలా అస్థిరంగా ఉంది. అదే విధంగా ఎక్స్ఛేంజ్ రేటు కూడా. అందువ‌ల్ల ద్ర‌వ్యోల్బ‌ణ దృక్ప‌థం చుట్టూ రిస్కులు స‌మతూకంతో ఉన్నాయి.

56. అభివృద్ధి రేటు విష‌యంలో, రీమానిటైజేష‌న్ వేగంగా సాగుతోంది, కొద్దికాలంపాటు స్థ‌బ్దుగా ఉన్న ఆర్థిక వ్య‌వ‌స్థ‌లోని అనేక రంగాలు క్ర‌మంగా కోలుకుంటున్నాయి. అయితే ఈ రిక‌వ‌రీ ఒడిదుడుకుల‌తో ఉన్న‌ట్లు సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. వ‌త్తిడిలో ఉన్న అనేక రంగాల‌లో భారీ రుణ‌గ్ర‌స్త‌త అన్న‌ది ఒక బ‌ల‌హీన‌త‌గా క‌నిపిస్తోంది. ఆదాయం, ఖ‌ర్చులు, ఉపాధిపై కుటుంబాల అంచ‌నాలు బ‌ల‌హీన‌ప‌డిన‌ట్లు క‌నిపిస్తోంది. అవి గ‌త కొన్ని నెల‌ల ప‌రిణామాల మీద ఆధార‌ప‌డిన‌వి కనుక, రాబోయే నెల‌ల్లో వాటిని స‌రైన ప‌ట్టాల‌పైకి తీసుకురావాల్సి ఉంటుంది. ఆర్థిక వ్య‌వ‌స్థ‌లోని ఇత‌ర అంశాలు వ‌చ్చే ఏడాదిలో వృద్ధి విష‌యంలో ఒక సంతృప్తిక‌ర‌మైన ధోర‌ణుల‌ను సూచిస్తున్నాయి, ఎగుమ‌తుల రంగం ఒడిదుడుకుల‌ను త‌ట్టుకునేంత ప‌టిష్టంగా ఉంది.

57. ఇలాంటి ప‌రిస్థితుల‌లో, ద్ర‌వ్యోల్బ‌ణ ల‌క్ష్యం క‌లిగిన సెంట్ర‌ల్ బ్యాంక్ త‌గ్గుతున్న ఔట్‌-పుట్ గ్యాప్ కు ప్ర‌తిస్పందించాల్సిన అవ‌స‌రం ఉందా? రిస్కులు స‌మ‌తూకంగా ఉండ‌డం, అప‌రిమిత‌మైన అనిశ్చితి ప‌రిశీలించిన అనంత‌రం, ప్ర‌స్తుతానికి త‌ట‌స్థ విధానాన్నే కొన‌సాగించడం వైపే నేను మొగ్గు చూపుతాను. ఇంకా ప‌రిష్క‌రించాల్సిన స‌మ‌స్య‌లు అనేకం ఉన్నాయి. మ‌రీ ముఖ్యంగా (i) బ్యాంకుల స్ట్రెస్డ్ అసెట్స్ ను, బ‌ల‌హీన‌మైన బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ల‌ను స‌రిదిద్ద‌డం; (ii) డీమానిటైజేషన్ తదనంతరం స్వల్పకాలిక మనీ మార్కెట్ రేట్లను పాలసీ రేట్లకు దూరంగా పెడుతున్న సర్ ప్ల‌స్ లిక్విడిటీని ఒక క్ర‌మ‌బ‌ద్ధ‌మైన‌ మార్గంలో తగ్గించడం. మ‌రియు (iii) కార్పొరేట్ బాండ్ మార్కెట్ లో లిక్విడిటీని పెంచ‌డం, ఫైనాన్షియ‌ల్ హెడ్జింగ్ ఆప్ష‌న్స్ ల‌భ్య‌త‌ను మెరుగుప‌ర‌చ‌డం ద్వారా, మ‌న క్యాపిట‌ల్ మార్కెట్లలోని సామ‌ర్థ్యాన్ని బ‌హిర్గ‌తప‌ర‌చ‌డం. ఈ అంశాల‌పై దృష్టి సారించ‌డానికి ఇదే స‌రైన‌ స‌మ‌య‌మ‌ని భావిస్తున్నాను.

డా. ఉర్జిత్ ఆర్‌.ప‌టేల్ ప్ర‌క‌ట‌న‌

58. జ‌న‌వ‌రి, 2017లో చ‌రిత్ర‌లోనే అత్యంత క‌నిష్ట‌స్థాయికి చేరిన అనంత‌రం, అనుకున్న విధంగా CPI ద్ర‌వ్యోల్బ‌ణం కొంచెం పెరిగింది. అయితే, అన్ని సంభావ్య‌త‌ల దృష్ట్యా, 2016-17 నాలుగో త్రైమాసికానికి నిర్దేశించుకున్న 5 శాతం ల‌క్ష్యంక‌న్నా ద్య‌వ్యోల్బ‌ణం కొద్దిగా త‌గ్గుతుంది. నవంబ‌ర‌, 2016 నుంచి జ‌న‌వరి, 2017 వ‌ర‌కు వేగంగా త‌గ్గిపోయిన కూర‌గాయ‌ల ధ‌ర‌లు, స్థిర‌ప‌డిన‌ట్లు క‌నిపిస్తున్నప్ప‌టికీ, కాలానుగుణ పెరుగుద‌ల‌ లేని కార‌ణంగా, రాబోయే నెల‌ల్లో మ‌ళ్లీ పెరిగే అవ‌కాశం ఉంది. ఆహారం, ఇంధ‌నం త‌ప్ప మిగ‌తా ద్ర‌వ్యోల్బ‌ణం ఉన్న‌ చోటి నుంచి క‌దలడం లేదు, మ‌రీ ముఖ్యంగా సేవ‌ల విష‌యంలో. అంతే కాకుండా, CPI అస్థిత‌ర‌ను బట్టి అది ఎలా మారుతుంద‌న్న‌ది అంచ‌నా వేయ‌డం క‌ష్ట‌మ‌వుతోంది. ద్ర‌వ్యోల్బ‌ణ దృక్ప‌థం ఇంకా ఇత‌ర అనేక రిస్కులు ఎదుర్కొంటోంది. ఉత్పాద‌క ఖ‌ర్చులు పెరిగిపోతున్నాయి. దీనివ‌ల్ల డిమాండ్ పెరిగే కొద్దీ దానిని ఉత్పాద‌న ధ‌ర‌ల‌పైకి బ‌దిలీ చేసే అవ‌కాశ‌ముంది. దీనికి తోడు 7వ వేత‌న క‌మిష‌న్ ప్ర‌తిపాద‌న‌ల్లో భాగంగా, HRA అమ‌లు మ‌రియు GST లాంటి రిస్కులు 2017-18లో ద్ర‌వ్యోల్బ‌ణ అంచ‌నాల‌ను మార్చేసే అవ‌కాశ‌ముంది. ఇటీవ‌ల క్రూడాయిల్ ధ‌ర‌ల గ‌తి విష‌యంలో నెల‌కొన్న అనిశ్చితి కార‌ణంగా అది ఎటైనా మారే అవ‌కాశ‌ముంది. పెరిగిన భౌగోళిక‌-రాజ‌కీయ ఉద్రిక్త‌త‌ల వ‌ల్ల‌ అంత‌ర్జాతీయ మార్కెట్ల‌లో ఆర్థిక అస్థిర‌త్వం క‌నిపిస్తోంది.

59. CSO ఇటీవ‌ల విడుద‌ల చేసిన గ‌ణాంకాలు ఆర్థిక కార్య‌క‌లాపాల‌పై డీమానిటైజేష‌న్ ప్ర‌భావం చాలా కొద్దిగానే ఉంద‌ని తెలియ‌జేస్తోంది. ప్ర‌స్తుతం రుతుప‌వ‌నాల విష‌యంలో కొంత అనిశ్చితి నెల‌కొన్నా, 2017-18లో ఆర్థిక కార్య‌క‌లాపాలు పుంజుకునే అవకాశం ఉంది. అనేక లీడ్ ఇండికేటర్లు, ఆర్థిక దృక్ప‌థంలో కొంత మెరుగు క‌నిపిస్తోంద‌ని సూచిస్తున్నాయి. రిజ‌ర్వ్ బ్యాంక్ యొక్క పారిశ్రామిక దృక్ప‌థ స‌ర్వే ఉత్ప‌త్తి రంగం పుంజుకునే అవ‌కాశం ఉంద‌ని తెలియ‌జేస్తోంది. పెట్టుబ‌డి కార్య‌క‌లాపాలు కొంచెం బ‌ల‌హీనంగా ఉన్నా, ప‌రిశ్ర‌మ‌ల్లో ఇంకా వినిపోయోగించుకోని వ‌న‌రులు ఇంకా చాలా ఉన్న‌ కార‌ణంగా ఇది పెద్ద‌గా ఆశ్చ‌ర్యం క‌లిగించేదేమీ కాదు (రిజ‌ర్వ్ బ్యాంక్ స‌ర్వేలు).

60. డీమానిటైజేష‌న్ కార‌ణంగా ఉత్ప‌న్న‌మైన లిక్విడిటీ వేగ‌వంత‌మైన ద్య‌వ్య స‌ర‌ఫ‌రాకు అవ‌కాశం క‌ల్పించింది. బ్యాంకులు త‌మ వ‌డ్డీ రేట్ల‌ను త‌గ్గించ‌డానికి ఇంకా అవ‌కాశ‌ముంది. స‌మ‌ర్థ‌మైన లావాదేవీల కొర‌కు, చిన్న మొత్తాల‌పై వ‌డ్డీ రేట్లు ఆర్థిక వ్య‌వ‌స్థ‌లోని ఇత‌ర పోల్చ‌ద‌గిన సంస్థ‌ల‌కు అనుగుణంగా ఉండాల్సిన అవ‌స‌ర‌ముంది.

61. రాబోయే కొన్ని నెలల్లో అనుకూలమైన బేస్ ఎఫెక్ట్స్ పక్కనబెడితే, మధ్యకాలిక ద్రవ్యోల్బణ గతి కూడా ప్ర‌ధాన ద్ర‌వ్యోల్బ‌ణాన్ని ఒక దీర్షకాలిక లక్ష్యంతో, ఒక క్రమబద్ధమైన విధానంలో 4 శాతానికి దగ్గరగా తీసుకురావాలన్న లక్ష్యానికి అనుగుణంగా ఉండేట్లుగా చూసేందుకు మ‌నం ద్రవ్యోల్బణ దృక్పథంపై సునిశిత దృష్టిని కలిగి ఉండాల్సిన అవసరముంది. అందువ‌ల్ల పాల‌సీ రెపో రేటు ప‌రంగాను మ‌రియు విధాన‌ప‌రంగాను నేను ప్ర‌స్తుత ప‌రిస్థితి కొన‌సాగింపుకు ఓటు వేస్తున్నాను.

అజిత్ ప్ర‌సాద్‌
సహాయ సలహాదారు

ప్రెస్ రిలీజ్: 2016-2017/2844

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?