RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78505395

ఆరవ ద్వైమాసిక ద్రవ్య విధాన నివేదిక, 2017-2018
భారతీయ రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య విధాన కమిటీ (MPC) తీర్మానము

February 07, 2018

ఆరవ ద్వైమాసిక ద్రవ్య విధాన నివేదిక, 2017-2018
భారతీయ రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య విధాన కమిటీ (MPC) తీర్మానము

ప్రస్తుత మరియు రాబోయే స్థూల ఆర్థిక పరిస్థితులపై అంచనాల ఆధారంగా, ద్రవ్య విధాన కమిటీ (ఎం పి సి), ఈనాటి వారి సమావేశంలో ఈ క్రింది విధంగా నిర్ణయించినది:

•ద్రవ్యత సవరింపు సౌకర్యం (లిక్విడిటీ అడ్జస్ట్‌మెంట్ ఫెసిలిటీ, ఎల్ ఏ ఎఫ్) క్రింద పాలిసీ రిపో రేట్, మార్పులేకుండా 6.0% గానే ఉంచవలెను.

అందువల్ల, ఎల్ ఏ ఎఫ్ క్రింద, రివర్స్ రెపో రేట్ 5.75% గానే కొనసాగుతుంది.మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (MSF) మరియు బ్యాంక్ రేట్లు 6.25 % ఉంటాయి.

ఎమ్‌ పి సి యొక్క ఈ నిర్ణయం, అభివృద్ధికి ఊతం ఇస్తూ, వినియోగదారుల ధరల సూచీలో (CPI) మధ్యకాలీన ద్రవ్యోల్బణ లక్ష్యం 4 శాతం (+/- 2 శాతం పరిమితిలో) సాధించడానికి, ద్రవ్య విధానం తటస్థంగా ఉండాలి అన్న ఉద్దేశానికి అనుగుణంగా తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం వెనుక ముఖ్య కారణాలు ఈ క్రింది నివేదికలోవివరించబడ్డాయి.

అంచనా

2. డిసెంబర్ 2017లో జరిగిన క్రిందటి ఎం పి సి సమావేశం తరువాత, ప్రపంచ ఆర్థిక క్రియాకలాపాలు మరింత జోరు అందుకొన్నాయి. అభివృద్ధి ప్రేరకాలు అన్ని ప్రాంతాలలో ఏకతీరుగా ఉంటున్నాయి.అభివృద్ధి చెందిన దేశాలలో (ఏ ఇ, అడ్వాన్‌స్డ్ ఎకానమీస్), యూరోప్రాంతం, అధిక వినియోగం, పెట్టుబడుల కారణంగా, పటిష్ఠంగా విస్తరించింది. నిరుద్యోగం తగ్గడం, వడ్డీరేట్లు తేలిక అవడంవల్ల ఆర్థిక స్థితి పై కలిగిన ఆశావహ దృక్పథం,ఆర్థికస్థితి కోలుకొనడానికి దోహదపడుతోంది. తయారీ రంగం చాలా నెలల తరువాత, డిసెంబరులో ఉచ్చ స్థాయికి చేరినా, 2017, నాలుగవ త్రైమాసికంలో, యుఎస్ ఆర్థిక వ్యవస్థ వేగం కోల్పోయి, అభివృద్ధి నెమ్మదించింది. బలమైన విదేశీ గిరాకీ కారణంగా, తయారీ రంగం జనవరిలో వేగవంతం కావడంతో, ముందే ఉత్సాహ భరితంగా ఉన్న జపాన్‌ ఆర్థిక వ్యవస్థ మరింత ఊపందుకుంది.

3. ప్రధాన ఎమెర్జింగ్ మార్కెట్ ఎకానమీస్‌లో, (ఇ ఎం ఇ) లలో, 2017, చివరి త్రైమాసికంలో, ఆర్థిక క్రియాకలాపాలు వేగవంతమయాయి. చైనా ఆర్థిక వ్యవస్థ, పెరిగిన దేశీ వినియోగంవల్ల, భారీ ఎగుమతుల వల్ల అధికారిక లక్ష్యాన్నిమించి, వృద్ధి సాధించింది. అయితే, అభివృద్ధిని దిగజార్చే ప్రమాదాలు – ముఖ్యంగా స్థిరాస్థులలో పెట్టుబడులు కుంటుబడడం, వేగంగా పెరుగుతున్నరుణస్థాయిలు - లేకపోలేదు. రష్యాలో, ధృడమైన ప్రజావినియోగం, చమురు ధరల పెరుగుదల, ఎగుమతులలో వృద్ధి, ఆర్థిక ప్రగతికి తోడ్పడుతున్నాయి. కానీ, బలహీనబడ్డ పెట్టుబడులు, ఆర్థిక ఆంక్షలు,వ్యవస్థకు భారంగా మారాయి. బ్రెజిల్‌ లో గృహ వ్యయం, నిరుద్యోగం గణాంకాలు, నాలుగవ త్రైమాసికంలో, అనుకూలంగా ఉన్నాయి. అయినాగానీ, వినియోగదారుల నమ్మకాన్ని వమ్ము చేస్తున్న రాజకీయ అనిశ్చితి, ఆర్థిక వ్యవస్థ తేరుకోవడానికి అడ్డంకి. దక్షిణ ఆఫ్రికా, తీవ్రమైన నిరుద్యోగం, కర్మాగారాలలో ఉత్పాదన క్షీణించడంతో సహా, అనేక దేశీయ / అంతర్జాతీయ సవాళ్ళను ఎదుర్కొంటోంది.

4. పెట్టుబడులు, ఉత్పాదకత బలిష్ఠం కావడంతో, ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్యాభివృద్ధి, కొనసాగుతూఉంది. చమురు ఎగుమతి దేశాల సమితి (ఒ పి ఇ సి), ఉత్పాదనలో కోతలు అమలు చేయడం, చమురు నిల్వలు క్షీణించడం వల్ల గిరాకీ-సరఫరాల్లో ఏర్పడిన అసంతులనం కారణంగా,చమురు ధర,మూడు ఏళ్ళ గరిష్ఠ స్థాయికి చేరింది. యు ఎస్ డాలరు బలహీన పడడంచేత, పసిడిధర, ఎన్నో నెలల గరిష్ఠానికి చేరింది. యుకె (UK) మినహా, చాలా ఏ ఈ దేశాలలో వేతనఒత్తిళ్ళు సన్నగిలిన కారణంగా, ద్రవ్యోల్బణం,కట్టడి లోనే ఉంది. ఇతర ఇ ఎమ్‌ ఇ దేశాలలో ద్రవ్యోల్బణం, స్థానిక పరిస్థితులని బట్టి, వివిధ రీతులలో ఉంది.

5. యుఎస్‌ లో, జనవరి నెలలో వేతన వివరాలు పరిశీలిస్తే, వేతన వ్యయం అమితంగా పెరిగింది. పైగా, ఊహించిన దానికన్నఎక్కువ ఉద్యోగాలు కల్పించబడ్డాయి. ఈ కారణంగా, యు ఎస్ ఫెడ్ (US Fed) ఆర్థిక విధానం యథాస్థితికి చేరుకోవడానికి పట్టే సమయం పై అనిశ్చితి ఏర్పడింది. దీనివల్ల ఆర్థిక విపణులు (Financial Markets), చపలతకు లోనయ్యాయి. బ్రెక్సిట్ (BREXIT) తరువాత, చపలతసూచీ (వొలటలిటీ ఇండెక్స్) గరిష్ఠ స్థాయికి ఎగబ్రాకింది. ఈక్విటీ మార్కెట్లు, ఏఇ మరియు ఇఎమ్‌ ఈ దేశాలలో,చురుకుగా దిద్దుబాటుకు లోనయ్యాయి. బాండ్ల పై రాబడులు, యుఎస్లో బాగా బలపడ్డాయి. ఇది, జనవరి లో పెరుగుదలకు సాయపడింది. అదేసమయంలో, ఏఇ /ఇ ఎమ్‌ ఇ దేశాలలో, బాండ్లపై రాబడి కూడా అధికమయింది. విదేశీ మారక మార్కెట్లు సహితం చపలతకు లోనయ్యాయి. ఇటీవల కలిగిన చపలత్వం వరకు, ప్రపంచ ఆర్థిక విపణులు, మదుపరుల తెగువ, యుఎస్‌లో కార్పొరేట్పన్ను తగ్గింపు, స్థిరమైన ఆర్థిక పరిస్థితులు మొదలైన కారణాలవల్ల ఉత్సాహ పూరితంగా ఉన్నాయి. చైనాలో పురోభివృద్ది, కమొడిటీ ధరల పెరుగుదల, కార్పొరేట్ల సానుకూల విశ్వాసం ప్రేరణగా, ఈక్విటీ మార్కెట్లు, జనవరి లో లాభ పడ్డాయి. కరెన్సీ మార్కెట్లలో, యు ఎస్ డాలర్, ఆర్థిక నష్ట భయాల వల్ల, ఇతర ఏఇ ల అభివృద్ధి అంచనాలు మెరుగు పడటం వల్ల, ఫిబ్రవరి 1 న, ఎన్నో నెలల కనిష్ఠస్థాయికి దిగజారింది.

6. దేశీయంగా, కేంద్రీయ గణాంక కార్యాలయం (సిఎస్ఓ) ప్రాథమిక అంచనాల ప్రకారం, (ఎఫ్ఏఇ, First Advance Estimates) 2016-17 లో 7.1 శాతం ఉన్నరియల్ గ్రోస్ వేల్యూ ఏడెడ్, (జి వి ఏ), వ్యవసాయంతదనుబంధ కార్యకలాపాలు;మైనింగ్క్వారీయింగ్;తయారీ;పరిపాలన, రక్షణ మరియు ఇతర సేవా (PADO) రంగాలలో క్రియా కలాపాలు మందగించిన కారణంగా, 2017-18లో 6.1 శాతానికి పడిపోతుందని అంచనా.

7. అయితే, సిఎస్ఓ ద్వారా ఎఫ్ఏఓ విడుదల తరువాత, అందిన సమాచారం,మొత్తంమీద ఆశాజనకంగా ఉంది. తయారీ రంగ ఉత్పాదన నవంబరులో, జోరు పుంజుకొని, పారిశ్రామిక ఉత్పాదకత సూచీ (Index of Industrial Production, IIP) వృద్ధికి కారణమయింది. దీర్ఘకాలంగా నీరసించిన సిమెంట్ ఉత్పాదన, నవంబర్ - డిసెంబర్‌లో బలమైన ఉత్పాదన నమోదుచేసింది. దీనితోబాటు, ఉక్కు ఉత్పాదన కూడా బాగా పెరగడం వల్ల, మౌలిక వ్యవస్థకు కావలసిన వస్తువుల తయారీ, నవంబరులో వేగంఅందుకుంది. క్రొత్త గిరాకీ కారణంగా, పర్చేజింగ్ మానేజర్స్ ఇండెక్స్ (Purchasing Managers Index, PMI), జనవరిలో, వరుసగా ఆరవనెల పెరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఇండస్ట్రియల్ ఔట్‌లుక్ సర్వే) ప్రకారం, మూడవ త్రైమాసికంలో, దేశీయ తయారీ రంగంలో కలగబోయే అభిృద్ధిపై, విశ్వాసం మెరుగుపడింది.కానీ, బొగ్గు, ముడిచమురు, ఉక్కు, విద్యుత్తు వంటి కీలక రంగాల్లో, పెరుగుదల సంకోచించింది / మందగించింది. గోధుమ, నూనెగింజలు, ముతక ధాన్యాల సాగుబడి (ఎకరాల్లో) క్రితం సంవత్సరంకన్నా, తగ్గింది. దీనివల్ల, రాబి పంటల నాట్లలో డిసెంబర్ 29, 2017 లో 1.0 శాతం ఉన్నకొరత, ఫిబ్రవరి 2 న 1.5 శాతానికి పెరిగింది.

8. సేవా రంగానికి సంబంధించి కొన్ని హై ఫ్రీక్వెన్సీ సూచికలు (high-frequency indicators),మెరుగయాయి. వాణిజ్య వాహనాల అమ్మకాలు డిసెంబరులో, ఎనిమిది సంవత్సరాల పతాకస్థాయికి చేరాయి. నౌకా, రైలు, విమానమార్గాల ద్వారా వస్తు రవాణా, నవంబరులో పెరిగినా, డిసెంబరులో మిశ్రమంగా ఉంది. దేశీయ / అంతర్జాతీయ విమాన ప్రయాణీకుల సంఖ్య; విదేశీ పర్యాటకుల సంఖ్యల సూచీలు, నవంబర్ – డిసెంబర్నెలల్లో వేగంగా పెరిగాయి. సేవా రంగంలో వ్యాపారం పుంజుకొన్న కారణంగా, సేవారంగపు పి ఎమ్‌ ఐ (PMI) డిసెంబర్ – జనవరిలో, వృద్ధిచెందింది.

9. రిటైల్ద్రవ్యోల్బణం, వినియోగదారుల సూచీ వార్షిక వ్యత్స్యాలతో పోలిస్తే, మూల అంశాలలో తీవ్రమైన ప్రతికూలతలవల్ల, డిసెంబరులో వరుసగా ఆరవ నెల పెరిగింది. నవంబరు లో అకస్మాత్తుగా పెరిగిన ఆహార ధరలు, డిసెంబరులో రుతురీత్యా, కూరగాయలు, కాయ ధాన్యాల ధరలు తగ్గడంతో,కొంత వరకు నెమ్మదించింది. తృణ ధాన్యాల ధరలు డిసెంబరులో స్థిరంగా ఉన్నాయి., అయితే, కొన్నిఆహార వస్తువుల - గ్రుడ్లు; చేపలు, మాంసము; నూనెలు మరియు క్రొవ్వు పదార్థాలు; మరియు పాల ద్రవ్యోల్బణం పెరిగింది. నవంబరులో విపరీతంగా పెరిగిన, ఇంధనం మరియు విద్యుత్తు వర్గపు ద్రవ్యోల్బణం, విద్యుత్తు, వంటగ్యాస్, కెరోసీన్‌ ధరలు తగ్గడంతో, డిసెంబరులో కొంత మెత్తబడింది.

10. ఏడవ వేతన సంఘం నిర్ణయం మేరకు ప్రభుత్వ ఉద్యోగులకు, గృహభత్యం (HRA) పెంపు అమలు పరచడం కారణంగా, వినియోగదారుల ధరల సూచీ (CPI) ద్రవ్యోల్బణం (అహారం, ఇంధనంతప్ప) మరింత పెరిగింది. ఆరోగ్యం, వ్యక్తిగత స్వస్థ్యత వస్తువుల ద్రవ్యోల్బణం పెరిగింది. ధరల పెంపు, దేశీయ పెట్రోలియం ఉత్పత్తులకు పూర్తిగా అమలు కానందువల్ల,రవాణా / రాకపోకల సౌకర్యాలలో ద్రవ్యోల్బణం డిసెంబరులో, అంతగాలేదు. దుస్తులు, పాదరక్షలు, గృహోపకరణ సామగ్రి, వినోదం మరియు విద్యారంగాల ద్రవ్యోల్బణం నెమ్మదించింది.

11. రిజర్వ్ బ్యాంక్ జరిపిన గృహసర్వేలో, ద్రవ్యోల్బణం రానున్న మూడు నెలల్లో /సంవత్సరంలో మరింత పెరుగుతుందనే భావన ఉందని,వెల్లడయింది.అయితే,సంవత్సరం తరువాత ద్రవ్యోల్బణంలో పెరుగుదల నామమాత్రంగా తగ్గవచ్చని అభిప్రాయం ఉంది. రిజర్వ్బ్యాంక్ ఇండస్ట్రియల్ ఔట్‌లుక్ సర్వేకి స్పందించిన సంస్థలు, మూడవ త్రైమాసికంలో ముడి సరుకుల ధరలు తద్వారా అమ్మ కంధరలు పెరిగినట్లు నివేదిస్తూ ఉన్నారు. పిఎమ్‌ ఐలో పాల్గొన్న తయారీ /సేవారంగ సంస్థలు ఇదే సంగతి ధృవీకరించాయి.సంఘటిత రంగంలో వేతనాలు పెరిగాయి, గ్రామీణ వేతనాల పెరుగుదల, నెమ్మదించింది.

12. వ్యవస్థలోని ద్రవ్యత అధికంగానే ఉన్నా, తటస్థ దిశగా చలిస్తోంది. వైటెడ్ ఏవరేజ్ కాల్ రేట్ (WACR),అక్టోబరు నెలలో, డిసెంబర్-జనవరిలో రిపో రేటుకు, 12 బేసిస్ పాయింట్లు తక్కువగా ట్రేడ్ చేయబడింది; (నవంబరులో 15 బేసిస్ పాయింట్లు తక్కువ). డిసెంబర్ మరియు జనవరి నెలల్లో కొన్ని రోజులు, ప్రభుత్వ వ్యయం తగ్గడం, అధికపన్ను వసూళ్ళ కారణంగా, ద్రవ్యత లోటు కలిగింది. దీనితో, రిజర్వ్బ్యాంక్ద్రవ్యత కల్పించవలసిన పరిస్థితి ఏర్పడింది. డిసెంబర్ 16, 2017 నుండి రెండు వారాల పాటు,రిజర్వ్బ్యాంక్, రోజుకు సగటున, రూ. 388 బిలియన్‌ నికర ద్రవ్యత సమకూర్చింది.అయితే డిసెంబర్మొత్తం మీదచూస్తే, రిజర్వ్బ్యాంక్, రోజుకుసగటున రూ. 316 బిలియన్‌ నికర ద్రవ్యత గ్రహించింది. జనవరి నాలుగవ వారంలో, వ్యవస్థ తిరిగి లోటులోకి వెళ్ళినప్పుడు, రోజుకు సగటున రూ. 145 బిలియన్‌ ద్రవ్యత భర్తీ చేసింది.జనవరి మొత్తంమీ, రిజర్వ్బ్యాంక్, రూ. 353 మిలియన్‌ ద్రవ్యత గ్రహించింది (రోజుకు, సగటున).

13. సరకు ఎగుమతులు, నవంబర్-డిసెంబరులో తిరిగి ఊపందుకొన్నాయి. ఈ పెరుగుదలలో ముప్పాతిక భాగం పెట్రోలియం ఉత్పత్తులు, ఇంజనీరింగ్వస్తువులు, రసాయనాల ఎగుమతుల వల్ల కలిగింది. రెడీమేడ్దుస్తుల ఎగుమతి తగ్గింది. ఇదే సమయంలో, సరకు దిగుమతులు కూడాపెరిగాయి. వీటిలో మూడో వంతు పెట్రోలియం ఉత్పత్తుల (ముడిచమురు ఉత్పత్తులు) ధర అంతర్జాతీయంగా ప్రియం కావడంవల్ల కలిగినదే.మునుపటి మూడు నెలలు వరుసగా తగ్గిన తరువాత బంగారం దిగుమతుల పరిమాణం / విలువ, డిసెంబరులో పెరిగాయి. చమురు, పసిడి మినహా, దిగుమతులు విలువ పెరగడానికి, ముఖ్యంగా ముత్యాలు, మణులు ఎలక్ట్రానిక్వస్తువులు, బొగ్గు,దిగుమతులు కారణం. ఎగుమతులను మించి దిగుమతులు ఉన్న కారణంగా, డిసెంబరులో వాణిజ్య లోటు (trade deficit) US $ 14.9 బిలియన్‌.

14. 2017-18 రెండవ త్రైమాసికంలో కరంట్ఖాతాలోటు, తగ్గుతూవస్తున్నా, వాణిజ్య లోటు పెరగడంవల్ల, క్రిందటి సంవత్సరంకన్న ఎక్కువగానే ఉంది. నికర విదేశీ పెట్టుబడులు (FDI) ఏప్రిల్-అక్టోబర్ 2017 లో క్రిందటి సంవత్సరంతో పోలిస్తే, మందగించాయి. నికర విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు, 2017-18 లో (ఫిబ్రవరి 1, వరకు) చలాకీగా ఉన్నాయి. భారతదేశపు విదేశీ ద్రవ్య నిల్వలు, ఫిబ్రవరి2, 2018 నాటికి యు ఎస్ $ 421. 9బిలియన్లు.

దృక్పథం

15. డిసెంబర్ద్వైమాసిక నివేదిక, సంవత్సరపు రెండవ అర్ధభాగంలో, ద్రవ్యోల్బణం 4.3 - 4.7% ఉండవచ్చని సూచించింది (కేంద్రం పెంచిన గృహభత్యం ప్రభావంతో కలిపి).వాస్తవానికి, హెడ్‌లైన్‌ ద్రవ్యోల్బణం, మూడవ త్రైమాసికంలో –ముఖ్యంగా ఆహార పదార్థాల ధరలలో అనుకోని పెరుగుదల వల్ల -సగటున 4.6% గా నమోదయింది.డిసెంబరులో కొంతవరకు ధరలు తగ్గినా, శీతాకాలంలో సాధారణంగా తగ్గవలసిన మేరకు తగ్గలేదు. అంతర్జాతీయంగా అనేక దఫాలుగా పెరిగిన చమురు ధరల మొత్తం, జాప్యంగా వసూలు చేయడంతో,దేశీయంగా పెట్రోలు పంపులలో ధర,ఒక్కపెట్టున అధికమయింది. ఈ అంశాలన్నీ దృష్టిలో ఉంచుకొని, నాలుగవ త్రైమాసికంలో, ద్రవ్యోల్బణం 5.1% ఉండవచ్చని అంచనా వేయడం జరిగింది (పెరిగిన గృహ భత్యం ప్రభావంతో కలిపి).

16. వచ్చేసంవత్సరంలో,ద్రవ్యోల్బణం, అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. మొదటిగా, ఆగస్ట్ 2017 నుండి ముడిచమురుధరలు,'గిరాకీ – సరఫరా అంతరాల వల్ల',విపరీతంగా పెరిగాయి. రెండవది, ముడిచమురే కాక, ఇతర పారిశ్రామిక ముడిసరకుల ధరలు కూడా ప్రపంచ వ్యాప్తంగా పెరిగాయి. రిజర్వ్బ్యాంక్ ఐఓఎస్‌ లో పాల్గొన్న సంస్థలు ముడివస్తువుల ధరలు నాలుగ వత్రైమాసికంలో మరింత పెరుగుతాయని భావిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ మెరుగవుతున్న తరుణంలో, ఈ పెరిగిన ధరలు వినియోగదారులే భరించవలసి ఉంటుంది. మూడవది, ద్రవ్యోల్బణ అంచనా, వర్షపాతం మీద ఆధారపడి ఉంటుంది. ఈ సంవత్సరం వర్షపాతం, మామూలుగానే ఉండవచ్చు. ఈ అంశాలు పరిశీలిస్తే, వినియోగదారుల ధరల సూచీ ద్రవ్యోల్బణం (CPI inflation) 2018-19 మొదటి అర్ధభాగంలో, 5.1 నుండి 5.6% ఉండవచ్చని అంచనా (గణాంకాలపై, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల గృహాభత్యం యొక్క ప్రభావం క్షీణిస్తున్నదని పరిగణనలోకి తీసుకొని).రెండవ అర్ధ భాగంలో, ద్రవ్యోల్బణం 4.5 - 4.6% ఉండవచ్చు. అయితే, పెరిగే ఆస్కారం లేకపోలేదు. (చార్ట్ 1).రెండవ అర్ధ భాగంలో,ద్రవ్యోల్బణం తగ్గవచ్చన్న అంచనాకు కారణాలు –మూలాధార అంశాలు బలంగా ఉన్నాయి; 7 వసిపిసి పెంచిన గృహ భత్యం ప్రభావం సన్న గిల్లుతుంది; ఆహార ద్రవ్యోల్బణం తేలికవుతుందన్న భావం;వర్షపాతం మమూలుగా ఉంటుందన్న ఆశ; ప్రభుత్వం సరఫరా నిర్వహణ సమర్థవంతంగా చేస్తుందని నమ్మకం.

17. ఇక జి వి ఎ (GVA) విషయానికొస్తే, 2017-18 లోజివిఏ 6.6% ఉండవచ్చని అంచనా.పైసంవత్సరం, జివిఏ వృద్ధి అనే కఅంశాలపై ఆధారపడి ఉంటుంది. మొదటగా, జిఎస్టి అమలు స్థిరపడుతోంది. ఇది ఆర్థిక వ్యవస్థకు శుభసూచకం.రెండవది, పరపతి వినియోగం పెరగడం /ప్రాథమిక క్యాపిటల్మార్కెట్‌లో అధిక మొత్తం నిధుల సేకరణ /పెరిగిన ఉత్పాదక వస్తువుల తయారీ / దిగుమతులు,పెట్టుబడులు తిరిగి జోరందుకున్నాయనడానికి చిహ్నాలు. మూడవది, ప్రభుత్వ బ్యాంకుల రీ-క్యాపిటలైజేషన్‌ప్రక్రియ మొదలయింది. దుస్థితిలో ఉన్న భారీ రుణాల పరిష్కారానికి ఇన్సాల్వెన్సీ అండ్ బాంక్రప్ట్సీ కోడ్ కు అప్పగించడం జరుగుతోంది. దీనితో నిధుల ప్రవాహం మరింత పెరిగి, క్రొత్త పెట్టుబడులకు దోహద మవుతాయి. నాలుగవది, ప్రపంచ వ్యాప్తంగా పెరిగిన గిరాకీ వల్ల ఎగుమతులు అధికమయే సంభావన ఉన్నా, పెరిగిన వస్తువుల ధరలు, ప్రత్యేకించి పెట్రోల్ధర, సమిష్టి గిరాకీకి ప్రతిబంధం కావచ్చు. పై అంశాలన్నీ పరిగణన లోనికి తీసుకొని, 2018-19 లో GVA పెరుగుదల మొత్తంమీద 7.2% ఉండవచ్చని అంచనా –మొదటి అర్ధ సంవత్సరం 7.3 – 7.4; మరియు రెండవ అర్ధ సంవత్సరం 7.1 – 7.2(చార్ట్ 2)


18.అనేక అనిశ్చితుల వల్ల ద్రవ్యోల్బణం పెరుగుతుందని ఎం పి సి (MPC) గమనించింది. మొదటిగా, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పర్యాయాలలో పెంచిన, గృహభృతి (HRA), హెడ్‌లైన్‌ ద్రవ్యోల్బణాన్ని 2018-19 లోఆధారరేఖకు పైకి త్రోసి, రెండవ మారు ప్రభావం చూపించే సంభావన ఉంది. రెండవది, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వికాసం, ముడిచమరు/వస్తువుల ధరలను మరింతగా పెంచి, దేశీయ ద్రవ్యోల్బణం పెరగడానికి కారణం కావచ్చు. మూడవది, 2018-19 కేంద్ర బడ్జెట్‌లో, ఖారిఫ్పంటలకు, కనీస మద్దతుధర (Minimum Support Price, MSP) నిర్ణయించడానికి,సవరించిన మార్గదర్శకాలు ప్రతిపాదించింది. అయితే ద్రవ్యోల్బణంపై దీని ప్రభావం ఎంత వరకు ఉంటుందో, ఈ దశలో చెప్పలేము. నాలుగవది, అనేక వస్తువుల మీద కస్టమ్స్డ్యూటీ పెంచాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఐదవది, కేంద్ర బడ్జెట్‌లో పేర్కొన్న'ఫిస్కల్స్లిపేజ్' (Fiscal Slippage) ద్రవ్యోల్బణాన్ని ప్రభావితం చేయవచ్చు. ద్రవ్యోల్బణంపై ప్రత్యక్ష ప్రభావమేకాక ఫిస్కల్స్లిపేజ్, స్థూల ఆర్థిక వ్యవస్థ పై అనేక ముఖ్యమైన పరిణామాలు కలిగి ఉండవచ్చు, ముఖ్యంగా, రుణం యొక్క ధర ఇప్పుడే పెరుగుతోంది. ఆరవది, దేశీయ ఆర్థిక పరిస్థితుల సమిష్టి ప్రభావం, ప్రధాన ఆర్థిక వ్యవస్థల ద్రవ్య విధానం సాధారణ స్థితికి చేరడం అనే రెండు అంశాలు, దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపి, తద్వారా విదేశీ మదుపరుల విశ్వాసం క్రుంగ దీయవచ్చు. అందువల్ల రానున్న రోజుల్లో ద్రవ్యోల్బణం మీద శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది.

19. అయితే, ఉపశమనం కలిగించే అంశాలు కూడా ఉన్నాయి. మొదట, కెపాసిటీ వినియోగం మందంగా ఉంది. రెండు, చమురు ధరలు ఇటీవల,హెచ్చు తగ్గులతున్నాయి. ఉత్పత్తిని బట్టి, ప్రస్తుత స్థాయినుండి దిగిరావచ్చు. మూడు, గ్రామీణ వాస్తవిక వేతనాల పెరుగుదల మధ్యస్థంగా ఉంది.

20. తదనుసారంగా, ఎం పి సి, పాలిసీ రెపోరేట్లోమార్పుచేయకుండా తటస్థ విధాన వైఖరి అవలంబించాలని నిశ్చయించింది. హెడ్‌లైన్‌ ద్రవ్యోల్బణం, దీర్ఘ కాలానికి 4% నికి దగ్గరగా ఉంచాలన్న ఆశయానికి, ఎం పి సి కట్టుబడి ఉందని, తిరిగి చెపుతున్నాము.

21. ఆర్థిక వ్యవస్థ కోలుకొనే మార్గంలో ఉందని ఎమ్‌పిసి గమనించింది. ప్రపంచ గిరాకీ మెరుగవుతోంది. దీనివల్ల దేశీ పెట్టుబడులు వృద్ధి చెందుతాయి. గ్రామీణ, మౌలిక రంగాలపై కేంద్ర బడ్జెట్లో దృష్టి కేంద్రీకరించడం, స్వాగతించవలసిన పరిణామం. దీనివల్ల, గ్రామీణ ఆదాయం, మరియు పెట్టుబడుల పెరుగుదలకు తోడ్పడి, సమిష్టి గిరాకీకి, ఆర్థిక క్రియాకలాపాలకూ, మరింత ప్రొత్సాహం కలుగుతుంది. ఇటీవల, బలవంతమవుతున్న, ఆర్థిక పురోభివృద్ధిని చక్కగా సంరక్షించి, సానుకూలమైన, స్థిరమైన స్థూల ఆర్థిక నిర్వహణ ద్వారా, ఉన్నతపథంలోకి తేవాలని కమిటీ భావిస్తోంది.

22. డా. చేతన్‌ ఘాటే, డా. పామి దువా, డా. రవీంద్ర ఎచ్. ఢోలాకియా, డా. విరల్ వి ఆచార్య మరియు డా. ఉర్జిత్ పటేల్, ఈ ద్రవ్య విధాన నిర్ణ యాలకు మద్దతు పలికారు. డా. మైకేల్దేబబ్రత పాత్రా, పాలిసీ రేట్ 25 బేసిస్ పాయింట్లు పెంచాలని, వోట్ చేశారు. ఎమ్‌ పి సి యొక్క సమావేశ వ్యవహార నివేదిక (minutes), ఫిబ్రవరి 21, 2018 తేదీ నాటికి ప్రచురించ బడుతుంది.

23. ఎమ్‌ పి సి యొక్క తదుపరి సమావేశం, ఏప్రిల్ 4 మరియు 7, 2018 తేదీలలో నిర్వహించబడుతుంది.

జోస్ జె కత్తూర్
చీఫ్జనరల్ మానేజర్

పత్రికా ప్రకటన: 2017-2018/2146

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?