జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్, మహబూబ్నగర్, తెలంగాణ పై భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) ద్వారా ద్రవ్య జరిమానా విధింపు - ఆర్బిఐ - Reserve Bank of India
జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్, మహబూబ్నగర్, తెలంగాణ పై భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) ద్వారా ద్రవ్య జరిమానా విధింపు
భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) నవంబర్ 15, 2023 నాటి ఉత్తర్వు ద్వారా, జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్, మహబూబ్నగర్, తెలంగాణ పై ‘మోసాలు - వర్గీకరణ, పర్యవేక్షణ మరియు రిపోర్టింగ్ వ్యవస్థ కోసం మార్గదర్శకాలు తో కలిపి ‘మోసాల సమీక్ష - రిపోర్టింగ్ మరియు పర్యవేక్షణ వ్యవస్థ మార్గదర్శకాలు' పై నాబార్డ్ (NABARD) జారీ చేసిన ఆదేశాలను ఉల్లంఘించినందుకు, ₹10,000/-(రూ. పది వేలు మాత్రమే) ద్రవ్య జరిమానా విధించింది. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 లోని సెక్షన్‌లు 46(4)(i) మరియు 56తో కలుపుకొని సెక్షన్ 47-A(1)(c) నిబంధనల ప్రకారం భారతీయ రిజర్వు బ్యాంకు కు ఉన్న అధికారాలను ఉపయోగించుకుని ఈ ద్రవ్య జరిమానా విధించబడింది.
ఈ చర్య నియంత్రణ అనుపాలనల లోపాలపై ఆధారపడి తీసుకున్నదే తప్ప, బ్యాంక్ తన వినియోగదారులతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటుపై వ్యక్తీకరించే అభిప్రాయంగా అన్వయించుకోరాదు.
నేపధ్యము
బ్యాంక్ యొక్క మార్చి 31, 2022 నాటి ఆర్థిక స్థితి ఆధారంగా NABARD చేపట్టిన చట్టబద్దమైన తనిఖీ మరియు తనిఖీ నివేదిక, దాని సంబంధిత అన్ని ఉత్తర ప్రత్యుత్తరాలలో మిగతావాటితో కలిపి, మోసాల కేసులను నిర్ణీత కాలపరిమితి లోపున NABARDకి బ్యాంకు నివేదించలేదని వెల్లడైంది. దీని ఆధారంగా, చట్టబద్ధమైన నిబంధనలు మరియు ఆదేశాలను ఉల్లంఘించినందుకు జరిమానా ఎందుకు విధించకూడదో కారణం చూపాలని కోరుతూ బ్యాంకుకు నోటీసు జారీ చేయబడింది.
జారీ చేసిన నోటీసుకు బ్యాంకు సమర్పించిన ప్రత్యుత్తరం లోని అంశాలను మరియు వ్యక్తిగత విచారణ లోని మౌఖిక సమర్పణలను పరిగణలోకి తీసుకున్న తరువాత, ఈ విషయంలో బ్యాంకు ద్వారా NABARD ఆదేశాల ఉల్లంఘన వాస్తవమని మరియు జరిమానా విధించదగినదిగా, భారతీయ రిజర్వు బ్యాంకు నిర్ధారణకు వచ్చింది.
(యోగేష్ దయాల్)
చీఫ్ జనరల్ మేనేజర్
పత్రికా ప్రకటన: 2023-2024/1432