<font face="mangal" size="3">కార్డులు / వాలెట్లు / మొబైల్ పరికరాలను ఉపయోగి - ఆర్‌బిఐ - Reserve Bank of India
కార్డులు / వాలెట్లు / మొబైల్ పరికరాలను ఉపయోగించి ఆఫ్‌లైన్ రిటైల్ చెల్లింపులు - పైలట్
ఆర్‌బిఐ/2020-21/22 ఆగస్టు 06, 2020 అధ్యక్షుడు/కార్యపాలక నిర్దేశకుడు/ముఖ్య కార్య నిర్వహణ అధికారి మేడమ్/ప్రియమైన సర్, కార్డులు / వాలెట్లు / మొబైల్ పరికరాలను ఉపయోగించి ఆఫ్‌లైన్ రిటైల్ చెల్లింపులు - పైలట్ ఆగష్టు 06, 2020 నాటి ద్రవ్య విధాన ప్రకటనలో భాగంగా జారీ చేసిన అభివృద్ధి మరియు నియంత్రణ విధానాలపై ప్రకటనను చూడండి, ఇందులో ఆఫ్‌లైన్ మోడ్‌లో చిన్న విలువ చెల్లింపుల కోసం పైలట్ పథకాన్ని అనుమతించాలని, రిజర్వ్ బ్యాంక్ చేత ప్రతిపాదించబడింది. 2. కాలానుగతంగా, డిజిటల్ చెల్లింపుల కోసం అదనపు కారకం యొక్క ప్రామాణీకరణ అవసరం మరియు ప్రతి లావాదేవీకి ఆన్‌లైన్ హెచ్చరికలు వంటి భద్రతా చర్యలకు రిజర్వ్ బ్యాంక్ ప్రాధాన్యత ఇచ్చింది. ఈ చర్యలు ఖాతాదారుల విశ్వాసం మరియు భద్రతను గణనీయంగా పెంచాయి, ఇది డిజిటల్ చెల్లింపుల స్వీకరణలో పెంపుదలకు దారితీసింది. 3. ముఖ్యంగా మారుమూల ప్రాంతాలలో అంతర్జాల సంధాయకత (ఇంటర్నెట్ కనెక్టివిటీ) లేకపోవడం లేదా లోపభూయిష్ట సంధాయకత, డిజిటల్ చెల్లింపులను స్వీకరించడానికి ప్రధాన అవరోధంగా ఉంది. కార్డులు, వాలెట్లు లేదా మొబైల్ పరికరాల లభ్యత మరియు ఉపయోగించడం, ఆఫ్‌లైన్ డిజిటల్ చెల్లింపుల స్వీకరణను పెంచుతుంది. 4. ఆఫ్‌లైన్ డిజిటల్ లావాదేవీలను ప్రారంభించే సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి, పరిమిత కాలానికి పైలట్ పథకాన్ని నిర్వహించడానికి రిజర్వ్ బ్యాంక్ అనుమతిస్తుంది. పైలట్ పథకం క్రింద, అధీకృత చెల్లింపు వ్యవస్థ నిర్వాహకులు (పిఎస్ఓలు) - బ్యాంకులు మరియు నాన్-బ్యాంకులు - సుదూర (రిమోట్) లేదా సామీప్య చెల్లింపుల కోసం కార్డులు, వాలెట్లు లేదా మొబైల్ పరికరాలను ఉపయోగించి ఆఫ్‌లైన్ చెల్లింపు పరిష్కారాలను అందించగలవు. ఈ పథకం అనుబంధంలో వివరించిన షరతులకు లోబడి ఉంటుంది. వినూత్న పరిష్కారాలను కలిగి ఉన్న ఇతర సంస్థలు అధీకృత పిఎస్ఓలతో జతకట్టాలి. 5. పైలట్ పథకం మార్చి 31, 2021 వరకు మాత్రమే చేపట్టబడుతుంది. పైలట్ క్రింద పొందిన అనుభవం ఆధారంగా అటువంటి వ్యవస్థను లాంఛన ప్రాయం చేయడం గురించి రిజర్వ్ బ్యాంక్ నిర్ణయిస్తుంది. 6. చెల్లింపు మరియు సెటిల్మెంట్ సిస్టమ్స్ చట్టం, 2007 లోని సెక్షన్ 18 (చట్టం 51 of 2007) తో కలిపి, సెక్షన్ 10 (2) క్రింద ఈ ఆదేశం జారీ చేయబడినది. మీ విధేయులు, (పి. వాసుదేవన్) జతపర్చినవి: పైన పేర్కొన్న విధంగా ఆగస్టు 06, 2020 నాటి DPSS.CO.PD.No.115/02.14.003/2020-21 పైలట్ పథకం క్రింద, చెల్లింపు వ్యవస్థ నిర్వాహకులు (పిఎస్ఓ) - బ్యాంకులు మరియు నాన్-బ్యాంకులు - డిజిటల్ చెల్లింపులను ఆఫ్‌లైన్‌లో అందించవచ్చు, అనగా, అంతర్జాల సంధాయకత (ఇంటర్నెట్ కనెక్టివిటీ) అవసరం లేని చెల్లింపులు అమలులోకి వస్తాయి. వినియోగదారులకు అందించిన చెల్లింపు పరిష్కారాలు క్రింది నిబంధనలు మరియు షరతులకు లోబడి ఉంటాయి: ఎ. కార్డులు, వాలెట్లు లేదా మొబైల్ పరికరాలను ఉపయోగించి లేదా ఏదైనా ఇతర సరణి ద్వారా చెల్లింపులు చేయవచ్చు. బి. చెల్లింపులు సుదూర లేదా సామీప్య స్థితి లో చేయవచ్చు. సి. అదనపు అధీకృతమైన కారకం (ఎఎఫ్ఎ) లేకుండా చెల్లింపు లావాదేవీలను అందించవచ్చు. డి. చెల్లింపు లావాదేవీ యొక్క ఎగువ పరిమితి ₹ 200. ఇ. ఒక పరికరంలో ఆఫ్‌లైన్ లావాదేవీల యొక్క మొత్తం పరిమితి ఏ సమయంలోనైనా ₹ 2,000 ఉండాలి. పరిమితిని పునర్నిర్దేశకం చేయడం ఎఎఫ్ఎ తో ఆన్‌లైన్ స్థితి లో అనుమతించబడుతుంది. ఎఫ్. లావాదేవీ వివరాలు వచ్చిన వెంటనే పిఎస్ఓ, వినియోగదారులకు రియల్ టైమ్ లావాదేవీ హెచ్చరికలను పంపుతుంది. జి. సంపర్కం లేని చెల్లింపులు ఇప్పటి లాగా ఇఎంవి ప్రమాణాలకు కట్టుబడి ఉండాలి. హెచ్. ఎఎఫ్ఎ లేకుండా ఆఫ్‌లైన్ స్థితి లో చెల్లింపు లావాదేవీలు ఖాతాదారు ఎంపికలో ఉంటాయి. ఐ. సాంకేతిక లేదా భద్రతా సమస్యల వల్ల ఉత్పన్నమయ్యే అన్ని వ్యాపారి చివరలో బాధ్యతలను కొనుగోలుదారుడు భరించాలి. జె. ఈ చెల్లింపులు జూలై 06, 2017 నాటి పరిమిత ఖాతాదారు ఉత్తరదాయిత్వం ఫై సర్క్యులర్ DBR.No.Leg.BC.78/09.07.005/2017-18 మరియు జనవరి 04, 2019 నాటి DPSS.CO.PD.No.1417/02.14.006/2018-19 లను అనుసరించి ఉంటాయి. కె. ఈ పథకం క్రింద కార్యకలాపాలను ప్రవేశపెట్టే ముందు, వారు అందించే చెల్లింపు పరిష్కారాల యొక్క వివరణాత్మక వివరాలను పిఎస్ఓలు రిజర్వ్ బ్యాంకుకు తెలియజేయాలి. అయినప్పటికీ, వారు రిజర్వ్ బ్యాంక్ నుండి ఎటువంటి అనుమతి కోసం ఎదురుచూడకుండా కార్యకలాపాలను ప్రారంభించవచ్చు. ఎల్. వినూత్న పరిష్కారాలను కలిగి ఉన్న పిఎస్ఓలు కాకుండా ఇతర సంస్థలు తమ ఉత్పత్తులను అందించడానికి పిఎస్ఓలతో జతకట్టవచ్చు. ఎం. ఈ షరతులను పాటించనప్పుడు లావాదేవీలను ఆపడానికి మరియు పైలట్ నుండి నిష్క్రమించమని పిఎస్ఓకు సలహా ఇచ్చే హక్కును రిజర్వ్ బ్యాంక్ కలిగి ఉంది. |