RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S1

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78493136

అభివృద్ధి మరియు నియంత్రణ విధానాలపై ప్రకటన

ఏప్రిల్ 07, 2021

అభివృద్ధి మరియు నియంత్రణ విధానాలపై ప్రకటన

ఈ ప్రకటన, (i) ద్రవ్య నిర్వహణ మరియు లక్షిత రంగాలకు మద్దతు; (ii) నియంత్రణ మరియు పర్యవేక్షణ (iii) ఋణ నిర్వహణ (iv) చెల్లింపు మరియు పరిష్కార వ్యవస్థలు (v) ఆర్ధిక సమీకరణ; మరియు (vi) విదేశీ వాణిజ్య ఋణాల (ఎక్ష్తెర్నల్ కమర్షియల్ బారోయింగ్స్) పై వివిధ అభివృద్ధి మరియు నియంత్రణ విధాన చర్యలను నిర్దేశిస్తుంది.

I. ద్రవ్య సంబంధిత చర్యలు

1. టిఎల్‌టిఆర్‌ఓ (TLTRO) లక్షిత-దీర్ఘకాల (ఆన్-ట్యాప్) స్కీం – చివరి గడువు పొడిగింపు

బాహుళ్యవ్యాప్తి మరియు గుణక ప్రభావంతో వృద్ధిని ప్రేరేపించే నిర్దిష్ట రంగాలలో కార్యకలాపాలకు పునరుత్తేజం కల్పించే ద్రవ్య సంబంధిత చర్యల దృష్టిని పెంచే ఉద్దేశంతో, అక్టోబర్ 9, 2020 న ఆర్‌బిఐ టిఎల్‌టిఆర్‌ఓ లక్షిత-దీర్ఘకాల (ఆన్ ట్యాప్) స్కీమ్‌ను ప్రకటించింది, ఇది మార్చి 31, 2021 వరకు లభించింది. అక్టోబర్ 21, 2020 న ఈ పథకం కింద ప్రకటించిన ఐదు రంగాలతో పాటు, కామత్ కమిటీ గుర్తించిన 26 ఒత్తిడికి లోనైన రంగాలను కూడా డిసెంబర్ 04, 2020 న మరియు ఎన్‌బిఎఫ్‌సిలకు బ్యాంకులు రుణాలు ఇవ్వడం ను ఫిబ్రవరి 05, 2021 తేదీ నుండి, టిఎల్‌టిఆర్‌ఓ లక్షిత-దీర్ఘకాల (ఆన్-ట్యాప్)క్రింద అర్హతగల రంగాల పరిధిలోకి తీసుకువచ్చారు. ఈ పథకం క్రింద లభ్యమైన ద్రవ్యాన్ని బ్యాంకులు ఈ రంగాలలోని సంస్థలు జారీ చేసే కార్పొరేట్ బాండ్లు, కమర్షియల్ పేపర్లు మరియు నాన్-కన్వర్టిబుల్ డిబెంచర్లలో ఉంచాలి; ఈ రంగాలకు బ్యాంకు రుణాలు మరియు అడ్వాన్సులను అందించడానికి కూడా దీనిని ఉపయోగించవచ్చు. ఈ సదుపాయం క్రింద బ్యాంకులు పెట్టిన పెట్టుబడులు హెల్డ్-టు-మెచ్యూరిటీ (హెచ్‌టిఎమ్-HTM) పోర్ట్‌ఫోలియో క్రింద వర్గీకరించుకోవచ్చు; అవి హెచ్‌టిఎమ్ పోర్ట్‌ఫోలియోలో అనుమతించబడిన మొత్తం పెట్టుబడిలో 25 శాతo పైబడినప్పటికీ. ఈ సదుపాయం క్రింద ఉన్న అన్ని ఎక్స్పోజర్లు, లార్జ్ ఎక్స్పోజర్ ఫ్రేమ్‌వర్క్ (LEF) క్రింద లెక్కించకుండా మినహాయించబడతాయి.

సమీక్షానంతరం, టిఎల్‌టిఆర్‌ఓ లక్షిత-దీర్ఘకాల (ఆన్ ట్యాప్) స్కీమ్‌ను ఆరు (6) నెలలపాటు అంటే సెప్టెంబర్ 30, 2021 వరకు, పొడిగించాలని నిర్ణయించారు.

2. అఖిల భారత ఆర్థిక సంస్థలకు లిక్విడిటీ సౌకర్యం

COVID-19 మహమ్మారి ఉధృతం నుండి వాస్తవిక ఆర్ధిక వ్యవస్థకు నిరంతర ఋణాల మంజూరు కు మద్దతుగా ఏప్రిల్ - ఆగస్టు, 2020 లో అదనపు ప్రత్యేక నిధులు 75,000 వరకు అఖిల భారత ఆర్థిక సంస్థలకు - బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (నాబార్డ్); స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సిడ్బి); నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (NHB); మరియు EXIM బ్యాంకు – అందించబడ్డాయి. ఈ సౌకర్యాలు ఒక సంవత్సరం పాటు అందుబాటులో ఉన్నాయి. నాబార్డ్, సిడ్బి మరియు NHB లు ఏప్రిల్-మే 2020 లో వారికి అందించిన నిధులను తిరిగి చెల్లించుకుంటారు. ఇప్పటికిగూడా సుషుప్త అవస్థలోనే ఉన్న వృద్ధి అంకురాలకు పోషణ నిమిత్తం, 2021-22 లో అదనంగా కొత్త రుణాలు ఇవ్వడానికి AIFI లకు 50,000 కోట్ల తాజా మద్దతును ఇవ్వాలని నిర్ణయం చేయడమైనది. దీని ప్రకారం, వ్యవసాయం మరియు అనుబంధ కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడానికి, గ్రామీణ వ్యవసాయేతర రంగం మరియు నాన్-బ్యాంకింగ్ ఆర్థిక సంస్థలు-మైక్రో ఫైనాన్స్ సంస్థలకు కూడా (ఎన్‌బిఎఫ్‌సి-ఎంఎఫ్‌ఐలు) మద్దతు ఇవ్వడానికి, నాబార్డ్‌కు 25 వేల కోట్ల ప్రత్యేక లిక్విడిటీ సౌకర్యం (ఎస్‌ఎల్‌ఎఫ్) అందించనున్నారు. హౌసింగ్ సెక్టార్ కు మద్దతిచ్చేందుకుగాను, ఎస్‌ఎల్‌ఎఫ్ 10,000 కోట్లు ఎన్‌హెచ్‌బికి ఏడాది అందిస్తారు. సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల (MSME లు) నిధుల అవసరాలను తీర్చడానికి SIDBI కు ఈ సౌకర్యం కింద ఒక సంవత్సరం వరకు 15,000 కోట్ల నిధులు మంజూరు చేయబడతాయి. ప్రస్తుత పాలసీ రెపో రేటు వద్ద ఈ మూడు సౌకర్యాలన్నీ లభిస్తాయి.

II. నియంత్రణ మరియు పర్యవేక్షణ

3. చెల్లింపు బ్యాంకుల వినియోగదారుల వ్యక్తిగత గరిష్ట బ్యాలెన్స్ పరిమితిని రోజు ముగింపుకు 1.00 లక్ష నుండి 2.00 లక్షలకు పెంపుదల

నవంబర్ 27, 2014 న జారీ చేయబడిన "చెల్లింపు బ్యాంకుల లైసెన్సింగ్ కోసం మార్గదర్శకాలు" వ్యక్తిగత వినియోగదారునికి గరిష్టంగా 1 లక్ష బ్యాలెన్స్ ఉంచడానికి చెల్లింపు బ్యాంకులు అనుమతించబడ్డాయి. చెల్లింపుల బ్యాంకుల పనితీరుపై సమీక్ష ఆధారంగా మరియు ఆర్ధిక సమీకరణ లో వారి ప్రయత్నాలను ప్రోత్సహించే ఉద్దేశంతోను ఇంకా MSME లు, చిన్న వ్యాపారులు మరియు అన్య వ్యాపారులతో సహా వారి కస్టమర్ అవసరాలను తీర్చగల సామర్థ్యాన్ని పెంచేందుకు, రోజు ముగింపుకు వ్యక్తిగత కస్టమర్ గరిష్ట బ్యాలెన్స్ పరిమితిని 1 లక్ష నుండి 2 లక్షలకు పెంచాలని నిర్ణయించబడింది. ఈ విషయంలో సర్క్యులర్ విడిగా జారీ చేయబడుతుంది.

4. ఆస్తుల పునర్వ్యవస్థీకరణ కంపెనీలు (ARCs) - ఒక కమిటీ ఏర్పాటు

2002 సంవత్సరంలో (SARFAESI) చట్టం అమలు జరిగిన తదుపరి, ఆస్తుల పునర్వ్యవస్థీకరణ కంపెనీల (ARCs) రంగం అభివృద్ధి కోసం మరియు వీటి పనితీరును సులభతరం చేయడానికి 2003లో మార్గదర్శకాలు జారీ చేయబడ్డాయి. అప్పటినుండి ARCలు సంఖ్య మరియు పరిమాణ పరంగా పెరిగినప్పటికీ, ఒత్తిడికి గురైన ఆస్తులను పరిష్కరించే వారి సామర్థ్యం ఇంకా పూర్తిగా వినియోగించబడలేదు. ఆర్ధిక రంగ ఎకోసిస్టం లో ARCs ఎలా పనిజేస్తున్నాయో క్షుణ్ణంగా సమీక్షించి మరియు ఆర్థిక రంగం లో పెరుగుతున్న అవసరాలను తీర్చడానికి అటువంటి సంస్థలు ఎటువంటి చర్యలు ప్రారంభించాలో తగిన సిఫార్సులను చేయాడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించబడింది. కమిటీ యొక్క నిర్మాణం మరియు దాని విధి విధానాల వివరాలు విడిగా ప్రకటించబడతాయి.

5. ఎన్‌బిఎఫ్‌సిల ద్వారా ఆన్-లేండ్(onlend) చేయడానికి బ్యాంకులకు అనుమతి

ఎగుమతి మరియు ఉపాధి పరంగా ఆర్థిక వృద్ధికి గణనీయంగా దోహదపడే ఆయా రంగాలలో అట్టడుగున ఉన్న సంస్థలకు క్రెడిట్ అందించడంలో ఎన్‌బిఎఫ్‌సిలు పోషించిన పాత్రను గుర్తించి, ఎన్‌బిఎఫ్‌సిల లిక్విడిటీ స్థాయిలను పెంచే ఉద్దేశంతో, మార్చి31, 2020 వరకు వ్యవసాయం / ఎంఎస్‌ఎంఇ / హౌసింగ్‌కు రుణాలు ఇవ్వడానికి బ్యాంకుల మొత్తం పిఎస్‌ఎల్‌లో 5 శాతం వరకు బ్యాంకులు రిజిస్టర్డ్ ఎన్‌బిఎఫ్‌సిలకు (ఎంఎఫ్‌ఐలు కాకుండా) అందించే ఋణాలను ప్రాధాన్యతా రంగ రుణాలు (పిఎస్‌ఎల్) గా వర్గీకరించడానికి బ్యాంకులను అనుమతించాలని ఆగస్ట్ 2019 న నిర్ణయం చేయబడింది. ఈ పంపిణీని తరువాత మార్చి 31, 2021 వరకు పొడిగించారు. డిసెంబర్ 2020 నాటికి నిర్దేశిత ప్రాధాన్యత రంగాలకు NBFCలు రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు NBFC లకు సుమారు, 37,000 కోట్లు రుణాలు ఇచ్చాయి. వేగంగా ఆర్థిక పునరుద్ధరణకు సహాయపడటానికి ఈ రంగాలకు రుణాల నిరంతర లభ్యతను నిర్ధారించే ఉద్దేశ్యంతో, ఆయా రంగాలకు 'ఆన్-లెండింగ్' కోసం బ్యాంకులు ఎన్‌బిఎఫ్‌సిలకు రుణాలు ఇవ్వడానికి పిఎస్‌ఎల్ వర్గీకరణను ఆరు నెలలు సెప్టెంబర్ 30, 2021 వరకు ఎక్స్టెండ్ చేయాలని నిర్ణయించారు.

6. ప్రాధాన్యతా రంగ రుణాల (పిఎస్‌ఎల్) కోసం మార్గదర్శకాలు- ఇ-ఎన్‌డబ్ల్యుఆర్ / ఎన్‌డబ్ల్యుఆర్‌ (eNWR/NWR) ల మీద ఉన్న రుణ పరిమితిని పెంచడం

వ్యవసాయ ఉత్పత్తుల కుదువ / హైపోథెకేషన్ మీద వ్యక్తిగత రైతులకు వ్యవసాయ రుణాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో మరియు గిడ్డంగుల అభివృద్ధి మరియు నియంత్రణ అథారిటీ (WDRA) చే నమోదు చేయబడిన మరియు నియంత్రించబడే గిడ్డంగులచే జారీ చేయబడిన నెగోషియబుల్ వేర్‌హౌస్ రసీదులు (NWR లు) / ఎలక్ట్రానిక్- NWR ల (ఇ-ఎన్‌డబ్ల్యుఆర్) యొక్క స్వాభావిక భద్రతను దృష్టికి తీసుకుని రుణగ్రహీతకు రుణ పరిమితిని 50 లక్షల నుండి 75 లక్షలకు పెంచాలని నిర్ణయించారు. వ్యక్తిగత రైతులకు ఈ ఋణం వ్యవసాయ ఉత్పత్తుల కుదువ / హైపోథెకేషన్ మారుగా జారీ చేయబడిన డబ్ల్యుడిఆర్‌ఎ నమోదు చేసిన మరియు నియంత్రించబడే గిడ్డంగులచే జారీ చేయబడిన ఎన్‌డబ్ల్యుఆర్ / ఇ-ఎన్‌డబ్ల్యుఆర్ మీద ఇవ్వబడుతుంది. ఇతర వేర్‌హౌస్ రసీదుల మద్దతు ఉన్న ప్రాధాన్యతా రంగ రుణ పరిమితి ప్రతి రుణగ్రహీతకు 50 లక్షలుగా కొనసాగుతుంది. దీనికి సంబంధించి సర్క్యులర్ విడిగా జారీ చేయబడుతుంది.

III. ఋణ నిర్వహణ

7. రాష్ట్ర ప్రభుత్వాలు / యుటిల కోసం వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ (డబ్ల్యుఎంఏ) పరిమితుల పై సమీక్ష

రాష్ట్ర ప్రభుత్వాలు / యుటిల కోసం వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ (డబ్ల్యుఎంఏ) పరిమితులను సమీక్షించడానికి మరియు ఇతర సంబంధిత సమస్యలను పరిశీలించడానికి ఒక సలహా కమిటీ (చైర్మన్: శ్రీ సుధీర్ శ్రీవాస్తవ) ని ఆగస్టు 2019 లో రిజర్వు బ్యాంకు ఏర్పాటు చేసింది. ప్రస్తుత పరిమితి, 32,225 కోట్లకు (ఫిబ్రవరి 2016 లో నిర్ణయించబడింది) 46% పెరుగుదలను సూచిస్తూ, మొత్తం రాష్ట్రాలకు సవరించిన పరిమితిని, మొత్తంగా 47,010 కోట్లుగా కమిటీ సిఫార్సు చేసింది. ఇంతకుపూర్వం పెంచిన మధ్యంతర డబ్ల్యుఎంఏ పరిమితి 51,560 కోట్ల ను (గత ఆర్థిక సంవత్సరంలో రిజర్వు బ్యాంకు అనుమతించిన ప్రస్తుత పరిమితుల్లో 60 శాతం పెరుగుదల, మహమ్మారి సమయంలో రాష్ట్రాలు / యుటిలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధిగమించడానికి సహాయపడుతుందని) మరో ఆరు నెలల పాటు కొనసాగించాలని, అంటే 2021 ఏప్రిల్ 1 నుండి 2021 సెప్టెంబర్ 30 వరకు, కూడా కమిటీ సిఫారసు చేసింది. రిజర్వు బ్యాంకు ఈ రెండు సిఫార్సులను అంగీకరించింది.

IV. ఆర్ధిక సమీకరణం

8. ఆర్ధిక సమీకరణ ఇండెక్స్

సగటుమనిషి నుంచి చిన్నా పెద్దా సమీకరణకు మరియు స్థిరమైన అభివృద్ధిని సాధించడానికి ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సమీకరణ ఒక ముఖ్య ఉపకరణం గా చూడబడింది. ప్రభుత్వాలు, రిజర్వు బ్యాంకు మరియు ఇతర నిర్దేశకులకు ఇది ఒక ప్రధాన అంశం అయ్యింది. ఈ విషయంలో గతoలో ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి, గణనీయమైన పురోగతిని సాధించారు. దేశంలో ఆర్ధిక సమీకరణ ఎంతమేరకు జరిగిందని గణన చేయడానికి, భారతీయ రిజర్వు బ్యాంకు ఆర్ధిక సమీకరణ ఇండెక్స్ (FI ఇండెక్స్) ను నిర్మించి ఒక క్రమంలో పబ్లిష్ చేస్తుంది. FI ఇండెక్స్ అనేక పరిమితులమీద (పారామీటర్లమీద) ఆధారపడి ఉంటుంది. దేశంలో ఆర్ధిక సమీకరణ విస్తృతిని మరియు విశాలతను ఈ ఇండెక్స్ ప్రతిబింబిస్తుంది. ప్రారంభంలో, మునుపటి మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరానికి ప్రతి సంవత్సరం జూలైలో FI ఇండెక్స్ ప్రచురించబడుతుంది.

V. చెల్లింపు వ్యవస్థలు

9. సెంట్రలైజ్డ్ పేమెంట్ సిస్టమ్స్ (సిపిఎస్), అంటే ఆర్టిజిఎస్ మరియు నెఫ్ట్ - బ్యాంకులు కాకుండా ఇతర సంస్థలకు సభ్యత్వం

ఆర్‌బిఐ-ఆపరేటెడ్ సెంట్రలైజ్డ్ పేమెంట్ సిస్టమ్స్ (సిపిఎస్) లో సభ్యత్వం - ఆర్‌టిజిఎస్ మరియు నెఫ్ట్ - ఇప్పటివరకు బ్యాంకులకే పరిమితం అయ్యాయి, కొన్నిమినహాయింపులతో క్లియరింగ్ కార్పొరేషన్లు మరియు ఎంపిక చేసిన ఆర్థిక అభివృద్ధి సంస్థల వంటి ప్రత్యేక సంస్థలు తప్ప. గత కొన్ని సంవత్సరాలుగా, చెల్లింపు వ్యవధానంలో వాల్యూం పరంగాని ప్రాముఖ్యత విషయంలో గాని బ్యాంకుయేతర సంస్థల పాత్ర {ఉదా. ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్ (పిపిఐ) జారీచేసేవారు, కార్డ్ నెట్‌వర్క్‌లు, వైట్ లేబుల్ ఎటిఎం (డబ్ల్యుఎల్‌ఎ) ఆపరేటర్లు, ట్రేడ్ రిసీవబుల్స్ డిస్కౌంటింగ్ సిస్టమ్ (టిఆర్‌డిఎస్) ప్లాట్‌ఫారమ్‌లు} గణనీయంగా పెరిగింది. ఎందుకంటే, సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచడం ద్వారా మరియు వినియోగదారుల వారీగా అనుకూలతలు గల పరిష్కారాలను అందించడం ద్వారా, వారు పేరు గణించారు. ఈ ధోరణిని మరింత బలోపేతం చేయడానికి మరియు చెల్లింపు వ్యవస్థల్లో బ్యాంకులేతర భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి, దశలవారీగా, రిజర్వుబ్యాంకు నిర్దేశిత పేమెంట్ సిస్టం ఆపరేటర్లును సిపిఎస్‌లలో ప్రత్యక్ష సభ్యత్వం తీసుకోవాలని ప్రతిపాదించబడింది. ఈ సదుపాయం ఆర్థిక వ్యవస్థలో సెటిల్మెంట్ రిస్క్ ను తగ్గిస్తుందని మరియు యూజర్ సిగ్మెంట్లు అన్నిoటికి మెరుగైన డిజిటల్ ఆర్థిక సేవలను చేర్చగలదని భావిస్తున్నారు. అయితే, ఈ సంస్థలు ఈ సిపిఎస్‌లలో తమ లావాదేవీలను పరిష్కరించుకునేందుకు రిజర్వు బ్యాంకు నుండి ఎటువంటి లిక్విడిటీ సదుపాయానికి అర్హత పొందవు. అవసరమైన సూచనలు విడిగా జారీ చేయబడతాయి.

10. ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ (పిపిఐ) కు అంతరసంచాలనీయత (ఇంటరాపెరాబిలిటీ), మరియు ఖాతా పరిమితిని 2 లక్షలకు పెంపుదల

చెల్లింపు సాధనాల (కార్డులు, వాలెట్లు మొదలైనవి) అభిలషణీయ వినియోగాన్ని ప్రోత్సహించడానికి మరియు దుర్లభ మౌలిక సదుపాయాలు (పోస్ పరికరాలు, ఎటిఎంలు, క్యూఆర్ సంకేతాలు, బిల్-పేమెంట్ టచ్ పాయింట్లు మొదలైనవి) కొరతన ఉన్నందున, దీనిని అధిగమించడానికి బ్యాంకులు లేదా నాన్-బ్యాంకుల మధ్య అంతరసంచాలనీయత (ఇంటరాపెరాబిలిటీ) యొక్క ప్రయోజనాలను రిజర్వు బ్యాంకు చాలాకాలంనుంచి నొక్కి చెప్పడం ప్రారంభించింది. పిపిఐల జారీ మరియు ఆపరేషన్‌లపై అక్టోబర్ 11, 2017 నాటి మాస్టర్ డైరెక్షన్ బ్యాంకులు మరియు నాన్-బ్యాంకులు జారీ చేసిన పిపిఐలలో అంతరసంచాలనీయత (ఇంటరాపెరాబిలిటీ) దశలవారీగా అమలు చేయడానికి రోడ్-మ్యాప్‌ను రూపొందించింది. ఆ తరువాత, అక్టోబర్ 2018 లో జారీ చేసిన మార్గదర్శకాలు పిపిఐలు పూర్తి-కెవైసి (అన్ని KYC రిక్వైర్మెంట్స్ ను కలిగి ఉన్నందున) అంతరసంచాలనీయతను (ఇంటరాపెరాబిలిటీ) (స్వచ్ఛంద ప్రాతిపదిక అయినప్పటికీ) ప్రారంభించాయి. రెండేళ్ళు గడిచినప్పటికీ, పూర్తి-కెవైసి పిపిఐల వైపు మైగ్రేషన్, అందుచేత అంతరసంచాలనీయత (ఇంటరాపెరాబిలిటీ) గణనీయంగా పెరగలేదు. అందువల్ల పూర్తి-కెవైసి పిపిఐలకు మరియు అన్ని అంగీకార మౌలిక సదుపాయాల కోసం, అంతరసంచాలనీయత (ఇంటరాపెరాబిలిటీ)ను తప్పనిసరి చేయాలని ప్రతిపాదించబడింది. పూర్తి-కెవైసికి పిపిఐల మైగ్రేషన్ ను ప్రోత్సహించడానికి, అటువంటి పిపిఐలలోబాకీ బ్యాలెన్స్ పరిమితిని ప్రస్తుత స్థాయి 1 లక్ష నుండి 2 లక్షలకు పెంచాలని ప్రతిపాదించబడింది. అవసరమైన సూచనలు విడిగా జారీ చేయబడతాయి

11. నాన్-బ్యాంకులు జారీ చేసిన పూర్తి-కెవైసి పిపిఐల నుండి నగదు ఉపసంహరణకు అనుమతి

ప్రస్తుతం, బ్యాంకులు జారీ చేసిన పూర్తి-కెవైసి పిపిఐలకు మాత్రమే నగదు ఉపసంహరణకు అనుమతి ఉంది మరియు ఈ సౌకర్యం ఎటిఎంలు మరియు పోస్ టెర్మినల్స్ ద్వారా లభిస్తుంది. అటువంటి పిపిఐని కలిగి ఉన్నవారు, సులభంగా నగదును ఉపసంహరించుకోగలరు గాబట్టి క్యాష్ తీసుకోవడానికిఉత్సాహం చూపరు, తత్ఫలితంగా డిజిటల్ లావాదేవీలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీరిలో పూర్తివిశ్వాసాన్ని నింపే చర్యగా, బ్యాంకుయేతర పిపిఐ ఇష్యూయర్స్ వారి ఫుల్-KYC PPI లకు కూడా , పరిమితికి లోబడి, నగదు ఉపసంహరణ సౌకర్యాన్ని అనుమతించాలని ప్రతిపాదించబడింది. ఈ చర్య, అంతరసంచాలనీయత (ఇంటరాపెరాబిలిటీ) తో కలిసి ఫుల్-KYC PPIల మైగ్రేషన్ లకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది మరియు టైర్ III నుండి VI కేంద్రాలకు అంగీకార మౌలిక సదుపాయాలను కూడా పూర్తి చేస్తుంది. అవసరమైన సూచనలు విడిగా జారీ చేయబడతాయి.

VI. విదేశీ వాణిజ్య ఋణాలు (ఎక్ష్తెర్నల్ కమర్షియల్ బారోయింగ్స్)

12. ఎక్స్‌టర్నల్ కమర్షియల్ బారోయింగ్ (ఇసిబి) నిధులను టర్మ్ డిపాజిట్ లో ఉంచే కాలవ్యవధి పొడిగింపు

ప్రస్తుత ఇసిబి ఫ్రేమ్‌వర్క్ కింద, ఇసిబి రుణగ్రహీతలు ఇసిబి నిధులను టర్మ్ డిపాజిట్లలో భారతదేశంలోని ఎడి కేటగిరీ -1 బ్యాంకులతో గరిష్టంగా 12 నెలల పాటు ఉంచడానికి అనుమతిచబడతారు. కోవిడ్ -19 మహమ్మారి ప్రేరిత లాక్డౌన్ మరియు నిబంధనల కారణంగా ఇప్పటికే డ్రా అయిన ఇసిబిలను ఉపయోగించుకోవడంలో రుణగ్రహీతలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల దృష్ట్యా, ఉపశమనాన్ని అందించే ఉద్దేశ్యంతో పై నిబంధనలను వన్-టైమ్ చర్యగా సడలించాలని నిర్ణయించారు. దీని ప్రకారం, 2020 మార్చి 1 న లేదా అంతకు ముందు డ్రాజరిగి ఉపయోగించబడని ECB నిధులను భారతదేశంలోని AD కేటగిరీ -1 బ్యాంకులతో టర్మ్ డిపాజిట్లలో 2022 మార్చి 1 వరకు నిలిపిఉంచవచ్చు. దీనికి సంబంధించి మార్గదర్శకాలు విడిగా జారీ చేయబడతాయి.

(యోగేశ్ దయాళ్) 
చీఫ్ జనరల్ మేనేజర్

పత్రికా ప్రకటన: 2021-2022/17

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?